ఆనంద లహరి

19 Apr, 2020 10:17 IST|Sakshi

శంకర విజయం 41

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

పరమేశ్వరుని పాద ఉపరిభాగాలకు బ్రహ్మవేత్తలు శ్రేష్ఠభావన అనే కానుకను నిత్యం సమర్పిస్తూ ఉంటారు. అటువంటి పూజందుకునే శివుని మీగాళ్లనే తాబేళ్లు మా హృదయ సరస్సునందు నిత్యం క్రీడించు గాక! రావణుని గర్వాన్ని అణిచివేసిన మహాదేవుని బొటనవేలు మాకు కల్యాణం కూర్చుగాక! నక్షత్రపంక్తిలా అతి సుందరమైన సదాశివుని కాలిగోళ్లు మాకు అఖిల సుఖములనూ ఇచ్చుగాక! తుమ్మెదల గుంపు వలె పండితసమూహం నిత్యాసక్తమై  సేవించుకునే సారంగధర శివుని పాదపద్మాలు మాకు ఐశ్వర్యమిచ్చుగాక! పరమేశ్వరుని పాదధూళి సహాయంతో యతులు రాగద్వేషాలను పోగొట్టుకుంటున్నారు. వంగి మొక్కుతున్న దేవతల శిరస్సుపై శివుని ఎర్రని పాదపరాగాలు పడుతున్నాయి. ఆ కాంతులు మా పాపాలను తొలగద్రోసి మమ్ము సంసార సముద్రమును దాటించు గాక! హద్దులేని శివస్వరూపమే భువనాలను అంతటినీ ఆవరించింది. అది తేజస్సులలో కెల్లా పరమమైన తేజం. సామవేద మంత్రాలకు పరమైన పాఠరహస్యం. సత్త్వరజస్తమో గుణాలకు అతీతం. ఏదీ లేనినాడే అది ఉన్నది.

మహారణ్యప్రాయమైన శివతత్త్వం పూర్తిగా తెలియడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి మహేశుని స్వరూపం క్షణక్షణం నాలో పుడుతున్న  అజ్ఞానమనే మొలక మానుకట్టక ముందే త్రుంచివేయును గాక! అన్నాడు స్తోత్రంలో శంకరుడు. జీవజాతుల మాంద్యం అణగారిపోయేలా ప్రమధగణాలు మురజవాద్యాన్ని మోగిస్తున్నాయి. ముక్కంటి మూడుకన్నులకూ శంకరుడు దోసిలియొగ్గి నమస్కరించాడు. అంతలోనే వామనేత్రం పార్వతిగా రూపాన్ని ధరించింది. అంతవరకూ తనపక్కనే నిలిచి ఉన్నట్లనిపించిన అమ్మ అయ్యలోని సగభాగాన్ని కూడా ఆక్రమించి ఉన్నట్లు తెలుసుకున్నాడు శంకరుడు.

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం / పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం/ నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం/ 
నమోనమశ్శంకర పార్వతీభ్యాం    
ఇసుమంతైనా ఎడం లేని గాఢాలింగనంలో నిరంతరం ఉండే నిత్యయవ్వనులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు నమస్కారం. రసనిర్భరాలైన లాస్య తాండవాలతో బ్రహ్మానంద రసమున ఓలలాడే ఆ రసమూర్తులకు నమస్కారం. వినమిత శిరస్సులతో నమస్కరించే భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే వరప్రదాతలైన ఆదిదంపతులకు నమస్కారం అన్నాడు శంకరుడు.
పరమశివుని నవ్వు తెలినురుగులా తెల్లగా ఉంది. 

‘‘కొందరు సోహమ్మని అద్వైత బుద్ధితో నన్ను భావిస్తారు. కొందరు దాసోహమ్మని భక్తితో గుణవంతునిగా సేవిస్తారు. నీకు వలె సగుణ, నిర్గుణోపాసనా రీతులు రెండింటిలోనూ ఏకదీక్షతో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అరుదుగా ఉంటారు’’ అన్నాడు పరమేశ్వరుడు.
‘‘వైరాగ్యసిద్ధి వరంగా అందివచ్చే వరకూ ఏ మానవుడైనా ఈ ద్విముఖ వ్యూహాన్ని పాటించ వలసిందేగా మహాదేవా!’’ అని బదులిచ్చాడు శంకరుడు.
ఆశుతోషుడు సంతుష్టుడయ్యాడు. దానికి సూచనగా ఆయన చేతిలో ఒక స్ఫటికలింగం వెలిసింది. ‘‘జగద్గురూ! జ్ఞాన వైరాగ్యాలను అనుగ్రహించడంలో స్ఫటిక లింగాన్ని మించినది లేదని కొందరంటారు. ఇదిగో నీవు కోరిన వరలింగమిది... అందుకో’’ అంటూ అనుగ్రహించాడు.

