కోటి కళల మైనా... నవ తెలంగాణ

4 Jan, 2015 00:15 IST|Sakshi
కోటి కళల మైనా... నవ తెలంగాణ

ఏళ్ల నాటి తపస్సు ఫలించి అవతరించిన స్వరాష్ట్రం ‘కళకళ’లాడాలని నవతరం కోరుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతి ధాటికి పాతబడిపోతున్న పల్లె కళలకు కొత్త వసంతం తెస్తామంటోంది. సాంస్కృతిక బానిసత్వాన్ని అడ్డుకుంటూ... సంప్రదాయ వారసత్వాన్ని మోసుకుంటూ... కోటి కళల వీణ... మా తెలంగాణ అని నిరూపిస్తామంటోంది. శిల్పారామంలో నిర్వహించిన యువజనోత్సవాల సాక్షిగా... పది జిల్లాల ప్రతిభ ప్రకాశించింది. కాసింత ప్రోత్సాహం అందిస్తే... అద్భుతాలు సృష్టిస్తానంటోంది.
- ఎస్.సత్యబాబు
 
‘చందనాల సులోచనాల రాధా ప్రమీలో... ఊడల మర్రి కింద నాగుల పుట్ట చందనాల సులోచనాల...’ అంటూ జానపదం పల్లవించింది. ‘పాంచాలి... ఏమే ఏమేమే నీ కండకావరము..’ అంటూ పౌరాణికం ప్రతిధ్వనించింది. ‘పొరియా గడేపీ ఆయీ’ అంటూ బంజారా పాట ఝంఝుంమారుతమైతే... ‘వినరా ద్వారకా రాజా యమలోకమందుండెదనురా’ అంటూ యక్షగానం మలయమారుతమైంది.
 
విలువలంటే కళలే...

ఆయాసాల నుంచి పుట్టిన ఆటపాటలు, శ్రమైక జీవన పల్లెపదాలు జానపదంతో కదం తొక్కుతాయి. ‘ఊరికి ఉత్తరాన ఊడలమర్రి’ అనే జానపదంతో తనదైన శైలితో ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్న సంజీవ్ లాంటివారు... పాప్‌లూ, ర్యాప్‌లూ మన సంప్రదాయ శైలుల ప్రాణం తీస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేయడంలో అతిశయోక్తి లేదని చూసిన వారెవరైనా అంటారు. వీటిని యువతకు దగ్గర చేయడం అంటే తెలంగాణ భవితను కళకళలాడేలా చేయడమే.
 
ఇక తెలంగాణ ప్రాంతంలో మరో శక్తివంతమైన సంప్రదాయ కళ యక్షగానం. ‘నాన్న హయాంలో ఆయన ప్రోగ్రామ్ కోసం ఊర్లకు ఊర్లు ఎదురు చూసేవి’ అంటూ గుర్తు చేసుకున్న కరీంనగర్ వాసి ఎన్.సురేష్... యమధర్మరాజు గెటప్ వేసి యక్షగానం ఆలపిస్తే శిల్పారామంలో కళాభిమానులు కళ్లప్పగించేశారు. గోత్రాల వంటి కులాల వారికి వారసత్వంగా వస్తున్న యక్షగానం... ఇప్పుడున్న పరిస్థితిలో కెరీర్‌గా ఎంచుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే అందరూ దీన్ని ఆదాయ కోణంలోనే చూస్తారనలేం. ఏ ఉద్యోగమూ లేదు... కేవలం పాటే నాకు ఉపాధి బాట అంటున్న సురేష్... కంప్యూటర్స్‌లో పీజీ చేశాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. స్వరాష్ట్రంలోనైనా యువత ‘కళ’లు సాకారం కావాలని సురేష్ కోరుకుంటున్నానన్నాడు.
 
ఘగన్‌గోర్

తండా నాయకుడి ఇంటి ముందుకు వెళ్లి చేసే నృత్యం... పచ్చదనం ప్రాధాన్యత చెప్పే తీజ్ పండుగ, బావా మరదళ్ల సరసాల పాటలు, లంబాడీ, బంజారాల సంస్కృతి సంప్రదాయాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పెద్దలు, పిన్నలు ఆటపాటలతో గడిపే ఘగన్‌గోర్ వంటివి తరాల మధ్య అంతరాలకు సంప్రదాయం అందించిన పరిష్కారం. ‘సేవ్ వాటర్ అంటూ మా వన్ యాక్ట్ ప్లేలో సందేశం ఇచ్చాం’ అని చెప్పాడు కృష్ణానాయక్. రంగారెడ్డి జిల్లా, రామచంద్రగూడకు చెందిన ఈ కుర్రాడు... తన 10 మంది సభ్యుల బృందంతో కలిసి వన్ యాక్ట్ ప్లే, సోలో డ్యాన్స్, ఫోక్ సాంగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. రెండురోజుల పాటు మాదాపూర్‌లోని శిల్పకళాతోరణం సకల తెలంగాణ కళల శోభను సింగారించుకుని నవయవ్వనిలా మెరిసి మురిసింది.
 
వ్యయప్రయాసలు తెలియవు...

ఈ ఆభరణాలు ఎంత బరువుంటాయో తెలుసా... వీటిని ధరించి గంటల పాటు మోయాలి. వీటన్నింటికీ కలిపి రూ.6 వేల వరకూ అద్దె చెల్లించాలి’ అనే ఈ దుర్యోధన వేషధారి... వేదిక ఎక్కగానే వ్యయప్రయాసలన్నీ  మరిచిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఖర్చులు, శ్రమ చూసుకుంటే తృప్తి దక్కదు’ అంటున్న జనగాం వాసి గట్టగల్ల భాస్కర్.. బీఏ గ్రాడ్యుయేట్. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చిన భాస్కర్... తాము మొత్తం 20 మంది బృందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పాడు.
 
 ఫొటోలు: జి.రాజేష్
 

మరిన్ని వార్తలు