అది సరేనయ్యా..!

10 Apr, 2014 22:51 IST|Sakshi
అది సరేనయ్యా..!

అమెరికా సంయుక్త రాష్ట్రాల 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆయన ఎంత రాజనీతిజ్ఞుడో అంతటి దైవభక్తిపరుడు. దేశం రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నప్పుడు, సైనిక సంక్షోభంలో ఉన్నప్పుడు, మానవీయ విలువల సంక్షోభంలో ఉన్నప్పుడు, సంక్షోభాలన్నీ కలిసి అంతర్యుద్ధంగా మారినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆయన సమైక్యంగా ఉంచగలిగారు. దైవభక్తి ఆయన ప్రధాన బలం.

రోజూ తెల్లవారుజామున నాలుగింటికే లేచి ఐదింటివరకు ఆయన ప్రార్థనలో కూర్చునేవారు. భక్తి వచనాలు పఠించేవారు. ఇది కనిపెట్టి,  నాస్తికులైన కొందరు వైట్‌హౌస్ ఉన్నతస్థాయి ఉద్యోగులు ఆయన దృష్టిలో పడడం కోసం సందు దొరికినప్పుడల్లా ఆయన ముందు ఆస్తికత్వాన్ని నటించేవారు. అయిన దానికి కాని దానికీ దేవుడి ప్రస్తావన తెచ్చేవారు .

ఓసారి ఇలాగే - అంతర్యుద్ధ సమయంలో - సైనికోద్యోగి ఒకరు వైట్‌హౌస్‌లో లింకన్ దగ్గరికి వచ్చారు. ‘‘ఎలా ఉంది పరిస్థితి?’’ అని అతడిని అడిగారు లింకన్. ‘‘దేవుడు మనవైపు ఉన్నాడు’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘దక్షిణ ప్రాంత రాష్ట్రాలు మన దారిలోకి వస్తున్నాయా?’’ అని అడిగారు లింకన్. దానికి కూడా ఆ వ్యక్తి ‘‘దేవుడు మనవైపు ఉన్నాడు’’ అని చెప్పాడు. లింకన్ చిరాకు పడ్డారు. ‘‘దేవుడు మన వైపు ఉన్నాడు సరే, మనం దేవుడి వైపు ఉన్నామా? అది చెప్పవయ్యా!’’ అన్నారు లింకన్, కోపాన్ని ఆపుకుంటూ. ఆ వైట్‌హౌస్ ఉద్యోగి మళ్లీ నోరెత్తలేదు.                                                  

మరిన్ని వార్తలు