కంటినిండా నిద్రకు కుంకుమ పువ్వు

2 Mar, 2020 03:32 IST|Sakshi

ఎంత ప్రయత్నించినా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? తెల్లవార్లూ మంచంపై పొర్లుదండాలు పెడుతున్నారా? కంటినిండా నిద్రపోవాలంటే ఏం చేయాలో చెప్పండర్రా అని అందరినీ అడుగుతున్నారా? చాలా సింపుల్‌. కాసింత కుంకుమపువ్వు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డాక్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థం ఒకటి నిద్రకు బాగా ఉపకరిస్తుందని వీరు ప్రయోగపూర్వకంగా గుర్తించారు. పద్దెనిమిది ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యవయస్కులు కొందరిని ఎంపిక చేసి వారిలో కొందరికి రోజూ 14 మిల్లీగ్రాముల కుంకుమపువ్వు నుంచి తీసిన పదార్థాన్ని ఇచ్చారు. మిగలిన వారికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. వీరందరికీ నిద్రలేమి సమస్యలు ఉన్నాయని, ముందుగానే తెలుసు. అంతేకాకుండా వీరు ఏ రకమైన మందులు తీసుకోవడం లేదు. నాలుగు వారాల పాటు జరిగిన పరీక్ష తరువాత పరిశీలించినప్పుడు కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడుతున్న వారికి మెరుగైన నిద్ర పడుతున్నట్లు తెలిసింది. ఏడు రోజుల తరువాతి నుంచే తమ నిద్ర నాణ్యతలో మెరుగుదల కనిపించిందని ప్రయోగంలో పాల్గొన్న వారు చెప్పారు. పైగా కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడటం ద్వారా ఎలాంటి దుష్ప్రభావమూ కనిపించలేదు కూడా. ఇప్పుడు మరింత విస్తత స్థాయిలో మరోసారి ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను నిర్ధారించుకుంటామని అడ్రియన్‌ లోప్రెసెటీ అనే శాస్త్రవేత్త తెలిపారు.

మరిన్ని వార్తలు