ప్రశ్నోత్తరాలుగా... రామాయణ మహాకావ్యం

13 Mar, 2016 00:34 IST|Sakshi
ప్రశ్నోత్తరాలుగా... రామాయణ మహాకావ్యం

పుస్తకం
శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని అనేకమంది రుషులు, కవులు, పండితులు, భాషావేత్తలు అనేక కోణాలలో పరిశీలించి, పరిశోధించి, అందులోని అమృతోపమానమైన విషయాలను వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో  పదిమందికీ పంచుతున్నారు. అయితే ఈ ఉరకలు పరుగుల జీవితంలో అంతంత విస్తారమైన గ్రంథాలను చదివి, ఆస్వాదించే ఓపిక, తీరిక అందరికీ ఉండడం లేదు. అలాకాకుండా రామాయణ కథావస్తువును కూడా సులువుగా, సరళంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందించాలనే తాపత్రయంతో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ నండూరు గోవిందరావు రామాయణాన్నంతటినీ  ప్రశ్నోత్తరాల రూపంలో అందిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ‘శ్రీ మద్రామాయణము ప్రశ్నోతర మాలిక’ను రచించారు. ఇందులో రామాయణంలోని బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు విషయాన్నంతటినీ ప్రశ్నలు- సమాధానాలుగా అందించారు.

ఆయా కాండలలోని విషయాల ఆధారంగా ఉత్తరకాండలో అత్యధికంగా 507 ప్రశ్నోత్తరాలను, సుందరకాండలో అత్యల్పంగా 181 ప్రశ్నోత్తరాలను పొందుపరిచారు. వివరణ అవసరమైన వాటికి విపులంగానూ, లేనిచోట క్లుప్తంగానూ సమాధానాలిచ్చారు. ప్రశ్నలో కూడా ఎంతో విషయాన్ని, వివరణను ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఈ ఆచార్యులవారు గతంలో మహాభారతాన్ని కూడా ఇదేవిధంగా ప్రశ్నోత్తర మాలికగా అందజేశారు. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, అందుకు తగిన అధ్యయన శక్తి, వాటికి భక్తిశ్రద్ధలను జతచేస్తే చాలు... ఎంతటి నిగూఢ విషయాలనైనా సులువుగా తెలియచేయవచ్చునని నిరూపించారు. మొత్తం మీద రామాయణమనే కొండను అద్దంలో చూపించే ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఈ ప్సుతకం అవశ్య పఠనీయం.

శ్రీమద్రామాయణము, పుటలు: 320; వెల రూ. 200,
ప్రతులకు: డాక్టర్ నండూరు గోవిందరావు, 303, పార్క్‌వ్యూ రెసిడెన్సీ, బతుకమ్మకుంట,
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్- 500 013; సెల్: 9849801490; తెలుగు బుక్‌హౌస్,
కాచిగూడ, హైదరాబాద్; విశాల్ బుక్‌షాప్, నల్లకుంట, హైదరాబాద్. - డి.వి.ఆర్.

మరిన్ని వార్తలు