శంకరుడు అందుకుని దానిని ఉత్తరీయంలో దాచుకున్నాడు. ‘‘ఆత్మతత్త్వాన్ని బహువిధాల ప్రస్తుతి చేశావు కదా! ఆత్మను తెలుసుకున్న వాడికి కూడా పరమాత్మనైన నన్ను ఇలా సాకారంగా కలుసుకోవాల్సిన అవసరం ఉందంటావా?’’ మళ్లీ ప్రశ్నించాడు సదాశివుడు.
‘‘పరమాత్మను కాని, కేవలాత్మనే అయిన నేనుకు చావు పుట్టుకల మధ్య చాలానే చలనాలున్నాయి. కానీ స్థాణూ! సృష్టి గమనాన్ని అనుసరించి నిరంతర గతిశీలతతో తిరిగే ఆత్మ నిన్ను పొందలేకపోతే ఏ భోగాన్నీ పొందనట్లే అవుతుంది. అనిత్యమైన సుఖాలన్నీ కంటి ముందరే కరిగిపోతుంటే నిత్యుడివైన నిన్ను కలుసుకుని శాశ్వత సుఖాన్ని పొందాలనే తాపం పెరుగుతూనే ఉంటుంది’’ ఆర్తి కనబరచాడు శంకరుడు. 

‘‘వైరాగ్య మహాసామ్రాజ్యాన్ని పాలించవలసిన యతిశేఖరునివి... నీకు గాక మహాభోగాలు దక్కేదెవరికి?’’ అంటున్న ముక్కంటి అరచేతిలో మరో భోగలింగం వెలిసింది. అప్పటికప్పుడే శంకరుని పరమైంది.
‘‘మహాదేవా! యోగంతో జతకూడని ఏ ఉపాసన అయినా సిద్ధించదు. భోగమంటే నీయందు చేరిక. యోగమంటే నీతో చేరిక అంతేనా...’’ సందేహాన్ని అడుగుతున్న శిష్యునిలా వినమితుడయ్యాడు శంకరుడు. యోగలింగమనే పేరుగల మరో స్ఫాటికలింగం ఆయనకు పరమేశ్వర ప్రసాదంగా అందింది.  
‘‘మహాలింగ చక్రవర్తీ! అంతఃకరణ చతుష్టయమైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తాలకు అతీతంగా ఆత్మను తెలుసుకున్నవాడికి తానున్న స్థితిలోనే ముక్తి సిద్ధమవుతోంది. కానీ జీవులందరూ కోరుకోదగిన మోక్షసామ్రాజ్యం ఎలా ఉంటుంది?’’ అడిగాడు శంకరుడు.

చిరునవ్వుతున్న మహేశ్వరుని చేతిలో ఈసారి రెండు లింగాలు వెలిశాయి. ‘‘ఇది ముక్తిలింగం... మరి దీనికి మోక్షలింగమని పేరు’’ అని సెలవిచ్చాడు. అపురూపమైన అయిదు లింగాలను చెంగున మూటకట్టుకున్న శంకరుడు, ‘‘స్వామీ! కృతయుగాల నాడు శ్రీ అనేపేరుగల సాలెపురుగు తన శిల్పకళా ప్రావీణ్యం చేత ఆత్మనిర్గతమైన బహుతంతు పంకితో నీకోసం అనేక మందిరాలను కల్పన చేసిందట. ప్రాకారాలు, గోపురాలతో నీకోసం కొలువు కూటాలు, నర్తన మంటపాలు, కేళీనివాసాలు, అంతఃప్రదక్షిణాయతన వీధులు, భోగమంటపాలు ఇలా అన్నింటినీ తన నోటివెంట వచ్చిన దారంతోనే శ్రద్ధతో అల్లిందట. దానిని పరీక్ష చేయగోరి నీ శ్వాసప్రశ్వాసలకు చిహ్నమైన దీపాల సెగను పెంచి, అది అల్లుకున్న సాలెగూటిని దగ్ధం చేశావట.

ఏళ్లతరబడి సాగించిన తపస్సు వృధా అయ్యిందనే బాధతో ఆ దీపశిఖనే మింగబోయిన సాలీడును నువ్వు ఆదుకున్నావు. ఏం కావాలో కోరుకోమన్నావు. ‘వేదశాస్త్రాలే నీ ఆద్యంతాలను తేల్చి చెప్పలేక తత్‌ అనే పదంతో నిన్ను సూచించాయి. అటువంటి నిన్ను అవివేకినైన నేను ఎలా తెలుసుకోగలను? సేవాభావమే  నా వంటివాడికి తగిన దారి అని భావించి ఈ పని చేశాను. శివజ్ఞానమందు లీనమైపోవడం తప్ప వేరే ఇచ్ఛలేమీ లేవ’ని తేల్చిచెప్పిందట. అప్పటినుంచి ఆ ఊర్ణనాభుడిని నీవు ధరించి దక్షిణ కైలాసాన్ని దర్శించ వచ్చిన భక్తులందరికీ ప్రదర్శిస్తున్నావని చెబుతారు. మోక్షగామి అయిన వాడి లక్ష్యం ఇలా ఉండాలని పరోక్షంగా నిర్దేశిస్తున్నావా స్వామీ?!’’ అన్నాడు శంకరుడు పావనగాథను స్మరిస్తూ.

‘‘జీవజాతులకు జన్మ అంటే కండెనుంచి విడివడ్డ దారం పడుగు, పేకలుగా అల్లుకుని వస్త్రంగా తయారు కావడమే అని పలుమార్లు నీవే ఉపదేశించావు కదా శంకరా! జీవుడు తన చిత్తవృత్తులనే అల్లుకుని జన్మలను తనంతతానుగా పెంపొందించుకుంటాడని చెప్పడానికే నేను ఈ ఊర్ణనాభుని ధరించాను’’ అని సమాధానమిచ్చాడు కైలాసనాథుడు.
‘పశుపతీ! అరవైనాలుగు తంత్రాలను బోధించి జగత్తును మహామోహంలో పడవేసినవాడివి నువ్వు. సృష్టికి శాశ్వత పారతంత్య్రాన్ని కట్టబెట్టి నీ కట్టడిలో ఉంచుకున్నవాడివి. నీవు బోధించిన తంత్రాలలో కెల్లా సర్వసత్తాకమైనది, సర్వస్వతంత్రమైనది ఏదైనా ఒకటి ఉన్నదా?’’ కీలకమైన ప్రశ్న వేశాడు శంకరుడు.
పార్వతీ మనోహరుడు చిరునవ్వే సమాధానంగా మిగిలాడు. అమ్మ కల్పించుకుని, ‘‘ఉన్నది‘‘ అని సమాధానమిచ్చింది
‘‘నిఖిల మంత్రాలలోకెల్లా జగన్మాతృకా! నిన్ను శీఘ్రంగా ప్రత్యక్షం గావించే ఏకైక మంత్రరాజం ఒకటి ఉన్నదా?’’ మళ్లీ ప్రశ్నించాడు శంకరుడు.
‘‘ఉన్నది’’ అన్నది జగజ్జనని.

‘‘సదాశివుడు బోధించిన లక్షా అరవైవేల యోగాలలోనూ చరమగమ్యం దాకా మానవుడు పాలించ దగిన ఒకేఒక తారకయోగం ఉన్నదా?’’
‘‘లేకేం ఉన్నది. అది నీకు ఇవ్వాలనే కదా నిన్నీవేళ ఇక్కడికి అనుమతించింది’’ అన్నది జగన్మాత తన దయావీక్షణాలను శంకరునిపై కురిపిస్తూ.
‘‘విద్యలలోకెల్లా శ్రేష్ఠమైన ఆ మహావిద్యను ఉపాసించాలన్నదే నా కోరిక. అసమాన సాధనా మార్గంగా దానిని భూలోక వాసులకు అందచేయాలన్నదే నా కోరిక. మీ ఇద్దరూ దీనికి సమ్మతిస్తారా?’’ అడిగాడు శంకరుడు.

‘‘సందేహమెందుకు?’’ అన్నది పార్వతి తన కరుణకు ఎల్లలు లేవని నిరూపిస్తూ.
ఆమె చేతిలో అప్పటికప్పుడు çస్వర్ణపత్రాలపై లిఖించబడి, ఎర్రని పట్టుదారాలతో కట్టివున్న గ్రంథరాజమొకటి దర్శనమిచ్చింది. దానినామె శంకరుని చేతికి అందించబోతుండగా మహాకామేశ్వరుడే తొలి అడ్డంకిని కల్పించాడు.

