పార్టీ మస్తీ..

31 Dec, 2014 23:33 IST|Sakshi
పార్టీ మస్తీ..

సందర్భం ఏదైనా పార్టీ కామన్ సిటీలో. ఇంకా మాట్లాడితే... పార్టీ చేసుకోవాలంటే కారణం అసలు సందర్భమే అక్కర్లేదనేవారూ ఉన్నారు. హంగు, ఆర్భాటం, ప్లానింగ్... ఇవేమీ లేకుండానే ఎంచక్కా అంతా కలసి ఎంజాయ్ చేసేస్తుంటారు. రోడ్ సైడ్ బండి వద్దయినా... ఫైవ్‌స్టార్ హోటల్‌లో డిన్నరైనా... ఏదైనా పార్టీనే. చూస్తుంటే... నచ్చిన నలుగురితో కలిసి గడపడం కోసం హైదరాబాదీలు ఈ పార్టీ అన్న పదాన్ని ఇంతగా ఓన్ చేసుకుని ఉంటారనిపిస్తుంది. ఇంచుమించూ అలాంటి థీమ్‌తో వెలిసిందే  ‘హైదరాబాద్ పార్టీ క్లబ్’...
- ఓ మధు
 
మూడేళ్ల కిందట హైదరాబాద్ పార్టీ క్లబ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండొందల మంది సభ్యులున్నారు. దాదాపు వారం వారం ఏదో ఒక పార్టీ నిర్వహిస్తూనే ఉంటారు. ‘మీటప్ డాట్ కామ్’ ద్వారా ఈవెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్కువగా పబ్స్‌లో అంతా కలసి ఎంజాయ్ చేస్తుంటారు. మ్యూజిక్, డ్యాన్స్, గేమ్స్, ఫుడ్... ఇలా అన్నీ క్లబ్ పార్టీలో ఉంటాయి. ఐటీ, డాక్టర్స్, టాలీవుడ్ సెలబ్రెటీలు, ఆర్‌జేలు... నలుగురితో కలసి సరదాలను ఆస్వాదించాలనుకొనేవారెవరైనా ఈ క్లబ్ మెంబర్ కావచ్చు.  
 
‘క్లబ్ ఆరంభం నుంచి ఇందులో సభ్యుడిగా ఉన్నా. ఇందులో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కొత్తవారెందరు వచ్చినా... పార్టీ తరువాత అంతా... ముఖ్యంగా మహిళలు క్షేమంగా ఇంటికి చేరేలా క్లబ్ బాధ్యత తీసుకుంటుంది. ఈవెంట్స్‌లో పాల్గొనే మెంబర్స్ ఫోన్, ఫేస్‌బుక్ వివరాలను గోప్యంగా ఉంచుతాం. అలాగే మరెన్నో భద్రతా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు క్లబ్ ఆర్గనైజర్ డాక్టర్ పెద్దిరెడ్డి. వీకెండ్‌లో రీఫ్రెష్ కావడానికి, ఒకే తరహా ఆసక్తి ఉన్నవారంతా కలవడానికి క్లబ్ ఓ వేదికగా నిలుస్తుంది. కొత్త వాళ్లు కూడా ఎలాంటి బెరుకూ, జంకూ లేకుండా మెంబర్స్‌తో త్వరగా కలసిపోయేలా రకరకాల యాక్టివిటీస్ నిర్వహిస్తుంటారు. అదే సమయంలో వచ్చినవాళ్ల వ్యవహార శైలి, తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు.
 
చిగురించే స్నేహం
ఆర్గనైజర్ సభ్యుల సంఖ్యను బట్టి ముందుగా అనుకున్న పార్టీయింగ్ స్పాట్‌కి వెళ్లి, అది అనువుగా ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు. తర్వాత మెంబర్స్‌కి ఈవెంట్ ప్లేస్ అండ్ టైమ్ డీటైల్స్ అందిస్తారు. ‘సాధారణంగా పబ్‌ల్లో శనివారాలు సింగిల్‌గా నో ఎంట్రీ. మా గ్రూప్‌తో వెళ్తే అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. కారణం... మేం మా సభ్యులతో తప్ప మరొకరితో కలవం. అక్కడ ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా మెంబర్స్ ఇష్టం. ఖర్చు కూడా వారిదే.

మనకు నచ్చిన, మనలా ఆలోచించేవారితో ఎంజాయ్ చేయడంలో ఉన్న మజానే వేరు. ఇలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారినవాళ్లు, ఆ తరువాత వాళ్లంతా కలసి వారి వారి ఇళ్లలో పార్టీలు చేసుకున్నవారూ ఉన్నారు’ అంటారు క్లబ్ వ్యవస్థాపకుడు అతుల్‌రాయ్. పార్టీ అంటే కేవలం ఏదో గోల చేసి వెళ్లటం కాదు... పరిచయాలను పెంచుకుంటూ చక్కటి అనుబంధాన్ని, స్నేహాలను పెంచుకోవటం అంటారు క్లబ్ సభ్యులు.
 
ఇరవై నుంచి అరవై వరకు
‘మెంబర్‌గా చేరిన నేను ప్రస్తుతం ఆర్గనైజర్‌గా మారాను. మన ప్రవర్తన, ప్లానింగ్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఆర్గనైజింగ్ బాధ్యతలు అప్పజెబుతారు. ఎరోబిక్స్, లంచ్ పూల్, ఫెస్టివ్ వంటి రకరకాల థీమ్‌లతో పార్టీను నిర్వహిస్తుంటాం. పబ్‌లు, క్లబ్బుల్లో మాత్రమే కాదు... రోడ్ సైడ్ చాయ్, టిఫిన్ బండ్ల వద్ద కూడా ఎంజాయ్ చేస్తుంటాం. ఇరవై నుంచి అరవై ఏళ్ల వారి వరకూ సభ్యులున్నారు’ అని చెప్పారు క్లబ్ ఆర్గనైజర్, సైంటిస్ట్ తన్వీ.
 మాది మధ్యప్రదేశ్, జబల్‌పూర్.

ఇక్కడ ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నా. పబ్బింగ్, పార్టీలు చాలా ఇష్టం. డీసెంట్ అండ్ ఫ్రెండ్లీ గ్రూప్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ క్లబ్ గురించి తెలిసింది. ఫస్ట్ పార్టీకి వచ్చినప్పుడు ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. సరదా సరదా గేమ్స్ ఉంటాయి. పది నిమిషాల్లో అంతా ఫ్రెండ్స్ అయిపోతారు’... ఇది క్లబ్ సభ్యుడు కార్తీక్ మాట.

మరిన్ని వార్తలు