లైఫ్‌  మైనస్‌ ఫోర్‌

2 Dec, 2018 01:38 IST|Sakshi

నేడు  జాతీయ  కాలుష్య నివారణ దినోత్సవం

నానాటికీ మితిమీరుతున్న కాలుష్యం మనుషుల ఆయువును హరించేస్తోంది. వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. కాలుష్యం కారణంగా భారతీయులు సగటున నాలుగేళ్ల ఆయువును కోల్పోతున్నారు. భారత్‌లో కేవలం వాయు కాలుష్యం కారణంగా ఏటా నాలుగు లక్షల మంది అకాల మరణాలకు బలవుతున్నారు. మనుషుల నిర్లక్ష్యం ఫలితంగా నీరూ నేలా కలుషితమవు తున్నాయి. ఇష్టానుసారం వ్యర్థాలను నదుల్లోకి వదిలేస్తుండటంతో పవిత్ర నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.

అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు సాధించిన భారత్, అత్యధిక కాలుష్య నగరాలు గల దేశంగా కూడా మరో ఘనతను సాధించింది. మన నగరాల్లో వీచే గాలి నిండా విషవాయువులు ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4,300 నగరాల్లోని వాతావరణ కాలుష్యంపై జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక వాయు కాలుష్యం గల దేశాల్లో నేపాల్‌ మొదటి స్థానంలో ఉంటే, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషులు సగటున 1.8 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని, భారత్‌లోనైతే సగటున నాలుగేళ్లు ఆయుర్దాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని షికాగో వర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎపిక్‌) తెలిపింది. ‘ఎపిక్‌’ అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం భారత్‌లోని వాయు కాలుష్యం దాదాపు ధూమపానంతో సమానంగా మనుషుల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు, వాయు కాలుష్యం మద్యానికి రెట్టింపు, నీటి కాలుష్యానికి మూడు రెట్లు, హెచ్‌ఐవీ కంటే ఐదురెట్లు ప్రమాదకరమని ‘ఎపిక్‌’ హెచ్చరించింది. ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది.

గాలిలో స్వచ్ఛత కరువు
ప్రపంచంలో ఎక్కడ చూసినా గాలిలో స్వచ్ఛత కరువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొంభై శాతం జనాభా కలుషితమైన గాలినే పీలుస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. చిన్నారుల్లో 93 శాతం మంది అనారోగ్యకరమైన గాలినే పీలుస్తున్నారు. నగరాల్లోనే కాదు, పచ్చని పల్లెల్లో సైతం స్వచ్ఛమైన గాలి కరువైపోతోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో ఊహించుకోవాల్సిందే. చాలా దేశాలు కాలుష్య నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, మన దేశంలో మాత్రం అలాంటివన్నీ నాయకుల ప్రకటనల్లో తప్ప ఆచరణలో మచ్చుకైనా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వాయు కాలుష్యం కారణంగా అకాల మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. వాయు కాలుష్యాన్ని రెండు రకాలుగా అంచనా వేస్తారు. ఒకటి: పీఎం 2.5.. అంటే  ప్రతి ఘనపు మీటరు గాలిలో 2.5 మైక్రాన్ల వ్యాసం గల కాలుష్యాలు. చాలా సూక్ష్మంగా ఉండే ఈ కాలుష్యాలు ఊపరితిత్తుల లోలోపలికి చొరబడి ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తాయి. రెండు: పీఎం 10.. అంటే ప్రతి ఘనపు మీటరు గాలిలో 10 మైక్రాన్ల వ్యాసం గల కాలుష్యాలు. ఇవి ముక్కు, గొంతు వరకు మాత్రమే ఇబ్బంది కలిగిస్తాయి. పరిమాణంలో పెద్దగా గల ఈ కలుషిత పదార్థాలు ఊపిరితిత్తుల వరకు చొరబడటం అరుదు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 38 లక్షల మంది ఇళ్ల లోపలి వాయు కాలుష్యాల కారణంగానే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. వాహనాల నుంచి వెలువడే పొగ, భారీ గృహనిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల కార్యకలాపాల వల్ల చెలరేగే ధూళి, జనసంచారం ఉన్న చోట్ల చెత్తను తగులబెట్టడం, వేడుకల్లో విచ్చలవిడిగా బాణసంచా కాల్చడం వల్ల ఆరుబయట కాలుష్యం ఏర్పడుతోంది. 

