నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...

3 Nov, 2019 08:14 IST|Sakshi

పీఆర్‌ ప్రొషెషనల్‌గా వయ్యారాలు పోయినా, ఫోబియా బాధితురాలిగా ఒకింత భయపెట్టినా... రాధికా ఆప్టే శైలే వేరు. కళ్లతో స్పష్టమైన భావాలను పలికించడం రాధిక సొంతం.  రక్తచరిత్ర, లెజెండ్‌... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆప్టే  డైరెక్టర్‌ సీట్లో కూర్చోనున్నారు.  ఆమె అంతరంగాలు... 

రంగస్థలం
ఎన్ని సినిమాల్లో నటించినా స్టేజీ మీద నటించడం అంటేనే ఇష్టం. స్టేజీకి దూరంగా ఉండలేను. ఆ మధ్య గిరీశ్‌ కర్నాడ్‌ నాటకం ఒకటి మరాఠీలోకి తీసుకొస్తే అందులో నటించాను. మంచి పేరు వచ్చింది. నాటకాల్లో నటిస్తున్నప్పుడు సినిమా పనులకు దూరంగా ఉంటాను. రిహర్సల్స్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తాను.

డైరెక్టర్‌
ఆర్‌జీవీ, ప్రకాశ్‌ రాజ్, అమోల్‌ పాలేకర్‌... మొదలైన డైరెక్టర్లతో కలిసి పనిచేశాను. ఏ డైరెక్టర్‌ అంటే ఇష్టం అంటే ఒక్కరి పేరు చెప్పలేను.  ఒక్కొక్కరికీ తమదైన శైలి ఉంది. వారి పని విధానాన్ని ఆకళింపు చేసుకుంటాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రయోగాలు చేయడంలో రాము స్వేచ్ఛను ఇచ్చేవారు. ఆయనతో పనిచేస్తే  నిశబ్దంలో నుంచి అబ్జర్‌వేషన్‌ స్కిల్స్‌ నేర్చుకోవచ్చు. ప్రకాశ్‌ రాజ్‌ సీన్‌ గురించి చర్చించి నటన నాకే వదిలేసేవారు. ఆయన అందరూ మెచ్చే నటుడు. నటనలో లోతులు తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ డైరెక్టర్‌గా నటనకు సంబంధించి తన భావాలను ఇతరులపై రుద్దరు.  ‘నేను ఇలా అనుకుంటున్నా. నీ అభిప్రాయం ఏమిటి?’ అడిగే వారు అమోల్‌ పాలేకర్, కేతన్‌ మెహతాకు స్పాంటేనియస్‌ రియాక్షన్‌ అంటే ఇష్టం.

ఇమేజ్‌
నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. నాకు నచ్చనిది చేయను. ఇమేజ్‌ను లెక్కలోకి తీసుకోను. నటుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఉండవచ్చుగాక... అయినప్పటికీ దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని అర్థం చేసుకుంటే సమస్యే లేదు.

నర్తకి
హిందీ, సౌత్‌ చిత్రాలు అనే తేడా లేదు. రెండిటినీ ఆస్వాదిస్తాను. భిన్న భాషలలో నటించడం వల్ల అక్కడి ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదీ ఎక్కువ, ఏదీ తక్కువ కాదు. దక్షిణాదిలో అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. ‘కబాలి’లో రజని సర్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.నాకు డ్యాన్స్‌ వచ్చు. ఒక నర్తకి పాత్ర చేయాలని కోరిక ఉంది. ‘టాలెంట్‌తో అన్నీ జరుగుతాయి’ అనే దాంట్లో నాకు నమ్మకంగా లేదు.‘బ్రహ్మాండంగా నటించావు’లాంటి ప్రశంసలు వచ్చిన రోజుల్లో కూడా అవకాశాలు రాకపోవచ్చు. ఏ ప్రశంసలూ లేని రోజుల్లో కూడా అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టవచ్చు.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా