మనసు మాట వినాలంటే?!

19 Mar, 2016 23:39 IST|Sakshi
మనసు మాట వినాలంటే?!

ఆత్మబంధువు

‘‘ఆంటీ.. ఆంటీ...’’ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు చరణ్.
‘‘హాయ్ హీరో! ఏంటీ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఆంటీ?’’ అని పలకరించింది రేఖ.
‘‘అదేం లేదాంటీ. కాలేజీ, స్టడీస్‌తో బిజీ. అందుకే రాలేకపోయా. సారీ!’’
‘‘సారీ అక్కర్లేదులే. ఊరికే అన్నా. నువ్వు రాకపోయినా పర్లేదు, బాగా చదివితే చాలు. ఇంతకూ ఎలా చదువుతున్నావ్?’’
‘‘బాగానే చదువుతున్నా అంటీ.. కానీ గుర్తుండటంలేదు. కాన్సట్రేషన్ కుదరడం లేదాంటీ.’’
‘‘కాన్సట్రేషన్ కుదరడం లేదంటే ఎలానో కొంచెం చెప్తావా?
‘‘అంటే... ఓ గంట చదువుదామని కూర్చుంటే, అరగంటకే డిస్టర్బ్ అవుతున్నా. చదువుతుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.’’
‘‘ఏవేవో ఆలోచనలంటే?’’
‘‘అంటే... చదువుకి, చదువుతున్న సబ్జెక్ట్‌కి సంబంధం లేనివి.’’
‘‘మ్‌మ్‌మ్.. నీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం కదా?’’
‘‘ఔనాంటీ.’’
‘‘ఫొటో తీసేటప్పుడు ఒకేసారి రెండు ఆబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయగలవా?’’
‘‘కుదరదాంటీ. ఏదో ఒకదానిపైనే ఫోకస్ చేయగలం.’’

‘‘కదా.. చదువు కూడా అంతే. నీ మనసు ఒకే సమయంలో రెండు విషయాలపైన ఫోకస్ చేయలేదు. చదువుతున్నప్పుడు వేరే ఆలోచనలు వస్తున్నాయంటే వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నట్లే.’’  ‘‘మరేం చేయాలాంటీ?’’  ‘‘నువ్వు చేయాల్సిన పనులను ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనసులోకి వచ్చినదాన్ని చేసేందుకు సమయం కేటాయించి ఆ సమయానికి చేసేయాలి.’’

 
‘‘ఈజ్ ఇట్ సో ఈజీ?’’

‘‘ఎస్, ఇటీజ్ సో ఈజీ వెన్ యూ నో ద ప్రాసెస్. ఉదాహరణకు నువ్వొక మ్యూజిక్ షోకి వెళ్లావనుకో. అక్కడ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా నీ ఫ్రెండ్స్ చెప్పేది వినిపిస్తుంది కదా. అంటే నీ అన్‌కాన్షియస్ మైండ్ ఎలాంటి ప్రదేశంలోనైనా ఫోకస్ చూపించగలదని అర్థం. అంటే మన చుట్టూ ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకు కావాల్సిన దానిమీదే మనం ఫోకస్ చేయగలం. అందుకే రోజూ ఒకే చోట, ఒకే సమయంలో చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ సమయం చదువుకోవడానికని మనసు అర్థం చేసుకుంటుంది. చదువుకునేటప్పుడు పక్కదారులు పట్టకుండా మనతో సహకరిస్తుంది.’’

‘‘నేను కూడా రోజూ నా రూమ్‌లో కూర్చునే చదువుకుంటా. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఓ గంటైనా ఏకాగ్రతతో చదువుదామనుకుంటా. కానీ  పది, ఇరవై నిమిషాలకు మించి కాన్సట్రేషన్ కుదరడం లేదు.’’ ‘‘నువ్వే కాదు, ఏ మనిషైనా సరే 20 నుంచి 30 నిమిషాలకు మించి ఏకాగ్రత నిలపలేడు.’’ ‘‘అవునా ఆంటీ. మరి మా ఫ్రెండ్స్ గంటలకు గంటలు చదువుతామంటారే!’’ ‘‘వాళ్లు గంటలకు గంటలు చదవొచ్చు. కానీ ఏకాగ్రతతో కాదు. ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది. అంటే మనసులోకి వేరే ఆలోచనలేవో వస్తాయి. ఒకసారి ఏకాగ్రత కోల్పోతే తిరిగి తెచ్చుకోవడానికి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది. అలా రోజుకు ఓ పదిసార్లు ఏకాగ్రత కోల్పోయామంటే రోజుకు 50 నుంచి 100 నిమిషాలు వృథా చేసినట్లే.’’

‘‘అవునా... మరి ఎలా ఆంటీ?’’
‘‘దానికో చిట్కా ఉందిలే కంగారు పడకు. మనకు ఇష్టమున్నా లేకున్నా ప్రతి 20 లేదా 30 నిమిషాలకు మనసు పక్కదారి పడుతుంది కాబట్టి 20 లేదా 30 నిమిషాలు చదివాక మనమే చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిది. కానీ బ్రేక్ తీసుకున్నప్పుడు టీవీ చూడకూడదు, పాటలు వినకూడదు. అలా చేస్తే మళ్లీ పుస్తకం పట్టుకున్నప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు మనసులోకి వచ్చి చికాకు పెడతాయి.’’

‘‘మరేం చేయాలి?’’
‘‘బ్రేక్ టైమ్‌లో మెలోడియస్ ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినవచ్చు. లేదంటే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చు. ఓ గ్లాసు నీళ్లు తాగి అలా బయటకు వెళ్లి చల్లగాలి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత వెళ్లి పుస్తకం పట్టుకుంటే మనసు నిలుస్తుంది.’’  ‘‘థాంక్స్ అంటీ. మీరు చెప్పిన టిప్స్ పాటిస్తూ చదువుకుంటా’’ అంటూ హుషారుగా వెళ్లాడు చరణ్.

 - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

 

మరిన్ని వార్తలు