టోపీ ఎందుకు పెట్టుకున్నారు?

25 Jul, 2018 00:05 IST|Sakshi

సహజీవనం

ప్రస్తుతం పరమత ద్వేషానికి సంబంధించిన  అంశాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. దేశ ఔన్నత్యాన్ని పెంచే అనేక అంశాలను కథలుగా ప్రచారంలోకి తీసుకువెళ్లడం వల్ల పరమత సహనం అలవడుతుందని తన అనుభవాన్ని మేఘన అత్వానీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్టింగ్‌ను వినూ మాథ్యూ ఫేస్‌బుక్‌లో గత వారం తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టింగ్‌ వైరల్‌ అవుతోంది.

ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌...
‘ముస్లిములు తల మీద టోపీ ఎందుకు పెట్టుకున్నారు?’ అని కుమార్తె అడిగిన ప్రశ్నకు ఆ తల్లి చెప్పిన చక్కని సమాధానం...నేను ఢిల్లీలో ఊబర్‌ పూల్‌లో ప్రయాణిస్తున్నాను. ఆ క్యాబ్‌లో అందరి కంటె ముందుగా నేనే ఎక్కాను. నా తరవాత ఒక యువతి తన చిన్న కుమార్తెతో క్యాబ్‌ ఎక్కారు. మరో కిలో మీటరు ప్రయాణించాక ఒక ముస్లిం యువకుడు క్యాబ్‌లో డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్నాడు. తల మీద సంప్రదాయ టోపీ ధరించాడు ఆ యువకుడు. అది చూసి ‘‘అమ్మా, ఈ అంకుల్‌ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? బయట కూడా ఎండ లేదు కదా!’’ అని అడిగింది. అప్పటివరకు క్యాబ్‌లో ఎఫ్‌ ఎం రేడియో సన్నగా వినిపిస్తోంది. ఆ ముస్లిం యువకుడు డ్రైవర్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. నేను పుస్తక పఠనంలో మునిగిపోయాను. ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా నా కళ్లు పుస్తకం నుంచి బయటకు వచ్చాయి. ముస్లిం యువకుడితో డ్రైవర్‌తో మాటలు ఆపేసి, రేడియో వాల్యూమ్‌ తగ్గించాడు. ఆ పాపకు నేను ఏదో సమాధానం చెప్పబోయాను. అప్పటికే సమాధానంతో సిద్ధంగా ఉన్న ఆ పాప తల్లి ‘‘నేను గుడికి వెళ్లినప్పుడు, మనింటికి పెద్దలు వచ్చినప్పుడు, తాతయ్య వాళ్ల కాళ్లకు నమస్కారం చేసేటప్పుడు తల మీద ముసుగు వేసుకుంటాను కదా! ఇతరుల పట్ల మనం చూపించే గౌరవానికి ప్రతీక’’ అని చెప్పింది తల్లి. ఆ మాటలు బాగానే అనిపించాయి. అంతలోనే మరో సందేహం కలిగి, ‘‘ఈ అంకుల్‌ ఎవరి పట్ల మర్యాద చూపిస్తున్నాడు. ఇక్కడ గుడి లేదు, అంకుల్‌ ఎవరి కాళ్లకి నమస్కారం పెట్టట్లేదు, పెద్దలు ఎవ్వరూ లేరు కదా’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు కూడా తల్లి ఎంతో నెమ్మదిగా, ‘‘పెద్దలు కనపడగానే నమస్కారం చేయాలని నేను నీకు నేర్పించాను కదా, అదేవిధంగా అందరి పట్ల గౌరవంగా ఉండమని వాళ్ల పేరెంట్స్‌ నేర్పించారు అంకుల్‌కి. అంకుల్‌తో పాటు మనమందరం ఉన్నాం కదా’’ అంది తల్లి.ఇంతటి సంస్కారవంతమైన సమాధానం ఎవ్వరూ ఊహించలేదు. ఆ ముస్లిం యువకుడు కూడా ఇటువంటి సమాధానం వస్తుందని అనుకుని ఉండడు. క్యాబ్‌ ముందుగా నేను ఎక్కడం వల్ల నా డ్రాపింగ్‌ ముందే వచ్చింది. ఆ తల్లి చెప్పిన సమాధానం గురించి ఆలోచిస్తూ క్యాబ్‌ దిగేశాను. తోటి వారి గురించి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించాలి. ప్రతి ఇంట్లోను పిల్లలకు తల్లిదండ్రుల ఈ విధంగా బోధించాలి. ఈ తరం పిల్లలకు ఇటువంటివి అలవడాలి అనుకున్నాను.  (మేఘనా అత్వానీకి కృతజ్ఞతలతో)
– రోహిణి

ఆ షేర్‌ క్యాబ్‌లో తల్లికూతుళ్లు, మేఘన, ఒక ముస్లిం యువకుడు ప్రయాణిస్తున్నారు. ఆ యువకుడు తల మీద ధరించిన తెల్ల టోపీని చూసిన ఆ చిన్నారి తల్లితో, ‘‘సాయంత్రం వేళ ఈ అంకుల్‌ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? ఎండగా కూడా లేదు కదా!’’ అని అడిగింది. ఆ చిన్నారి అమాయకంగా అడిగిన ప్రశ్నకు తల్లి చెప్పిన సమాధానం విన్నాక ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా, మానవత్వానికి ప్రతీకగా అనిపించింది.
– వినూ మాథ్యూస్‌

ఒక్కో నీటి బిందువు కలిస్తేనే సముద్రం అయినట్లు, పరమత సహనం అలవర్చుకోవాలనే విత్తనాన్ని పిల్లలలో నాటితే, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలనే ఆలోచన చిగుళ్లు వేసి మహావృక్షం అవుతుంది. పరమత సహనం అలవడుతుంది. దేశంలో పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతాయి. 
– మేఘన అత్వానీ 

మరిన్ని వార్తలు