రజ్వీ.. లాతూర్ ప్రకంపన

23 Dec, 2014 00:01 IST|Sakshi
రజ్వీ.. లాతూర్ ప్రకంపన

హైదరాబాద్ స్టేట్ శతాబ్దాలుగా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. పాలకులు ఢిల్లీ సుల్తానులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి నమ్మకస్తులుగా మారారు. స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నా,  ప్రజల రక్షణ భాధ్యతలను ‘పై’వారికి అప్పగించారు. వారి వారసుడు ఏడో నిజాం. కిషన్ ప్రసాద్, అక్బర్ యార్‌జంగ్ వంటి సామరస్య వ్యక్తిత్వాలు లేని లోటు ఆయన అధికారానికి చరమగీతం పాడింది. మత భావనలు తీవ్రంగా వీచాయి. అధికారం అనే దీపం ఆరకూడదని నిజాం విఫలయత్నాలు చేశాడు! ఈ క్రమంలో కాశిం రజ్వీ కథ!
 
‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్ ముసల్మీన్’ అధ్యక్షుడు బహదూర్ యార్‌జంగ్ 1946లో అకస్మికంగా మరణించిన వైనం (Legends and Anecdotes of Hyderabad ) గురించి చెప్పుకున్నాం కదా! ఆయనోసారి హైదరాబాద్ స్టేట్‌లోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్ర) వెళ్లారు. పార్టీ కార్యాలయం కోసం తగిన వసతి చూడమని పార్టీ సభ్యులను కోరారు. ఒక వ్యక్తి తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇస్తాన న్నాడు. క్షణాల్లో ఇంట్లోని సామాన్లను వీధుల్లోకి విసిరేశాడు. అధ్యక్షుడు హృదయానికి హత్తుకున్న ఆ కార్యకర్త సయ్యద్ కాశిం రజ్వీ ! బహదూర్ యార్‌జంగ్ మరణానంతరం సహజంగానే పార్టీ అధ్యక్షుడయ్యాడు. హైదరాబాద్‌కు ‘ప్రకంపనలను’ పరిచయం చేశాడు.

ఖడ్గంతోనే ముస్లింలు హిందుస్థాన్‌కు పాలకులయ్యారన్నాడు. ఆయన ఉపన్యాసాలు కొందరిని ఉద్వేగపరచాయి. సామరస్య జీవనాన్ని కోరుకునే అధిక సంఖ్యాకులైన ముస్లింలకు ఆందోళన కలిగించాయి. స్వతంత్ర రాజ్యంగా అవతరించబోతోన్న బ్రిటిష్ పాలిత భారత్‌లో కలవకుండా, నిజాం స్వతంత్ర రాజుగా ఉండాలని రజ్వీ ఆయనలో రాజ్యకాంక్షను  రగిలించాడు. ‘మై హూ నా’ అన్నాడు. ఎర్రకోటపై నిజాం జెండా రెపరెపలాడుతుందని, బెంగాల్ సముద్రజలాలు ఆయన పాద ప్రక్షాళన చేస్తాయని అభివర్ణించాడు.
 
ప్రధానమంత్రిని తరిమారు!

‘నైజాం రాజ్య రక్షణ’ కోసం రజాకార్స్ అనే పేరుతో పారా మిలటరీ దళాన్ని ఏర్పరచాడు రజ్వీ! నాయకుని కోసం ప్రాణత్యాగం చేస్తామని, హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుండా చివరి క్షణం వరకూ పోరాడుతామని సభ్యులతో ప్రమాణం చేయించాడు. ఫీల్డ్ మార్షల్ దుస్తుల్లో ఉండేవాడు. హోదాలను బట్టి ఇతరులు తుపాకులు, కత్తులు, కర్రలు చేతబట్టేవారు. ఏడాదిపాటు ‘యథాతథ స్థితి’ని గౌరవించేందుకు ఒప్పందానికి రావాలని 1947లో కేంద్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వమూ భావించాయి. ఢిల్లీకి బయలుదేరిన నిజాం ప్రతినిధి బృందాన్ని రజాకార్లు అడ్డుకున్నారు.

హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిపై చేయి చేసుకున్నారు! సౌమ్యుడైన ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్  స్టేట్ వదిలే వరకూ రజ్వీ మనుషులు తరిమారు. ఈ నేపథ్యంలోనే, నిజాం అధికార కాంక్షను నిరసిస్తూ, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కావడం అనివార్యమని వార్తలు రాసిన షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు. నిజాం ప్రధానమంత్రిగా నియమించిన నవాబ్ చట్టారీ స్థానంలో నిజాం నిర్ణయాన్ని పరిహసిస్తూ మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా రజ్వీ నియమించాడు. 1948 నాటి ఈ పరిస్థితుల్లో అధికసంఖ్యాకులు వలసపోయారు. అల్పసంఖ్యాకులు వలసవచ్చారు.
 
పోలీస్ చర్యకు ‘రజ్వీ’ ఆహ్వానం!

నిజాం నవాబుకు వత్తాసుగా ఎన్నో డాంబికాలు పలికిన రజ్వీ, హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం కావాలని భావించిన షోయబుల్లాఖాన్ మరణానికి కారకుడైన రజ్వీ, పోలీస్ చర్యను ఆహ్వానించిన వారిలో ముందు వరుసలో ఉన్నాడు!  1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ప్రారంభమైంది (17 పోలో గ్రౌండ్స్‌తో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉండేది!). నాలుగు రోజుల్లోనే నిజాం బేషరతుగా లొంగిపోయాడు. అనుయాయులతో రజ్వీ అరెస్టయ్యాడు. హిందు-ముస్లిం-క్రిస్టియన్ న్యాయమూర్తుల స్పెషల్ ట్రిబ్యునల్ రజ్వీ బృందంపై విచారణను ప్రారంభించింది. లా చదివిన రజ్వీ తన కేసును తానే వాదించుకున్నాడు. 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైదరాబాద్, పూణెలలో పూర్తిచేసుకున్నాడు.
 
‘వా’హెద్!

పూణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన రజ్వీని ఆయన అనుయాయి, న్యాయవాది కమిల్ అడిక్‌మెట్‌లో ఉన్న తన నివాసానికి  కారులో తీసుకువచ్చాడు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు! 140 మందికి ఆహ్వానాలు వెళ్లగా 40 మంది వచ్చారు. ‘పార్టీ  అధ్యక్ష పదవిని స్వీకరించే సాహసి లేరా’ అనే రజ్వీ పిలుపునకు స్పందన రాలేదు. 12 ఏళ్లు దాటిన ఏ పురుషుడైనా అధ్యక్షుడు కావచ్చని నిబంధన సవరించారు. అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనే యువకుడు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ దీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ ముస్లింల యోగక్షేమాల పరిరక్షణ ధ్యేయమని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ముస్లిమేతరులనూ పార్టీ పదవులకు, ఉన్నత స్థానాలకు ఎంపిక చేస్తోంది. ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడు. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత.
 
కన్నీరు కరవైంది!

తాను దక్కన్‌లో పుట్టాను దక్కన్‌లోనే మరణిస్తానని గతంలో చెప్పుకున్న రజ్వీ, పార్టీ అప్పగింతలు పూర్తయిన తర్వాత తనకు భారత్‌లో భవిష్యత్ లేదని, పాకిస్థాన్ వెళ్తానని ప్రకటించాడు. పోలీస్ చర్య పూర్తయిన తొమ్మిదేళ్లకు సెప్టెంబర్ 18న పాకిస్థాన్ పయనమయ్యాడు. కమిల్ ముంబై వరకూ వెళ్లి సెండాఫ్ పలికారు. రజ్వీని పాకిస్థాన్‌లో ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేదు. మద్దతు పలకలేదు. గుర్తించలేదు. ఇండియా నుంచి, ముఖ్యంగా దక్కన్ నుంచి కరాచీకి వెళ్లి బాధలు పడుతున్న వారికి న్యాయవాదిగా సేవలు అందించాడు. 67వ ఏట 1970 జనవరి 15న కరాచీలో రజ్వీ చనిపోయాడు. హైదరాబాద్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న కాశిం రజ్వీ.. తాను పుట్టిన నేలకు సుదూరాన ఏర్పడ్డ మత రాజ్యం పాకిస్థాన్‌లో మరణించాడు. అక్కడ రజ్వీ కోసం ఏ ఒక్కరూ కన్నీరు పెట్టలేదు!
 
 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

 

మరిన్ని వార్తలు