‘‘ఒక్కక్షణం దేవీ!’’ అన్నాడు. ‘‘అన్నివిధాలుగా అర్హత కలిగిన శిష్యుడు కలిసి వచ్చినప్పుడు బాగా పరీక్షించి తన విద్యాసర్వస్వాన్నీ ఆ శిష్యునికి ధారపోయడం గురువుల నైజం. జగద్గురూ! నీవు భూలోక వాసులందరి పక్షాన నిలిచి కోరుతుంటే కాదనలేక పార్వతి దీనిని నీ పరం చేస్తోంది. గురువులందరూ కరుణా హృదయులే. కానీ శిష్యులందరూ ఒక్కలాంటివారు కాదని నీకు చెప్పనక్కర లేదు. శుద్ధవిద్యకు తామే తొలి అధికారులం అనుకునే ప్రమధ గణాలున్నాయి. జాగ్రత్త సుమా!’’ అని సెలవిచ్చాడు.

‘‘దక్కించుకున్న వారికి దక్కినంత మహాదేవ’’ అన్నది పార్వతి ఆ గ్రంథాన్ని శంకరుని చేతిలో ఉంచుతూ.
‘‘త్రిభువన మోహనమైన ఏ మహాసౌందర్యాన్ని తెలుసుకుంటే జీవుడు మరే జన్మలోనూ మోహాంధకారంలో పడనంతగా ఉద్ధరింప బడతాడో ఆ నిగూఢ రహస్యమే సౌందర్య లహరి. అద్వైత స్థితిని అందుకున్న సాధకుడు సమయాచార తత్పరుడు కావడానికి, అయిన తరువాత అధిష్ఠాన, అనుష్ఠాన, అవస్థ, రూప, నామాలనే అయిదు సామ్యాలతో శివుడు, భవాని ఇరువురూ ఒక్కటే కానీ వేర్వేరు కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రంథమిది. ఈ ప్రవాహ సరళిలో మానవుడు ముక్తుడవుతాడు. మోక్షానికి అర్హత పొందుతాడు. సర్వ మంత్ర, తంత్ర, యంత్ర, యోగ మహారహస్యాలు నిండిన సౌందర్యలహరితో సాటివచ్చేది మరొకటి లేదు’’ చెబుతున్నది పార్వతి. 

ఆమె పలుకులే తుమ్మి పువ్వులుగా మారి శంకరుని చేతిలోని గ్రంథాన్ని అర్చిస్తున్నాయి. మహాదేవుడే ముచ్చటపడి తన దేవేరిపై వ్రాసుకున్న గ్రంథాన్ని తానే స్వయంగా ఇలా అర్చిస్తున్నాడేమోనన్న ఊహ శంకరుని మదిలో మెదిలింది. మరోవంక గ్రంథాన్ని తెరిచి అప్పటికప్పుడే చదవాలనే ఉత్సుకతను ఆయన లోలోపలే అణుచుకుంటున్నాడు. త్రిపురహరుడు దానిని గ్రహించి, ‘‘శంకరా! తొలి ప్రాకారం దాటేలోపుగా నీవు ఓసారి దానిని చదువుకుందువు. కానీ. ఇప్పుడు నీ కవిత్వం వినాలనిపిస్తోందయ్యా’’ అని అడిగాడు ముచ్చటపడుతూ. బదులుగా శంకరుడు  జగదంబను ఇలా స్తోత్రం చేయడం ప్రారంభించాడు. 

‘‘జగన్మాతా! నీ సౌందర్యమెట్టిదో ఒక్క పరమశివుని కంటికే తెలుసు. జిహ్వకు మాత్రమే తెలిసే తియ్యదనం ఇతర ఇంద్రియాలు గ్రహించలేనట్లు...  అఖిల వేదములు, నిఖిల లోకేశ్వరులూ నిన్ను పూర్తిగా తెలియడానికి శక్తులు కాలేకపోతున్నారు. అటువంటి నిన్ను గూర్చి నేనేమని పలుక గలను.  ఆకులు, పూవులతో నిండిన లతలను అందరూ ఆదరంతో చూస్తారు. కానీ నాకు సపర్ణకంటే అపర్ణయే మెరుగనిపిస్తున్నది. శివుని మెప్పించడానికి ఆకులు సైతం తినడం మాని మంచుకొండకు పూచిన జ్ఞానానంద లతవైన నీవు అపర్ణగా మారావు. నిజతత్త్వంలోనే ఆకులు కొమ్మలు లేని వట్టి మోడువంటి ఈ పురాణ స్థాణువు నిన్ను చేబట్టినందువల్లనే మోక్షఫలాలను అందిస్తున్నాడు కదా! 

