నాన్నను చూసి ఎంచుకున్నాం

7 Mar, 2020 02:57 IST|Sakshi
స్వప్నా దత్, ప్రియాంకా దత్‌

►స్క్రీన్‌ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? 
స్వప్నా దత్‌: సినిమా నిర్మాణం ఎందుకు ఎంచుకున్నాం అంటే మా నాన్నగారిని (అశ్వనీదత్‌) చూశాం. ఆయన ప్యాషన్‌తో సినిమాలు నిర్మించడం చూశాం. కథను ఎంచుకోవడం, నటీనటులను, దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వంటి విషయాలు చూసి ప్రొడక్షన్‌ మీద ఇంట్రెస్ట్‌ పెరిగింది. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా యాక్టింగ్‌ అయినా, డిజైనింగ్‌ పైన అయినా ఆసక్తి చూపుతారు. కానీ మా ఇంట్లో అంత మంచి ఎగ్జాంపుల్‌ ఉన్నప్పుడు నిర్మాణం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. సినిమా నిర్మాణమే అన్నింటికంటే సాహసమైనది అనిపించింది. అదే చేస్తున్నాం (నవ్వుతూ).

►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్‌ లొకేషన్‌లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? 
ప్రియాంకా దత్‌: నిర్మాత ఆడవారైనా మగవారైనా సరే అందరూ సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలి. లేడీ నిర్మాతలంటే.. మేం కొంచెం ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాం కాబట్టి సెట్లో అమ్మాయిలు ఉంటే వాళ్లు సేఫ్‌గా ఇంటికి వెళ్లగలుగుతున్నారా? వాళ్ల బాత్‌రూమ్స్‌ సరిగ్గా ఉంటున్నాయా? అని చూస్తాం. అలాగే ఏదైనా ఇష్యూలు వస్తే వెంటనే మాతో చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. మా మేనేజర్లతో అన్నీ సరిగ్గా చూసుకోమని చెబుతాం. నిర్మాత ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే సెట్లో అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్‌ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? 
స్వప్నా: ఇది ఆడా మగా సమస్య అని చెప్పను.  కొంచెం మేల్‌ డామినేటెడ్‌ ప్రపంచంలో ఉమెన్‌కి కచ్చితంగా చాలెంజెస్‌ ఉంటాయి. కష్టం అయితే అందరికీ ఒకటే. రామానాయుడిగారి అంత విజన్‌ ఉంటే ప్రయత్నించొచ్చు అనుకుంటా.

►నాన్నగారి బాటలో నిర్మాతలు అయి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, దేవదాస్‌ వంటి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడి ఏమైనా?
స్వప్నా: అవును. ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఉంటుంది. అలాంటిది 50 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ (వైజయంతీ మూవీస్‌)ను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ప్రెషరే. అలాగే ప్లెషర్‌ కూడా.

►లేడీ ప్రొడ్యూసర్స్‌ ఎదుర్కొనే చాలెంజ్‌లు? 
స్వప్నా:  ప్రొడక్షన్‌ అంటేనే చాలెంజ్‌. ప్రొడ్యూసర్స్‌ అంటేనే చాలెంజెస్‌ ఎదుర్కొనేవారు.  అందులో ఆడామగా అని ఉండదనుకుంటున్నాను. జెన్యూన్‌గా సినిమా తీసేవాళ్లకు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు