ప్రకృతిని కాపాడుకోవాల్సిందీ మనమే!

9 Jun, 2020 00:07 IST|Sakshi

పర్యావరణం

ఇరవై ఏళ్లుగా శబ్ద కాలుష్యం, తరిగిపోతున్న అడవుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. 59 ఏళ్ల వయస్సులోనూ రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతూనే ఉన్నారు. ఇసుక మాఫియా చేతుల్లో మరణం అంచులకు వరకు వెళ్లినా పర్యావరణాన్ని కాపాడటానికి తనవంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘మనల్ని ప్రకృతి కాపాడాలంటే..  మనం ప్రకృతిని కాపాడుకోవాలి’ అనే సుమైరా అబ్దుల్‌ అలీ వివిధ మార్గాలలో ప్రకృతి వినాశకర  శక్తులతో నిత్యం పోరాడుతూనే ఉన్నారు. తుఫాన్లు సృష్టిస్తున్న అల్లకల్లోలం, అంతుతెలియని అంటువ్యాధులు ప్రబలడంపై ప్రకృతిని కాపాడుకోవడమే మన ముందున్న మార్గం అంటూ ఆమె తన గళాన్ని మరోసారి వినిపిస్తున్నారు.

‘అరేబియా సముద్రంలో తలెత్తిన వాతావరణ మార్పుల ప్రభావంతో నిసర్గ తుపాను మొదలైన ఒక్కరోజులోనే ముంబయ్‌లో వందలాది చెట్లు  నేలకూలాయి. పర్యావరణానికి ప్రాణమైన చెట్లు ఏదో విధంగా అంతటా తగ్గిపోతూ ఉంటే జరిగే హాని ఇంకా ఇంకా వేగం పుంజుకుంటూనే ఉంటుంది..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుమైరా. 2004లో ఇసుక మాఫియా తనపై జరిపిన దాడితో ఉద్యమకారుల రక్షణ కోసం దేశంలో మొట్టమొదటిసారి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ముంబయ్‌ వాసి సుమైరా అబ్దుల్‌ అలీ. అవాజ్‌ ఫౌండేషన్, మిత్రా సంస్థల వ్యవస్థాపకురాలు. ఆసియాలోనే అతిపెద్ద పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ది బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కార్యదర్శి, పాలక మండలి సభ్యురాలు. ఇంకా ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి చురగ్గా పనిచేస్తున్నారు.

ఇవే కాకుండా చట్టాల లొసుగులను ఎండగట్టే చురుకైన ఉద్యమ కారిణిగా, ప్రజాప్రచారాల డాక్యుమెంటరీ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా, టెలివిజన్‌ హోస్ట్‌గా, పత్రికా కథనాల ద్వారా కాలమిస్ట్‌గా ఆమె పరిచితురాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మీద సుమైరా స్పందిస్తూ ‘మన దేశంలో పర్యావరణాన్ని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోతున్నాం. ఇరవై ఏళ్ల క్రితం ఇసుక తవ్వకం, శబ్ద కాలుష్యం, అడవులు తగ్గిపోవడం.. అనే అంశాలపై ప్రజలతో చర్చించినప్పుడు ఈ సమస్య ఎవరికీ అర్థం కాలేదు. ఇసుక తవ్వకాలు పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రజలకు వివరించడం నాడు ఓ సవాల్‌ అయ్యింది. ఇప్పడూ ఈ విషయంలో పెద్ద మార్పేమీ లేదు. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెరగాలి’ అంటారు ఆమె.

పణంగా ప్రాణాలు
59 ఏళ్ల సుమైరా వివిధ వేదికల ద్వారా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా, వాటిని నివారించడానికి మార్గాలను కూడా సూచిస్తుంటారు. ఇసుక మాఫియా ముఠా తనను రెండుసార్లు చంపడానికి ప్రయత్నించిన రోజులను సుమైరా గుర్తు చేసుకుంటూ ‘ఈ సమస్యపై చేసే పోరాటంలో చెడు దశలను చూశాను. కానీ అవి నా లక్ష్యాన్ని ఎప్పుడూ తాకలేకపోయాయి’ అని చెబుతున్నప్పుడు ఆమెలోని పోరాట పటిమ కళ్లకు కడుతుంది. పర్యావరణ రంగంలో చేసిన విశేష కృషికి అశోక ఫెలోషిప్, మదర్‌ థెరెసా అవార్డులను సుమైరా అందుకున్నారు. ప్రకృతి చెబుతున్న పాఠాలను అర్థం చేసుకుంటూ మనగలిగితేనే మానవ మనుగడ.  పర్యావరణం దెబ్బతినకుండా కాపాడే విధానాలను సూచించే సుమైరా వంటి పర్యావరణవేత్తలంతా మానవాళికి దిశానిర్దేశం చేస్తున్నవారే. – ఆరెన్నార్‌

మరిన్ని వార్తలు