ఆరోగ్యంతో కర‘చాలనం’

22 Sep, 2017 21:07 IST|Sakshi
ఆరోగ్యంతో కర‘చాలనం’

శరీరంలోని కీళ్లు, కండరాలను  రిలాక్స్‌ చేయడానికి ఫ్లెక్సిబులిటీ పెరగడానికి ఆక్సిజన్‌  సరఫరా బాగా జరగడానికి ప్రతి  అవయవానికి చేసే వ్యాయామాలను యోగ పరిభాషలో అంగచాలనాలు, అంగబంధనాలు అంటారు. బ్రహ్మ ముద్రల తర్వాత చేయవలసిన కొన్ని చాలనాలివి.

అథో  మేరు చాలన (వామ దక్షిణ)
ఎడమ వైపునకు చాలనం చేసేటప్పుడు కుడి చేతిని పక్క నుంచి పైకి తీసుకెళ్లి మోచేయి పైకి చూపించే విధంగా కుడి అరచేయి ఎడమ భుజంపైకి, ఎడమ చేయి కింద నుంచి నడుం వెనుకకు వచ్చే విధంగా చేయాలి. ఇదే విధంగా మళ్లీ రెండవవైపు కూడా చేయాలి. ఒక కాలు స్థిరంగా ఉంచి రెండవ కాలి మడమపైకి లేపి చేసినట్లయితే పూర్తి స్థాయిలో ట్విస్టు అయిన అనుభూతి పొందవచ్చు. ఇలా 5 లేదా 10 రిపిటీషన్లు చేయాలి.

ఉపయోగాలు
ఊపరితిత్తుల పై భాగాలకు, మెదడులోని భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. దీని వలన అల్జీమర్స్, పార్కిన్‌సన్, బ్రెయిన్‌ ఎటక్సియా వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. భుజాలు, పై భాగాలకు, మెడకు మంచి వ్యాయామం అందుతుంది.  స్టెర్నో క్లెయిడో మస్టాయిడ్‌ కండరాలకు, డీప్‌ నెక్‌ ఫ్లెక్సార్‌ కండరాలకు వ్యాయామం జరిగి మెడకు సంబంధించిన సమస్యలతో పాటు, సర్వైకల్‌ స్పాండిలైటిస్, మైగ్రేన్‌ సమస్యల నుంచి విముక్తికి సహకరిస్తుంది.


ముఖ్య గమనిక
అన్ని చాలనములు చేసేటప్పుడు ఎటువంటి తొందరపాటు పనికిరాదు. శ్వాస తీసుకుంటూ, వదులుతూ నిదానంగా చేయడం, చేతుల కదలికల స్థాయి కొంచెం ఎక్కువగా ఉండేట్టు జాగ్రత్తగా చేయడం ముఖ్యం. అప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది.  ఈ మూడు చాలనములు చేయడం వలన వృద్ద్ధాప్యంలో వచ్చే లోడోసిస్, కైపోసిస్, స్కోలియోసిస్‌ సమస్యలను నివారించవచ్చు. ఒకవేళ ఇప్పటికే అటువంటి డీవియేషన్‌ ఉన్నట్టయితే వాటి కరెక్షన్‌కు ఉపకరిస్తుంది.

మధ్య మేరు చాలన (వామ దక్షిణ)
రెండు కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచి చేతులు రెండూ కిందకు ఫ్రీగా వదిలేసి శ్వాస తీసుకోవాలి.  ఎడమవైపునకు శ్వాస వదులుతూ కుడివైపునకు నడుమును, శరీరాన్ని ట్విస్ట్‌ చేయాలి. (5 నుంచి 10 సార్లు చేయాలి)

ఉపయోగాలు
నడుం కింది భాగాలకు సున్నితమైన వ్యాయామం. ఎల్‌1 నుంచి ఎల్‌5 వరకూ ఉన్న సమస్యలకు మంచిది. పెద్ద ప్రేవు మీద కూడా ప్రభావం చూపడం వల్ల మలబద్ధకం వంటి సమస్యను పరిష్కరించవచ్చు. ఎడ్రినల్‌ గ్రంధులకూ వ్యాయామం జరగడం వలన క్రానిక్‌ ఫాటిగ్‌ సిండ్రోమ్‌ను తీసేయడానికి స్ట్రెస్‌ హార్మోన్‌ అయిన కార్టిజోల్‌ను రెగ్యులేట్‌ చేయడానికి ఉపయోగపడుతుంది.

గమనిక
పాదాలు రెండూ నేల మీద ఫిక్స్‌డ్‌గా ఉంచి శరీర కదలిక పక్కలకు  ఉండవలెను.

ఊర్థ్వ మేరుచాలన (వామ దక్షిణ)
రెండు పాదాలు వీలైనంత దూరంలో ఉంచి చేతులు రెండు పక్కలకు చాచి శ్వాస తీసుకుంటూ ఎడమవైపునకు శ్వాస వదులుతూ కుడివైపునకు శరీరాన్ని వెన్నెముకను ట్విస్ట్‌ చేస్తూ ఒక చేయి వెనుక నడుము మీదకు ఇంకో చేయి ఎడమవైపు తిరిగినప్పుడు, కుడి కాలి మడమను, కుడివైపునకు తిరిగినప్పుడు ఎడమ కాలి మడమను పైకి లేపినట్లయితే ట్విస్టు తేలికగాను ప్రభావంతంగానూ ఉంటుంది (5 నుంచి 10 సార్లు చేయాలి).

ఉపయోగాలు
డోర్సల్‌ స్పైన్‌కు మంచిది. పొట్ట భాగాలకు, జీర్ణవ్యవస్థకు తేలికపాటి వ్యాయామం అందుతుంది. ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం జరుగుతుంది.
ఎ.ఎల్‌.వి కుమార్‌ట్రెడిషనల్‌  యోగా ఫౌండేషన్‌
సమన్వయం: ఎస్‌. సత్యబాబు
మోడల్‌: ఈషా హిందోచా

 

మరిన్ని వార్తలు