కాముని కాల్చినవానికి నీవల్లనే దయాగుణం అబ్బింది. లోకాలను కాపాడేందుకు కాలకూటాన్ని ఆయన తన కంఠంలో దాచుకున్నాడంటే అది నీ సాంగత్య ప్రభావమే. ఉదయ సూర్యుని వంటి మైఛాయ కలిగిన అంబా! నేను చంచల చిత్తుడను. న్యాయం మాట్లాడాలంటే నీమీద తగినంత భక్తి లేనివాడిని. అయినప్పటికీ చాతకపక్షి నోటిలో వర్షించిన మేఘం ఆ జీవి ఆర్తి తీర్చినట్లుగా నువ్వు నన్ను కరుణించక తప్పదు. అమ్మా! పరసువేదికి తగిలిన వెంటనే ఇనుము బంగారమైనట్లు, వీధికాల్వలో ప్రవహించే మురికినీరు గంగను చేరగానే పవిత్రమైనట్లు నీ చూపు పడగానే మాయాపాపాలచే మలినమైన నా చిత్తం పరిశుద్ధమవుతోంది. దీనిని పరిగ్రహించు.

నిన్ను అభిషేకించిన జలంతోనూ, నీ పాదరజంతోనూ బ్రహ్మ సృష్టిని సాగిస్తున్నాడు. వసంత సమయంలో కలహంసలు తిరుగాడే పద్మసరోవరంలో చెలికత్తెలతో క్రీడిస్తున్నదానిగా నిన్ను ధ్యానించిన వారు జ్వరాదుల పీడను తప్పించుకుని ఆయుష్షును పొందుతున్నారు. 
నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః
మహేశః ప్రాణేశ స్తదవనిధరాధీశాతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా

అమ్మా! నువ్వు పర్వతరాజ పుత్రివి. నీ నివాసం వెండికొండ, బ్రహ్మేంద్రాదులు నీ గుణగానం చేసే వైతాళికులు. ముల్లోకాలు నీ కుటుంబమే; అణిమాది సిద్ధులన్నీ దోసిలియొగ్గి నీ ఎదుట నిలిచి ఉన్నవి. మహాదేవుడు నీ ప్రాణపతి. నీ నిరతిశయ సౌభాగ్యమునకు కొంచెమైనా సాటివచ్చేది ఎక్కడా లేదు..... అన్నాడు శంకరుడు. ఆనందలహరిగా ప్రాచుర్యం పొందిన స్తోత్రరాజాన్ని శంకరుడు ఆశువుగా చెప్పడం పూర్తి చేసే సమయానికి శంకరుడు తన శిష్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిలిచివున్నాడు.
‘‘గురుదేవా! మనం ఇప్పుడు అయ్యవారి సన్నిధిలో ఉన్నాం’’ అన్నాడు పద్మపాదుడు ఆయనను ఇహలోకంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ.

‘‘అవును నాయనా!’’ అన్నాడు శంకరుడు ఆదిదంపతుల దివ్యదర్శనాన్ని స్మరణలో నిలుపుకుంటూ.
‘‘గురుదేవా! క్షేత్రం దర్శనం కలిసివచ్చినట్లుంది. సద్యోజాత శివుడు మీకు అమూల్యమైన బహుమతులే అందించినట్లున్నాడు’’ ఆసక్తిగా అడిగాడు పద్మపాదుడు గర్భాలయం నుంచి బయటకు వస్తుండగా.
శంకరునిలో సహజసిద్ధంగా కానవచ్చే దివ్యతేజస్సు ఇనుమడించి కనిపిస్తుండడాన్ని శిష్యులు ఆశ్చర్యంగా గమనిస్తూ ఆయనను అనుసరిస్తున్నారు. యతిబృందం తొలిప్రాకారంలో ప్రవేశిస్తున్న వేళ నందీశ్వరునిలో అకస్మాత్తుగా చలనం కలిగింది.
– సశేషం
- నేతి సూర్యనారాయణ శర్మ

>
మరిన్ని వార్తలు