కంటే కూతుర్నే కనాలి

21 Apr, 2019 00:19 IST|Sakshi

కన్నప్రేమ

కంటికి రెప్పలా కాచుకునే నాన్నకు చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలతోపాటు కుటుంబంలోని అందరూ తల్లడిల్లిపోతారు. కష్టాలన్నింటిని చిరునవ్వుల మాటున దాచేసి తన వారందరికీ సంతోషాలు పంచే తండ్రి కాస్తంత నీరసంగా కనపడితేనే కుటుంబ సభ్యులంతా కలవరపడతారు. తన భుజాలనే అంబారీగా చేసి సవారి చేయించిన పితాజీ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కన్నబిడ్డలు పడే వేదన అంతా ఇంతా కాదు. చేయి పట్టి నడక  నేర్పించడం దగ్గర నుంచి ప్రయోజకులను చేసే వరకు మార్గదర్శిగా నిలిచిన నాన్నకు కష్టమొస్తే కడుపున పుట్టినవారికి కలత తప్పదు. ఎలాగైనా, ఏం చేసైనా నాన్నను పూర్ణాయుష్కుడిలా చూడాలనుకుంటారు.

తన  తండ్రి ప్రాణాలను నిలబెట్టేందుకు 19 ఏళ్ల యువతి రాఖీ దత్తా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనే ఇప్పుడు రాఖీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ట్వీట్‌తో రాఖీ దత్తా గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. కన్నతండ్రి ప్రాణాలు కాపాడేందుకు రాఖీ దత్తా తన కాలేయంలో 65 శాతం దానం చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో తన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయాన్ని పక్కకుపెట్టి మరీ కాలేయాన్ని ఇచ్చిందని తెలిపారు. తండ్రిపై కూతుళ్లు ఎల్లప్పుడూ అవ్యాజమైన అనురాగాన్ని చూపిస్తుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదన్నారు.

కూతుళ్లు ఎందుకు పనికిరారని వాదించే వారికి రాఖీ దత్తా సమాధానంగా నిలిచిందని ప్రశంసించారు. రాఖీ దత్తా తన తండ్రితో కలిసున్న ఫొటోతో గోయంకా పెట్టిన ఈ ట్వీట్‌కు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఆమెను మెచ్చుకుంటూ పుంఖాను పుంఖాలుగా కామెంట్లు పెడుతున్నారు. రాఖీ దత్తాలా మంచి కూతురిగా ఉండాలనుకుంటున్నామని చాలామంది యువతులు వ్యాఖ్యానించారు. ఎంతో గొప్ప పని చేశావని, నిన్ను చూసి గర్విస్తున్నామని మరికొంత మంది అన్నారు. 

ఎవరీ రాఖీ దత్తా..?
కోల్‌కతాకు చెందిన 19 ఏళ్ల రాఖీ దత్తాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే టెక్నో ఇండియా కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేసింది. కోల్‌కతా యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌ హానర్స్‌  కూడా చదివింది. సాఫీగా ఆమె జీవితం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఆమె తండ్రి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు కాలేయం చెడిపోయిందని, ఆరోగ్యం బాగుపడాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు  సూచించారు. ‘నా కాలేయంలో కొంత భాగం తీసి నాన్నకు పెట్టండి’  అంటూ మరో ఆలోచనకు తావులేకుండా రాఖీ దత్తా స్పష్టం చేయడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కేవలం 19 ఏళ్లున్న యువతి ఎలాంటి బెరుకు లేకుండా అవయవదానానికి ముందుకు రావడం వైద్యులను విస్మయానికి గురిచేసింది. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసేందుకు కోల్‌కతా డాక్టర్లు ముందుకు రాకపోవడంతో సోదరితో కలిసి తన తండ్రిని హైదరాబాద్‌  తీసుకొచ్చింది.

ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజి (ఏఐజీ)లో చేర్పించి తన నిర్ణయాన్ని వైద్యులకు వివరించింది. కత్తిగాటుకు, శరీరంపై గాట్లకు భయపడకుండా తన కాలేయంలో 65 శాతం ఇచ్చి తండ్రికి  పునర్జన్మ ఇచ్చింది. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ కుమారస్వామి, డాక్టర్‌ అనిష్‌ మిశ్రా, డాక్టర్‌ ఆనంద్‌ కులకర్ణిలతో కూడిన బృందం విజయవంతంగా కాలేయ మార్పిడి పూర్తి చేశారు. ఆపరేషన్‌  అనంతరం రాఖీ దత్తా తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. ఇంత ఘనకార్యం చేసిన రాఖీదత్తా ఎప్పుడూ చెప్పే మాటలు ‘కలలు కనడం ఆపకండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి. ముఖంపై చిరునవ్వును వెలిగించండి. ఆందోళన వదిలేయండి. జరిగిపోయిన దానిగురించి బాధ పడకండి. అన్వేషిస్తూ ఎదగండి’. నిజంగా రాఖీ దత్తా గ్రేట్‌!
సానుకూల పరిణామం
మనదేశంలో తండ్రులకు కాలేయ దానం చేస్తున్న యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్‌కు ఆయన కుమార్తె శ్రీ ప్రశాంతి కాలేయం దానం చేశారు. రెండేళ్ల క్రితం నవీ ముంబైకు చెందిన 22 ఏళ్ల పూజా బిజార్నియా కూడా తన తండ్రి శ్రీరామ్‌కు కాలేయం దానం చేశారు. ఆమె కుటుంబంలో నలుగురు ముందుకు రాగా పూజ మాత్రమే 12 టెస్ట్‌ల్లో పాసయి లివర్‌ ఇవ్వగలిగారు. తండ్రి  కోసం తన క్రీడాజీవితాన్ని వదులుకునేందుకు కూడా ఆమె సిద్ధపడ్డారు. అవయవదానం చేయడానికి యువతులు ముందుకు రావడం సానుకూల పరిణామమని వైద్యులు అంటున్నారు. అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని నొక్కి చెబుతున్నారు.   
పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు