విచిత్రోద్యోగాలు

18 Oct, 2014 23:33 IST|Sakshi
విచిత్రోద్యోగాలు

వివరం: ఇందులో మీరు ఎన్ని పనులు చేయడానికి సిద్ధపడతారు? డియోడెరెంట్ పనితీరుని చంక దగ్గర ముక్కు ఆన్చి అంచనావేయడం, కుక్కలు, పిల్లుల ఆహారాన్ని రుచిచూసి చెప్పడం, షాపింగ్ మాల్‌లో ‘లైవ్ మానెక్విన్’లాగా కదలకుండా నిలబడటం... ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విచిత్ర ఉద్యోగాలు. ఇందులో కొన్ని నవ్వు తెప్పించవచ్చు. అలాగని నవ్వులాటకోసమే వీటిని రాయడం లేదు. వీటిల్లో ఉన్న శ్రమనూ తక్కువచేసి చూడటం లేదు. మనకు తెలియని ఇంకెన్నో రకాల పనులున్నాయని చెప్పడమే ఈ కథనం ఉద్దేశం!
 
ఎలా మొదలుపెడదాం?
 ఊమ్... పాత బాలీవుడ్ సినిమాల్లో విలన్లు ‘వ్యాట్ 69’ అనే ఖరీదైన విస్కీ తాగుతూవుంటారు. విలన్లే ఎందుకు తాగుతారనేది పక్కనపెడితే, ఆ మద్యం పేరువెనుక ఒక ఆసక్తికర కథనాన్ని చెబుతారు. 1882లో స్కాట్లాండ్ బ్రూవర్(సారాయి కాచువాడు) విలియమ్ శాండర్సన్ ఒక కొత్త బ్రాండును మార్కెట్లోకి తెచ్చేముందు, వందరకాల మిశ్రమాల్ని వంద చెక్కపీపాల్లో సిద్ధం చేయించాడు. మంచి నాలుకగల పెద్దమనుషుల్ని కొందర్ని పిలిపించి, ద్రవాన్ని రుచి చూపించాడు. అక్కడ పీపాను వ్యాట్ అంటారు. అలా వారు వంద వ్యాట్స్‌లోని ద్రవాన్నీ ఆస్వాదించి, చివరికి 69వ దాన్లోది ‘బెస్ట్’ అని మూకుమ్మడిగా ఓటేశారు. శాండర్సన్ ఆ రుచికారుల సూచనను బట్టి, ఆ పీపాలోని మద్యాన్నే తమదైన ‘టేస్టు’గా విడుదల చేయడమేకాదు, పేరును కూడా వ్యాట్ 69 అనే ఖరారుచేశాడు. ఇక్కడ, మద్యం కథకన్నా, కొందరు మద్యపు రుచి నిపుణులు ఉంటారని చెప్పడమే ముఖ్యోద్దేశం.
 
 షాక్‌కు రెండు డాలర్లు
 ఎలాగూ మద్యం ప్రస్తావన వచ్చింది గనక, సొమేలియర్ల గురించి కూడా చెప్పుకోవాలి. వీరికి వైన్ల గురించిన జ్ఞానం ఎక్కువ. ఏ ఆహారంతో దేన్ని సేవిస్తే మంచిదో కస్టమర్లకు సలహా ఇస్తారు. వాళ్లు సేవించేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచుతారు కూడా! సొమేలియర్లను ఖరీదైన రెస్టారెంట్లు నియమించుకుంటాయి. భోజనంతోపాటు వైన్ తప్పనిసరిగా తీసుకునే అలవాటున్న పాశ్చాత్య దేశాల్లో వీరికి డిమాండ్ ఎక్కువ.
 
 ఇక, ఇది రెస్టారెంటు లోపలి ఉద్యోగమైతే, బయటి పని కూడా ఒకటుంది. ముఖ్యంగా మెక్సికోలో పబ్బులు, బార్ల బయట కొందరు కరెంటును ‘పట్టుకుని’ నిల్చుంటారు. తాగుబోతుల దగ్గర రెండు డాలర్లు తీసుకొని ఒక షాక్ ఇస్తారు. మత్తులోంచి ఉన్నట్టుండి తేరుకోవడానికి ఈ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుందట. ఈ షాక్ పుచ్చుకుంటే కిక్ పెరుగుతుందని పెట్టించుకునేవాళ్లు కూడా ఉంటారట!
 
 పెంపుడు స్నేహితులు
 మార్కెట్లో రకరకాల పెట్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని విడుదల చేసేముందు రుచి, వాసన ఎలావుందో నిర్ధారించడమే ‘పెట్ ఫుడ్ టేస్టర్’ పని. నిర్ధారించాలంటే తినాల్సిందే కదా! కుక్క బిస్కెట్లు తినడమే అపహాస్య కారకం అవుతున్నప్పుడు, మొత్తంగా  రుచిచూడటమే ఉద్యోగంగా బతకడమంటే...?! పెట్ ఫుడ్ కంపెనీ యజమాని మార్క్ గూలే అంటాడు: ‘నువ్వే నోట్లో పెట్టలేనిదాన్ని నీ పెంపుడు జంతువు తింటుందని ఎలా అనుకోగలవు?’ కుక్కల దగ్గరే ఇంకో విషయాన్ని చెప్పేసుకుందాం. పెంపుడు జంతువుతో కలిసి ఉమ్మడిగా యోగా చేయిస్తున్నారు కొందరు. దీన్ని డోగా అంటున్నారు.
 
 లేడీస్ ఓన్లీ
 ముందుగా ఒక సమాచారం: వాసనను పసిగట్టడంలో పురుషులకన్నా మహిళలే ముందుంటారు. ఈ ఘ్రాణశక్తి కారణంగా స్త్రీలే ‘ఆడర్ టెస్టర్’గా మరింత బాగా రాణించగలరు. ఇంతకీ పనేమిటంటే, కంపెనీలు తయారుచేసే డియోడెరెంట్ల సామర్థ్యం ఎలా తెలుస్తుంది? వాటి ప్రభావం ఎంతసేపు ఉంటుందో ఎలా అంచనావేస్తారు? ఇక్కడే ఆడర్ టెస్టర్స్ ముక్కుప్రవేశం చేస్తారు. కీలకమైన పాయింట్ ఏమిటంటే, అత్యధిక చమట కేంద్రాలైన చంకల దగ్గరే వారు ముక్కును ఆన్చాల్సివుంటుంది. యాక్ అంటారా! దీనికే ఇలా అంటే ఈ పని చూడండి.
 
 అయ్యాయ్యాక్!
 కొంతమందికి బస్సు ప్రయాణమే పడదు. భళ్లున కిటికీల్లోంచి రోడ్డుమీదకు కానిచ్చేస్తుంటారు. మరి అలాంటివాళ్లు రంగులరాట్నం ఎక్కితే? కడుపు ఖాళీ అవడం ఖాయం. ఇదిగో ఇక్కడే వొమిట్ క్లీనర్స్ బకెట్లతో వచ్చేస్తారు. కొన్ని అమ్యూజ్‌మెంట్ పార్కులు వీళ్లను నియమించుకుంటున్నాయి. కొంపదీసి వాంతిని శుభ్రంచేసేప్పుడు వీళ్లే వాంతి చేసుకుంటే...?!
 
 పడుకోవడమే పని
 ‘మంచమున్న కాడ నీళ్లాడటం’ అని ఒక గ్రామీణ సామెత! సోమరులను ఇలా నిందించడమన్నమాట! మరి మంచం మీదే పనిచేసే వీలుంటే? ఫర్నిచర్ టెస్టర్ పనేమిటంటే, కంపెనీ తయారుచేసే సోఫాలు, మంచాలు, కుర్చీల నాణ్యత తేల్చడం! ఎలా తేలుతుంది? కూర్చోవాలి, ఒరగాలి, పడుకోవాలి, బోర్లా తిరగాలి, అన్నివిధాలుగా సుఖంగా ఉందో లేదో చూడాలి. ఇదేదో బాగుందనిపిస్తోందా?
 
 బూట్లకు ఇస్త్రీ
 కొత్త బూట్లను చూడండి, అవి ఎలా నున్నగా మెరుస్తూ ఉంటాయో! షూ కూడా ముడతలు పడతాయి. మరి ఫ్యాక్టరీనుంచి బయటికి వచ్చేప్పుడు అవి ఛమక్‌మనాలంటే రింకిల్ ఛేజర్స్ కావాలి. బట్టల లాగానే బూట్లకూ దానికి తగిన రీతిలో ఇస్త్రీ కొట్టడమే వీళ్ల పని! ఈ కోవలోనిదే ఇంకో పని ఏమిటంటే, పొటాటో చిప్ ఇన్‌స్పెక్టర్. చిప్ సాఫీగా లేకపోతే ప్యాకెట్ సరిగ్గా అమరదు. కాబట్టి, వంకర చిప్స్‌ను పక్కనపెట్టేయడమే వీళ్ల ఉద్యోగం.
 
 అంత్యక్రియల్లో ‘అన్నీ’ తానై!
 ఈవెంట్స్ మేనేజర్‌లాంటివాడే ఫ్యునెరల్ సర్వీస్ మేనేజర్ కూడా! శవానికి స్నానం చేయించడం, బట్టలు తొడగటం, శ్మశానం వారితో మాట్లాడటం, కావాల్సినవి సిద్ధం చేయడం... ఇవన్నీ అంత్యక్రియల నిర్వాహకుడు చూసుకుంటాడు. మామూలుగా ఎవరో ఇంటిపెద్దగా చేసేపనుల్ని వీళ్లు చేసిపెడతారు.
 
 దీనికే అనుబంధంగా ఇంకో విషయం. ఏ చావుకైనా ‘ఏడుపు’ కీలకం. కానీ అందరూ ఘనంగా ఏడవగలరా? అందుకే ఏడవడానికి కిరాయి మనుషులుంటారు. చాలాదేశాల్లో ఇది ఆచారం కూడా! ఆఫ్రికాలో దాన్ని వృత్తిగా బతికేవాళ్లున్నారు. చావుతో ముడిపడినదే ఇంకో పని! ఒక్కోసారి చావు మూడేది కూడా కావొచ్చు. ‘పాయిజన్ టేస్టర్’ దేశాధ్యక్షులవారి ఆహారాన్ని ముందుగా రుచిచూస్తాడు. ప్రత్యేకించి విదేశీ పర్యటనల్లో. వ్లాదిమీర్ పుతిన్(రష్యా), బరాక్ ఒబామా(అమెరికా) ఇలాంటివాళ్లను పెట్టుకున్నారని ఒక ప్రచారం!
 
 సైకిల్ చేపలు
 ఎప్పుడైనా చూడండి, గోల్ఫ్ విశాలమైన మైదానంలో ఆడతారు; పక్కన ఒక కొలనులాంటిదేదో పారుతూవుంటుంది; కొలనంటూ ఉందంటే బంతి ఏదో ఒక సమయంలో అందులో పడనేపడుతుంది; మరి పడ్డదంటే ఎవరో ఒకరు దుంకి తీయాల్సిందే! గోల్ఫ్ బాల్ డైవర్ల పని అదే! బరువైన ఆ బంతుల్ని వలలేసి పట్టుకొచ్చి, సగం ధరకు వాడిన బంతులుగా అమ్ముతుంటారు. వాటినీ ప్రాక్టీస్‌గా కొనుగోలు చేసేవాళ్లు ఉంటారుకదా! వినాయకచవితి నిమజ్జనం తర్వాత, హుస్సేన్‌సాగర్‌లో దూకేవాళ్లు గుర్తొస్తున్నారా? ఇంకా ఇది చూడండి. నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌ను సైకిళ్ల నగరం అంటారు. మనుషులకన్నా సైకిళ్లు ఎక్కువ! అలాగే అక్కడ కాలువలూ ఎక్కువే. 165. దీనివల్ల ఏమవుతుందంటే ఏటా కనీసం 12,000-15,000 సైకిళ్లు ఈ కాలువల్లో పడిపోతుంటాయి. వీటిని తీసేవాళ్లను ‘బైసికిల్ ఫిషర్స్’ అంటారు.
 పంచేంద్రియాలతో పని!
 
