వర్కవుట్స్‌తో వింటర్

28 Dec, 2014 03:46 IST|Sakshi

చలి మీద గెలుపు సాధించాలంటే ఒకటే మార్గం... వర్కవుట్స్ అంటున్నాడు ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్. అయితే కాస్తంత కదలాలంటేనే బద్దకంగా అనిపించే వెదర్‌లో... వ్యాయామం అంటే ఎలా అని అడిగేవారికీ కొదవలేదు. అయితే చలికాలం తెచ్చే సమస్యలను ఎదుర్కోవాలంటే ఎక్సర్‌సైజ్‌ని మించిన అద్భుతమైన మార్గం లేదంటున్న వెంకట్... వింటర్ వర్కవుట్స్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారిలా...
 
-ఎస్.సత్యబాబు

చలిలో ఎక్సర్‌సైజ్ ఎనిగ్మా, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలను మరింత జఠిలం చేస్తుంది. వయసు మళ్లిన వారు, దీర్ఘకాల వ్యాధులున్నవారు మంచు కురిసే చోట చేయడం వల్ల ఫ్రాస్ట్‌బైట్, హైపోథెర్మియా వంటి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెయిట్స్‌తో చేసే స్ట్రెంగ్త్ ట్రయినింగ్, స్విమ్మింగ్‌ల కన్నా బ్రిస్క్‌వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటి ఎరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయుక్తం.

చలి మరీ ఎక్కువుంటే ఇంట్లోనే ఫ్లోర్ మీద చేసే సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, చైర్ డిప్స్ వంటివి ఎంచుకోవాలి. డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్టెప్ అప్స్ వంటివీ సాధన చేయవచ్చు.

వార్మప్ లేకపోతే ఈ సీజన్‌లో వ్యాయామం గాయాల పాలు చేస్తుంది. ఏ వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే ఇది తప్పదు. వర్కవుట్స్‌కి ముందు సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు సమయం వార్మప్‌కే కేటాయించాలి.

దేహాన్ని వెచ్చగా ఉంచేలా దుస్తుల్ని వాడాలి. వాకింగ్, జాగింగ్ చేసేవారు బ్రైట్ కలర్స్ ధరించడం మంచిది. అవి మీ డ్రెస్‌ను, మిమ్మల్ని ఎదుటి వాహనాలు, వ్యక్తులకు మరింతగా కనపడేట్టు చేస్తాయి. ఒక దానిమీద ఒకటి చొప్పున రెండు మూడు పొరలుగా (లేయర్డ్) దుస్తులు ధరించాలి. ముఖ్యంగా అవుట్‌డోర్‌లో చేసేవారికిది తప్పనిసరి. దీనివల్ల వేడి పుడుతుంది. అలాగే చేతులకు గ్లవ్స్, తలకు క్యాప్ ధరించడం మంచిది.

చెమట పట్టిందని వెంట వెంటనే దుస్తులను తొలగించకుండా వాతావరణానికి ఎడ్జెస్ట్ అయ్యేందుకు  దేహానికి కొంత వ్యవధి ఇవ్వాలి. ఈ సీజన్‌లో సూర్యోదయం తరువాత ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మేలు.

వ్యాయామ సమయంలో నోటితో కన్నా ముక్కుతో గాలి పీల్చడమే శ్రేయస్కరం. నోటితో పీల్చినపుడు చలిగాలి తిన్నగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ ఇబ్బందులు సృష్టిస్తుంది.

వర్కింగ్ అవర్స్‌లో మెట్లు ఎక్కి దిగడం, మొబైల్‌లో నడుస్తూ మాట్లాడడం, క్లీనింగ్, గార్డెనింగ్ వంటివి చేస్తుండాలి.

వ్యాయామాన్ని ఇష్టపడే వారికి చలికాలం మంచి సీజన్. లేజీనెస్ దూరం కావాలన్నా, ఫిజిక్ మంచి షేపప్ అవ్వాలన్నా వింటర్ వెదర్ అనువైనది.

వెంకట్...
 

మరిన్ని వార్తలు