నాడు దొంగల రాణి...నేడు చదువుల వాణి

20 Jul, 2014 22:49 IST|Sakshi
నాడు దొంగల రాణి...నేడు చదువుల వాణి

‘‘నిజమే. నేను నేరాలు చేశాను. ఆవేశంలో తప్పటడుగులు వేశాను. కానీ దేవుడి దయ వల్ల సరైన సమయంలో నా తప్పు తెలుసు కున్నాను. లేదంటే ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు నాలాంటి వారందరికీ ఒకటే చెప్తున్నాను. మారడానికి తప్పక ఏదో ఒక అవకాశం వస్తుంది. దాన్ని మిస్ చేసుకోకండి!’’
 
తప్పు చేయని మనిషి ఉండడు. తెలిసో తెలియకో... కావాలనో, పరిస్థితుల ప్రభావం వల్లనో తప్పుడు మార్గంలో పాదం మోపుతారు. అది తప్పు అని తెలిసినా కొందరు తమ దారిని మార్చుకోలేరు. అలవాటు పడిన దారి కదా అని రాజీపడి బతికేస్తారు. కానీ ఆమె అలా అనుకోలేదు. ఇక మీదట తప్పు చేయకూడదు అనుకుంది. తప్పుడు దారి నుంచి తనను తాను మళ్లించు కుంది. మంచి మార్గంలో నడవడమే కాదు... అందరూ ఆదర్శంగా తీసుకునే స్థాయికి చేరుకుంది. చదువుల రాణిగా సన్మానాలు అందుకుంటోంది!
 
తెలిసీ తెలియని వయసులో వేసే తప్పటడుగులు మనిషి ఎటు వంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తాయో చెప్పడానికి బ్రిటన్‌కి చెందిన నటాలీ జీవితానికి మించిన ఉదాహరణ లేదు. బడిలో చదువుతున్నప్పుడే పెడతోవ పట్టింది నటాలీ. పన్నెండేళ్ల వయసులోనే తాగుడుకి అల వాటు పడింది. అది తెలిసి కుటుంబ సభ్యులు బుద్ధిగా ఉండమంటూ తిట్టారు. దాంతో ఇల్లు వదిలి పారిపోయింది. అదే ఆమెను క్రిమి నల్‌గా మార్చింది. అవసరాలు తీరడం కోసం దొంగతనాలు చేసేది. అడిగేవారు లేరు కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా తాగేది. హద్దులు పెట్టేవారు లేక చెడు సంబంధాలు ఏర్పరచుకుంది. పోలీసులకు దొరక్కుండా ఎప్పటికప్పుడు అడ్రస్ మార్చేసేది. అయినా కూడా దాడి, దొంగతనం తదితర కేసుల్లో యాభైసార్లు అరెస్టయ్యింది.     
 
అంతవరకూ బాల నేరస్థుల కారాగారాల్లో శిక్ష అనుభవించిన నటాలీ... పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి పెద్దల కారాగారంలో అడుగుపెట్టింది. ఆమెకు అక్కడ విచిత్రమైన అనుభ వాలు ఎదుర య్యాయి. తను ఏవో చిన్న చిన్న నేరాలు చేస్తుంది. కానీ అక్కడున్న వాళ్లంతా క్రూరంగా హత్యలు చేసినవాళ్లు, కరడుగట్టిన ఖైదీలు. వాళ్ల మధ్య ఉండలేకపోయింది. దానికి తోడు ఆత్మన్యూనతతో కుమిలి పోయిన ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకోవడంతో, నా పరిస్థితి కూడా ఇలానే అవుతుందా అని ఆలోచించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యింది. దాంతో కౌన్సెలర్లను పిలిపించారు జైలు అధికారులు. వారి మాటలు ‘మంచిగా మారాలి’ అన్న పట్టుదలను పెంచాయి తనలో.
 
జైలు నుంచి విడుదలవుతూనే కొత్త జీవితానికి పునాది వేసు కోవడం మొదలుపెట్టింది నటాలీ. స్నేహితుల సాయంతో ఓ చిన్న ఉద్యోగం సంపాదించింది. ఎప్పుడో ఆపేసిన చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. కష్టపడి చదివింది. ఇటీవలే క్రిమినాలజీలో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది... అది కూడా 95 శాతం మార్కులతో! తనలాగా చిన్న వయసులోనే నేరస్థులైన వారిని చక్కదిద్దడం కోసమే క్రిమినాలజీని ఎంచుకున్నానని చెబుతోన్న నటాలీ... లండన్ యూనివర్శిటీలో పీజీ చేసేందుకు సిద్ధపడుతోంది.
 
నటాలీ సాధించిన విజయాన్ని చూసి ‘ఒకనాటి నేరస్థురాలేనా ఈమె’ అంటూ పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అమెరికా జాతీయ విద్యార్థుల సంఘం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డునిచ్చి నటాలీని సత్కరించింది. చెడును వదిలి మంచివైపు అడుగులు వేసిన ఆమె ఎందరికో ఆదర్శమంటూ ప్రపంచమంతా ప్రశంసిస్తోంది!
 

మరిన్ని వార్తలు