మధుమేహ నగరం

8 Sep, 2014 01:10 IST|Sakshi
మధుమేహ నగరం

మధుమేహాన్ని ఆసాంతం సొంతం చేసుకోవడంలో హైదరాబాద్ అగ్రనగరంగా రూపుదిద్దుకుంది. ఈ హోదాను గత పదేళ్లుగా ఎప్పుడూ వదులుకోలేదు. నగరంలో ఏ నలుగురు కలసి ఉన్నా వారిలో ఒకరు మధుమేహబారిన ఉన్నవారే. మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఒత్తిళ్లు వెరసి ముప్ఫై ఏళ్లకే డయాబెటిస్ బారిన పడుతున్న వైనం చూసి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విస్మయం వ్యక్తం చేసింది. ప్రపంచ డయాబెటిక్ కేపిటల్‌గా ఇండియా ఉంటే, దేశంలో హైదరాబాద్ ఆ ఘనత సాధించింది.
 
‘తీపి తింటే షుగర్ రాదు.. షుగర్ వచ్చాక తీపి తినకూడదు’.. ఇదీ దీని స్టైలు. నగరంలో పాతిక లక్షల నుంచి ముప్ఫై లక్షల మంది వరకూ డయాబెటిక్ రోగులున్నట్టు అంచనా. అసలు హైదరాబాద్‌లో ఎందుకు ఎక్కువ మంది మధుమేహ బాధి తులుగా మారుతున్నారు, దీనికి కారణాలేమిటి, దీనివల్ల వస్తున్న దుష్ఫలితాలు ఏమిటీ విశ్లేషిస్తున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డా.రామన్ బొద్దుల. డయాబెటిస్ రోగులు అమెరికాలో తగ్గుముఖం పడుతూంటే, ఇండియాలో విపరీతంగా పెరుగుతున్నారని ఆయన అంటున్నారు.
 
ఇవీ కారణాలు
*    స్థూలకాయం కారణంగా ఎక్కువ మంది డయా బెటిస్‌కు గురవుతున్నారు.
*   శరీరం బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే హార్మోన్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
*    భారతీయుల్లో లేదా హైదరాబాదీల్లో ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వులు కేంద్రీకృతమవుతున్నాయి. దీన్నే అబ్డామిన్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది ప్రమాదకరం.
*    ఎక్కువగా కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తినడం, వ్యాయామాన్ని పూర్తిగా విస్మరించడం కార ణంగా డయాబెటిస్ రావడానికి కారణమవుతోంది.
*    చాలామంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌లో 28 ఏళ్ల వయసులోనే  300 షుగర్‌తో వస్తున్నారు.
*    చాలామంది షుగర్ సింప్టమ్స్ (లక్షణాలు)తో కని పిస్తున్నారు. ఎలాంటి లక్షణాలూ లేకుండా పరిస్థితిని బట్టి షుగర్ రావచ్చు.
*    మహిళల్లో పోలిస్తే పురుషుల్లో కాస్త షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు.
*   మధుమేహం ఉండి 45 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువ మంది హార్ట్‌ఎటాక్‌లకు గురవుతున్నారు. అంతేకాదు పెరాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు గురవుతున్నవారూ ఎక్కువే.

 రోజుకో గంట కేటాయిస్తే...
*    షుగర్‌తో సగం జీవితం బాధపడేకంటే ఇది రాకుండా రోజూ ఒక గంట కేటాయించలేమా అన్నది ఆలోచించుకోవాలి.
*    రోజూ ఒక గంట వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, ట్రెడ్‌మిల్, స్విమ్మింగ్ తదితర వ్యాయామాలు చేస్తే, షుగర్ రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ షుగర్ వచ్చి ఉన్నా దీన్ని ఈ వ్యాయామాల వల్ల నివారించుకోవచ్చు.
*    వ్యాధి లక్షణాల మీద ఆధారపడకుండా ప్రతి మూణ్నెళ్లకోసారి రక్తపరీక్షలు చేయించుకుంటే ఒక వేళ ఈ వ్యాధికి దగ్గరలో ఉంటే, దాన్ని మరో పదేళ్ల పాటు రాకుండా జాగ్రత్త పడచ్చు.
   షుగర్ ఉన్నవాళ్లు యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
*    అన్నం (రైస్) మోతాదు తగ్గించి గోధుమ, జొన్న తదితర ఆహారం తీసుకుంటే మంచిది.
*   యాపిల్, కమలా, బత్తాయి, జామ, దానిమ్మ, బొప్పాయి తదితర వాటిలో ఏదో ఒకటి రోజూ తీసుకోవడం మంచిది. జ్యూస్‌ల రూపంలో కాదు పళ్లే తీసుకోవాలి.
   షుగర్‌తో పాటు రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి.
 
 డా. రామన్ బొద్దుల, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ యశోదా హాస్పిటల్, సికింద్రాబాద్

మరిన్ని వార్తలు