 కోళ్ల పరిశ్రమలో చికెన్ సెక్సర్ పని ఏమిటంటే- వేలాది పిల్లల్ని ఆడ, మగగా వేరు చేయడం! స్త్రీలింగం గుడ్లకోసం, పుంలింగం మాంసంకోసం. ఈ ఉద్యోగార్హత ఏమిటంటే, తిరగేసి దగ్గరగా చూసి లింగభేదం చెప్పగలగడం! కంటిని కాకుండా ముక్కును వాడేవాళ్లు పేపర్ టవల్ స్నిఫర్స్. టాయ్‌లెట్ పేపర్ వాడకం విదేశాల్లో మరీ ఎక్కువ కదా! వాటిని ఎగబీల్చి, ఏ అసంబంధ వాసన లేదని తేల్చడం స్నిఫర్ పని.

 ప్రొఫెషనల్ స్నగ్లర్
 స్మగ్లర్ కాదు, స్నగ్లర్. ఇదీ ఉద్యోగమే.  గంటకు ఇంతని తీసుకుని మనిషిని హత్తుకుంటారు వీళ్లు. అమెరికాలోనూ, జపాన్‌లోనూ ఈ వృత్తి వ్యాప్తిలోకి వస్తోంది. దీన్ని వ్యభిచారంగా విమర్శించేవాళ్లున్నారు. అయితే లైంగిక కార్యానికి చోటులేదు కాబట్టి, అలా చూడకూడదంటారు స్నగ్లర్స్. మనిషి తోడుకోసం తపించేవాళ్లు వీళ్ల దగ్గరికి వెళ్తున్నారట.
 
 ఇక ఫేస్ ఫీలర్స్ ఉంటారు. ఒక క్రీమును ముఖానికి రాసుకున్నాక వచ్చే మృదుత్వాన్ని అంచనావేయడం వీళ్ల ఉద్యోగం. వీళ్ల అనుభూతికి చేతులు ప్రధానం. ఇదే టాపిక్‌తో ముడిపెట్టి ఇంకో ఉద్యోగం ఉంది. స్వీయ సంతృప్తి చెందించడంలో సెక్స్ టాయ్స్ ఎంతమేరకు విజయవంతం అవుతున్నాయో పరీక్షించిచూసే మాస్టర్‌బేటర్స్‌ను కొన్ని ‘శృంగార కంపెనీలు’ నియమించుకుంటున్నాయట!  ఇక కొన్ని ఖరీదైన ఓడల్లో నగ్నంగా పనిచేసే వర్కర్లు ఉంటారు. ఎందుకంటే, ఆ ఓడ మొత్తం మీద ప్రయాణీకులెవరూ బట్టలు ధరించరు కాబట్టి. ‘బేర్ నెసెసిటీస్ టూర్ కంపెనీ’ స్పెషాలిటీ అదే!
 
 బుట్టబొమ్మకు వంద డాలర్లు
 పెద్దయ్యాక ఏమవుతారు? అంటే, డాక్టర్, ఇంజినీర్, లాయర్, పోలీస్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సినిమా హీరో... అని చెబుతారు పిల్లలు. సాధారణంగా ఆ వృత్తిల్లోని ఆకర్షణ వాటిచుట్టూ ఉన్న గౌరవంతోపాటు డబ్బు కూడా! మరి పైన చెప్పుకున్న ఉద్యోగాల్లో ఎంత సంపాదన ఉంది? ఉదాహరణకు, ప్రొఫెషనల్ స్నగ్లర్స్ గంటకు 20 నుంచి 60 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, సొమేలియర్ ఏటా 80,000 నుంచి 1,60,000 డాలర్లు సంపాదిస్తాడు. అదే అంత్యక్రియల మేనేజర్ 80,000 డాలర్లు, ఐస్‌క్రీమ్ టెస్టర్ లక్ష డాలర్ల వరకు ఆర్జిస్తున్నారు. ఇటీవల కొన్ని ఖరీదైన షాపింగ్ మాల్స్‌లో లైవ్ మానెక్విన్స్‌గా బుట్టబొమ్మల్లాంటి నిజమైన యువతుల్నే నిలబెడుతున్నారు. వాళ్లకు గంటకు వంద డాలర్ల వరకు చెల్లిస్తున్నారు.

