న్యూస్‌ రక్షా గన్‌ధన్‌

22 Jan, 2020 02:30 IST|Sakshi

వారణాసికి చెందిన శ్యామ్‌ చౌరాసియా.. మహిళల కోసం గన్‌లు తయారు చేశారు! బుల్లెట్‌ సైజులో ఉండే లిప్‌స్టిక్‌లో కూడా ఆ గన్‌లను అమర్చవచ్చు. అంతేకాదు.. పర్సులో,   షూస్‌లో కూడా అవి ఇమిడిపోతాయి. మహిళలు తమకు ప్రమాదం ఎదురవుతోందని గ్రహించిన వెంటనే వీటికి అమర్చిన బటన్‌ను నొక్కాలి. తక్షణం గన్‌ బయటికొస్తుంది. మొబైల్‌ ఫోన్‌ మర్చిపోయి బయటికెళ్లినా సరే... లిప్‌స్టిక్‌కున్న బటన్‌ నొక్కగానే బ్లూ టూత్‌తో అనుసంధానం అయి ఉన్న ఫోన్‌ నుంచి ఎమర్జెన్సీ కాల్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తుంది. పోలీసులు వచ్చేలోపు ఆ లిప్‌స్టిక్‌తోనే ఫైర్‌ చేసి సమస్యను చుట్టుపక్కల వారి దృష్టికి తీసుకెళ్లి సహాయం కోరవచ్చు.శ్యామ్‌ వారణాసిలోని అశోకా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగి.

అతడు రూపొందించిన ఈ గన్‌ పర్సు, గన్‌ లిప్‌స్టిక్, గన్‌ షూస్‌ అందరిలోనూ ఆసక్తిని కలగుజేస్తున్నాయి. ‘‘మహిళల మీద లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రక్షణసాధనాల అవసరం చాలా ఉంది’’ అన్నారు వీటిని పరిశీలించిన ప్రియాంక శర్మ అనే మహిళ. వార్తల్లో తరచు మహిళల మీద జరిగిన అత్యాచారాలే కనిపిస్తుండడంతో మనసు కదిలిపోతుండేదని, మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా సాధనం చేతిలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో వీటిని తయారు చేశానని శ్యామ్‌ చెబుతున్నారు. ‘‘భారతీయ మహిళలకు మాత్రమే కాదు, వీటి అవసరం అన్ని దేశాల్లోనూ ఉంది’’ అని కూడా ఆయన అన్నారు. ఈ గన్‌ పర్సులు, గన్‌ లిప్‌స్టిక్‌లు, గన్‌ షూస్‌ మార్కెట్‌లోకి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ప్రస్తుతం శ్యామ్‌ చౌరాసియా వీటికి పేటెంట్‌ పొందే పనిలో ఉన్నారు.


 

మరిన్ని వార్తలు