ఉత్తరం: కడుపులో బిడ్డకు పంచ ప్రాణాలు

31 Aug, 2013 23:22 IST|Sakshi
ఉత్తరం: కడుపులో బిడ్డకు పంచ ప్రాణాలు

మనిషి మనుగడకు పంచభూతాలు ఎలా అండగా ఉంటాయో... కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు పంచ ఆహార పదార్థాలు అలానే అండగా ఉంటాయి. అవి బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు ఉపకరిస్తాయి. అందమైన పాపాయిని మీ చేతుల్లో పెడతాయి. అందుకే బిడ్డకు పంచ ప్రాణాలైన ఆ ఐదు ఆహార పదార్థాలేమిటో కాబోయే ప్రతి తల్లీ తెలుసుకుని తీరాలి.
 
 పాలు: సంపూర్ణ ఆహారం. తల్లీబిడ్డకు కావాల్సిన దాదాపు అన్ని పోషకాలను అందిస్తాయి. కాబట్టి రెండు పూటలా పాలు తీసుకోవడం అంటే పండంటి బిడ్డకు పాలు పట్టినట్లే.ఆకుకూరలు: చక్కటి రూపురేఖలు, మంచి మేధస్సుకు ఇవి ప్రధాన ఆహారం. కడుపులో ఉన్న బిడ్డ మంచి తెలివితేటలు, మానసిక వికాసంతో జన్మించడానికి దోహదం చేసేవి ఆకుకూరలే. అందుకే ఫోలిక్ యాసిడ్ మొదటి నెల నుంచే ఇస్తారు. మనం ఆకుకూరల్ని తీసుకుంటామో లేదో అన్న ఆలోచనతో వైద్యులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు.
 
 పళ్లు: మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చేవి... మేలు తప్ప కీడు చేయనవి పళ్లు. అన్ని రకాల పళ్లను తీసుకుంటుంటే ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పళ్లు తొమ్మిది నెలల పాటు ఆహారంలో తప్పనసరి కావాలి.
 
 మాంసకృత్తులు: ఆరోగ్యం, వికాసంతో పాటు బిడ్డకు చక్కటి సౌష్టవం ఉన్న శరీరం కూడా అవసరం కదా. అందుకే మాంసకృత్తులు కావాలి. ఇవి కావాలంటే గుడ్లు, మాంసం, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినాలి. ఇవి బలవర్ధకమైన ఆహారం. ఆరోగ్యంతో కూడిన చక్కటి సౌష్టవ దేహాన్ని రూపొందింపజేస్తాయి.
 
 ఆరుపూటల ఆహారం: తల్లి తీసుకునే ఆహారంలో తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎక్కువ గ్రహిస్తుంది. కాబట్టి... తల్లి సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. ఎసిడిటీ రాకుండా చూసుకోవాలి. వేళకు తినాలి. దానర్థం ఇద్దరు తినాల్సినంత తినాలని కాదు. షుష్టుగా భోంచేయాలి. మూడు పూటలా భోజనం, మరో మూడు పూటలు శ్నాక్స్ తినాలి. శ్నాక్స్‌లో మసాలా లేకుండా చూసుకోవాలి.
 ఇవన్నీ పాటించి తొమ్మిది నెలలు ఆగి, పండంటి బిడ్డ పోటీలకు మీ బేబీని పంపండి!!
 
 అందానికి ‘ఉచిత’ సలహాలు
 -        కీర దోస తినడం, అలసిపోయిన కళ్లమీద పెట్టుకోవడం.
 -        మంచి నీళ్లు బాగా తాగడం, చల్లటి నీటితో కనీసం ఆరుసార్లు మొహం కడగటం.
 -        పడుకునేటపుడు సాక్స్ వాడటం, తరచుగా నిమ్మరసం పాదాలకు రాయడం.
 -        వెల్లకిలా పడుకోవడం. తగినంత నిద్ర పాటించడం.
-       ఆలోచనలు, ఆందోళనలు వీలైనంత తగ్గించుకోవడం.
-        వాదనలకు దూరంగా, హాస్యానికి దగ్గరగా ఉండడం.

మరిన్ని వార్తలు