 ఐస్‌క్రీమ్ టేస్టర్
 మద్యంలాగే ఐస్‌క్రీమ్ కంపెనీలకూ మంచి నాలుకగలవాళ్లతో పనివుంటుంది. భిన్న ఫ్లేవర్స్‌తో తయారుచేసే ఐస్‌క్రీమ్స్‌ను ముందు ఈ టేస్టర్స్ రుచిచూసి ‘మ్మ్, బాగుంది,’ అంటేనే మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఫొటోలోని జాన్ హారిసన్... డ్రెయర్ కంపెనీకి ఆస్థాన రుచికారుడు. పెట్టెలకొద్దీ హిమక్రీముల్ని రుచిచూశాడీ అమెరికన్. కనీసం వందరకాల ఫ్లేవర్స్‌ను సర్టిఫై చేశాడు. హారిసన్ రుచిమొగ్గలు అంత ప్రత్యేకం కాబట్టే, వాటిని మిలియన్ డాలర్లకు బీమా కూడా చేయించాడు, గాయనీగాయకులు తమ గొంతును చేసుకున్నట్టుగా!
 
 కాలపు మాయ
 హైదరాబాద్ వీధుల్లో మీరు నడుస్తుంటే, ఎత్తై అద్దాల మేడల్ని కప్పీల మీద వేలాడుతూ తుడిచేవాళ్లు కనబడతారు. ఊయలూగే తాడును నియంత్రించుకోవడానికి ఒక రబ్బరు తొడుగును అద్దానికి ఒత్తుతాడు. దాంతో అక్కడ శూన్యం ఏర్పడి, అది అతుక్కుపోతుంది. ఇక కదలకుండా పనిచేసుకోవచ్చు. ఆ భాగం శుభ్రమయ్యాక మళ్లీ దాన్ని ఊడబెరుక్కోవడమే!
 
 సెల్‌ఫోన్ మార్కెట్లోకి రాగానే దాని మెకానిక్స్ పుట్టుకొచ్చారు. లిఫ్టులు ప్రవేశించగానే వాటికి మెయింటెనెన్స్ అవసరమవుతుంది. మన తాతలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు తెలిసివుండరు; ఐమ్యాక్స్ స్క్రీన్ క్లీనర్ తెలిసివుండరు; దయ్యం బట్టలు తొడుక్కుని స్కేరీహౌజ్‌కు వచ్చేవాళ్లను భయపెట్టే ఉద్యోగం ఒకటుంటుందని ఊహించివుండరు; పెదాల ముద్రను బట్టి జ్యోతిష్యం చెప్పే లిప్‌స్టిక్ రీడర్స్‌ను ఊహించివుండరు; ఎథికల్ హ్యాకర్స్ ఉండగలరని ఊహించే అవకాశమే లేదు.
 
 ప్రస్తుతానికొస్తే, సినిమాల్లోనేగానీ ఒక రాణి చెలికత్తెల్ని మనతరంవాళ్లు చూళ్లేదు. అప్పుడు చెలికత్తె కావడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవో! లాంతర్లు తుడిచే ఉద్యోగం ఇప్పుడు ఊహించలేం. ఉదయాన్నే జనాన్ని మేల్కొల్పడానికి గంటలు కొట్టేవారుండేవాళ్లని ఊహించలేం. కాలమే కొన్ని కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. కొన్నింటిని తొలగిస్తుంది కూడా!
 - రాజ్

మరిన్ని వార్తలు