ఇప్పటికీ కట్టెల పొయ్యిలే
ఆసియా, ఆఫ్రికాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు, పిడకలు వంటివి ఉపయోగిస్తుండటంతో ఇళ్ల లోపల కూడా జనం వాయు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మన దేశంలో కట్టెలు, పిడకలతో పొయ్యి వెలిగించుకునే వారి సంఖ్య 10 కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు, పిడకలు, «ఊక, ఎండుటాకులు, రంపపు పొట్టు వంటివి ఉపయోగిస్తుండటం వల్ల ఇళ్లలో కూడా విపరీతమైన వాయు కాలుష్యానికి లోనవుతూ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఇళ్లలో ఏర్పడిన వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా దాదాపు 4 లక్షల మంది వరకు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 90 శాతం మంది కట్టెలు, పిడకలు వంటివే వంటచెరకుగా వాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనైతే 24 శాతం మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఇంటా బయటా వాడుతున్న కట్టెలు, పిడకలు వంటి వాటి పరిమాణం ఏటా 16.50 కోట్ల టన్నుల మేరకు ఉంటుందని, వీటి నుంచి వ్యాపించే పొగ ద్వారా 4.20 లక్షల టన్నుల సూక్ష్మ కాలుష్యాలు గాల్లోకి చేరుతున్నాయని ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ఒక అధ్యయనంలో వెల్లడించింది. పొయ్యిలోకి పిడకలు వాడే బదులు గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేసి, బయోగ్యాస్‌ ఉపయోగించినట్లయితే వాయుకాలుష్యం తగ్గడంతో పాటు, వ్యవసాయ భూములకు నాణ్యమైన సేంద్రియ ఎరువు కూడా లభిస్తుందని ఐక్యరాజ్య సమితి నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో వాహనాల ద్వారా వెలువడే పొగ కంటే, వంటచెరకు ద్వారా వెలువడే పొగ మూడు రెట్లు అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. గ్రామీణ పేదలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నా, కట్టెల పొయ్యిల వాడకం కొనసాగుతూనే ఉంది.

వాహనాల కాలుష్యం
పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతోంది. నాణ్యమైన పెట్రోలు, డీజిల్‌ వాడకం వల్ల కొంత కాలుష్యం ఏర్పడుతుంటే, కల్తీ పెట్రోలు, డీజిల్‌ వాడకం వల్ల అంతకు రెట్టింపు కాలుష్యం చుట్టుముడుతోంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూ ఉండటంతో ఆటోలు, మినీవ్యాన్లు వంటివి నడిపే డ్రైవర్లు ఆదాయం కోసం కల్తీ ఇంధనంపై ఆధారపడుతున్నారు. కల్తీ ఇంధనంతో నడిచే వాహనాలు వాతావరణంలోకి మరింతగా కాలుష్యాన్ని విరజిమ్ముతున్నాయి. వాహనాల ద్వారా కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లతో పాటు ప్రమాదకరమైన మిథేన్‌ వంటి హైడ్రోకార్బన్లు గాలిలోకి చేరుతున్నాయి. ఇవి ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రతరం చేస్తోంది.  ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకున్న వాహనాలను నెమ్మదిగా నడపక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాహనాల్లోని ఇంధనం మితిమీరి ఖర్చవడం ద్వారా గాల్లోకి కలుషిత వాయువులు చేరుతుంటాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు, వాహనాలకు అనుగుణమైన రోడ్లు లేకపోవడంతో మన నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య అనివార్యంగా మారుతోంది. వాహనాల వల్ల ఏర్పడిన కాలుష్యం కారణంగానే బెంగళూరు వంటి కొన్ని నగరాల్లో దాదాపు యాభై శాతం మంది చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యమే కాకుండా, బొగ్గు, చమురు, సహజవాయువులను ఇంధనంగా ఉపయోగించే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు కూడా ఇతోధికంగా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాహనాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్ల నుంచి గాలిలోకి సూక్షా్మతి సూక్ష్మమైన కార్బన్‌ కణాలు, ధూళి కణాలు మోతాదుకు మించి చేరుతున్నాయి. వాహనాల కారణంగా వాయు కాలుష్యమే కాకుండా, ధ్వని కాలుష్యం కూడా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, విపరీతమైన ధ్వని కారణంగా ప్రజలు నానా వ్యాధుల బారిన పడుతున్నారు. 

వాయు కాలుష్యం వల్ల తలెత్తే వ్యాధులు
వాయు కాలుష్యం వల్ల తలెత్తే కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఇవే: ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీఓపీడీ), లుకీమియా, న్యుమోనియా, ఊపిరితిత్తుల బలహీనత, గుండెజబ్బులు, గర్భిణులు వాయు కాలుష్యానికి లోనైతే వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం వంటి లోపాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి.

నీటి కాలుష్యం
వాయు కాలుష్యం తర్వాత భారత్‌ను పట్టి పీడిస్తున్న మరో పెద్ద బెడద నీటి కాలుష్యం. దేశవ్యాప్తంగా గల 3,119 నగరాలు, పట్టణాలు ఉంటే, వాటిలో కేవలం 209 నగరాలు, పట్టణాల్లో మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ పాక్షికంగా ఉంది. కేవలం ఎనిమిది నగరాల్లో మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దేశంలోని 114 పట్టణ ప్రాంతాలకు చెందిన మురుగునీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా, యథాతథంగా గంగానదిలోకి వదిలేస్తున్నారు. భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రతిరోజూ 3835.40 కోట్ల లీటర్ల మురుగునీరు విడుదలవుతోందని అంచనా. అయితే, మన పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మురుగునీటి శుద్ధి యంత్రాలు రోజుకు 1178.60 కోట్ల లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేయగలవు. మిగిలిన మురుగునీరంతా యథాతథంగా నదుల్లోకి చేరుతోంది. దీనివల్ల ప్రజలు పవిత్రంగా భావించే నదులు దారుణంగా కలుషితమవుతున్నాయి. దేశంలోనే ప్రధానమైన గంగానదిని తీసుకుంటే, ఈ నది పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 50 కోట్ల మంది నివసిస్తున్నారు. గంగానదిలో రోజూ దాదాపు 20 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. యమునా నది పరిస్థితి కూడా దాదాపు ఇదే తీరులో ఉంది. ఈ నదుల జలాల్లో కోలిఫామ్‌ బ్యాక్టీరియా సహా నానా ప్రమాదకర సూక్ష్మజీవులు, రసాయనాలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్వహించిన పరీక్షల్లో తేలింది. భారత ప్రభుత్వం 2002లో జాతీయ జల విధానంలో మార్పులు చేపట్టింది. నీటి వనరుల నిర్వహణ వికేంద్రీకరించి, నీటి వనరులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ విధానాన్ని రూపొందించినా, నేటికీ పరిస్థితులు మెరుగుపడిన దాఖలాల్లేవు.

నీటి కాలుష్యం వల్ల తలెత్తే వ్యాధులు
నీటి కాలుష్యం వల్ల డయేరియా, కలరా, మలేరియా, ఫైలేరియాసిస్, టైఫాయిడ్, హెపటైటిస్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మురుగునీరు నిల్వచేరే చోట దోమలు విజృంభించి బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, చికున్‌ గున్యా వంటి నానా రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్‌’ వంటి కార్యక్రమాలు తలపెట్టినా, ప్రజా చైతన్యం కొరవడటం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.

ఘన వ్యర్థాల కాలుష్యం
ఘన వ్యర్థాల కాలుష్యం మన దేశాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య. విచ్చలవిడి ప్లాస్టిక్‌ వాడకం వల్ల పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వ్యర్థమైన ఆహార పదార్థాలు, జంతు కళేబరాలు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, ఆస్పత్రుల వ్యర్థాలు, భవన నిర్మాణ కార్యక్రమాల వల్ల పోగుపడే సిమెంటు, కాంక్రీటు వ్యర్థాలు భూసారానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. వీటికి తోడు ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకం పెరగడంతో వీటి వ్యర్థాలు కూడా ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. భారత్‌లో ఏటా 20 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పోగుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. భారత్‌లోని పట్టణ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు 10 కోట్ల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ఇవి చెత్తకుప్పల్లోకే కాకుండా కాలువలు, నదుల్లోకి, తీర ప్రాంతాల్లోనైతే సముద్రాల్లోకి చేరుతున్నాయి. నదులు, సముద్రాల్లోకి చేరిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు వాటిలోని జలచరాల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. వ్యర్థాల నియంత్రణకు సమీకృత విధానాన్ని అమలు చేయాలని, ఘన వ్యర్థాల్లో తడి, వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని, వ్యర్థాలను రీసైకిల్‌ చేయడం, ప్రమాదకర వ్యర్థాలను సురక్షితమైన పద్ధతుల్లో తగులబెట్టడం వంటి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో దేశంలోని పట్టణ సంస్థలను ఆదేశించినా, చాలా పట్టణాల్లో నేటికీ చెత్త సమస్య కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడా కొన్ని పట్టణ సంస్థలు ప్లాస్టిక్‌ సంచుల వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నా, చాలా చోట్ల ప్లాస్టిక్‌ సంచుల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. వీధుల్లో పోగుపడిన చెత్తకుప్పలు ఎలుకలకు ఆలవాలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎలుకలు మితిమీరితే వాటి ద్వారా ప్లేగు వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ఘన వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల జీర్ణకోశ సమస్యలు, డయేరియా, కలరా, హెపటైటిస్‌ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఎలా ఉన్నా, ప్లాస్టిక్‌ వాడకంపై ప్రజలే స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. 
– పన్యాల జగన్నాథదాసు

సిగరెట్లకు  సమానమైన కాలుష్యం
సిగరెట్లు తాగే అలవాటు ఉన్నా లేకున్నా, మన నగరాల్లోని గాలిని పీలిస్తే చాలు ఉచితంగానే సిగరెట్ల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ కలుగుతాయని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. ఏయే నగరాల్లోని గాలి ఎన్ని సిగరెట్లకు సమానమో వివరిస్తూ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం...

పీఎం –10 కాలుష్యాల్లో టాప్‌ – 5 నగరాలు
ఢిల్లీ - 292
ఢారా - 147
కైరో -  284
ముంబై -104
బీజింగ్‌ - 92

మరిన్ని వార్తలు