నువ్వు నీలా ఉండటమే ఆనందం!

25 Aug, 2017 00:02 IST|Sakshi
నువ్వు నీలా ఉండటమే ఆనందం!

ఆత్మీయం

కూలిపని చేసుకునే వారినుంచి కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందమే. ఏ పని చేసినా ఆనందం కోసమే. ప్రతిక్షణం ఆనందం కోసమే పాకులాడతారు. ఆనందం ఎక్కడ ఉందో అని ప్రతిచోటా వెదుకుతారు. కాని దానిని ఎప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఇంత శాస్త్రీయ పురోగతి సాధించి అత్యాధునిక సౌకర్యాలు, విలాసాలు అనుభవించినా ఎందుకు ఇంకా దుఃఖంలోనే ఉన్నాడు. భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించినా అంతర్గతంగా మాత్రం బికారిలాగే ఉన్నాడు. ఎందుకిలా జరుగుతోంది? అనే సందేహం మనలో చాలామందిని వేధిస్తోంది.

మొట్టమొదట తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనందం అనేది ఎక్కడోవెతికితే దొరికే విషయం కాదు. అది ప్రతి వ్యక్తి లోనూ అంతర్గతంగా ఉంటుంది. అసలు నీ సహజ స్థితే ఆనందం. దానికోసం ఎక్కడ వెతికినా ఆనందానికి దూరమైనట్టే. ఒక ముసలామె సూది ఇంట్లో పోగొట్టుకొని దానికోసం ఇంటి వెనకాల వెతికిందట. ఆలా ఉంది మన పరిస్థితి. ఇంతకాలం భౌతిక విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ సమయాన్ని వృథా చేసుకున్నాం. నీవే ఒక సచ్చిదానంద స్వరూపం. ‘ఆనందం నాలో ఉండటమేంటి? అని సందేహం వచ్చింది. సత్తు అంటే సత్యం అంటే ఈ క్షణం. చిత్తు అంటే మనస్సు అంటే నా మనస్సు ఈ క్షణంతో సంపూర్ణంగా ఉన్నప్పుడు కలిగేదే సచ్చిదానందం. మనం ఏ పని చేసేటప్పుడు ఆ పనిలో పూర్తిగా లీనం అవుతూ చేయాలి.

ఐస్‌క్రీమ్‌ తినేటప్పుడు దానిని హాయిగా తినాలి. ఆనందించాలి. చాకొలేట్‌ చప్పరించేటప్పుడు ఆ తియ్యదనాన్ని పూర్తిగా అనుభవిస్తూ చప్పరించాలి. పని విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆడుతు పాడుతూ పని చేస్తే అలుపూ సొలుపూ ఉండదన్న సినీ కవి పాటలాగే ఆనందంగా చేస్తే ఆస్వాదిస్తాం. లేదంటే భారంగా ఉంటుంది. పిల్లలకీ, పెద్దలకీ అదే తేడా! చాకొలేట్‌ తినేటప్పుడు వాళ్లు మరో పని మీద దృష్టి పెట్టరు. అది నోటినిండా, మూతినిండా అవుతోందని లెక్కపెట్టరు. అన్నం తినేటప్పుడూ, పడుకునేటప్పుడూ కూడా అంతే! అందుకే ఆనందంగా ఉండాలంటే మనం మళ్లీ మరోసారి పిల్లలమైపోదాం.
 

మరిన్ని వార్తలు