హార్ట్ ఎగ్జామినేషన్స్ గుండెపోటును గుర్తించే పరీక్షలు | Sakshi
Sakshi News home page

హార్ట్ ఎగ్జామినేషన్స్ గుండెపోటును గుర్తించే పరీక్షలు

Published Sat, Aug 31 2013 11:17 PM

హార్ట్ ఎగ్జామినేషన్స్ గుండెపోటును గుర్తించే పరీక్షలు

హార్ట్ ఎటాక్ అంటే ప్రతివారికీ భయమే. ఎందుకంటే అది వచ్చిందని తెలిసేలోపే కొందరిలో మరణం సంభవించవచ్చు. ఇటీవల వైద్య పరీక్షలు చాలా ఖరీదైన నేపథ్యంలో డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే చాలామందిలో భయం.  కానీ మీకో విషయం తెలుసా? చాలా చవగ్గా చేయించే ఈసీజీ పరీక్ష ద్వారా గతంలో మీకు హార్ట్ ఎటాక్ వచ్చిందా అన్న విషయం కూడా దాదాపు 80 శాతం నుంచి 90 శాతం తెలిసిపోతుంది. అందుకే తమకు హార్ట్ ఎటాక్ వచ్చిందేమో అని అనుమానించే వారు... చాలా చవగ్గా లభ్యమయ్యే ఈసీజీ తీయించుకుంటే చాలా తమకు వచ్చిన ఛాతీనొప్పి గుండెపోటా, కాదా అన్న నిర్ధారణ క్షణాల్లో జరిగిపోతుంది. ఈసీజీతో పాటు... గుండెకు సంబంధించిన మరికొన్ని పరీక్షల వివరాలూ, ఏ రకమైన గుండెపరీక్ష ఎందుకు అన్న అవగాహన కోసం ఈ కథనం.
 
 గుండెజబ్బుకు ప్రధాన లక్షణం గుండెనొప్పి లేదా ఛాతీలో నొప్పి. కానీ... ఈరోజుల్లో చాలా మందిలో షుగర్ సమస్య ఉండనే ఉంది. షుగర్ వచ్చిన వారిలో నొప్పి తెలిసే అవకాశాలు తెలియదు కాబట్టి కొందరిలో గుండెపోటు వచ్చిన విషయమే తెలియదు. ఇక మరికొందరిలో తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చిన ఛాతీలో మంటనూ గుండెనొప్పి కావచ్చని అపోహ పడుతుంటారు. అందుకే గుండెపోటును అనుమానించే సమయంలో మరికొన్ని లక్షణాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ లక్షణాలివే...
 
  ఆయాసం  చెమటలు పట్టడం  కళ్లు తిరగడం  నడక తర్వాత లేక వ్యాయామం తర్వాత ఇబ్బంది ఎక్కువ కావడం. వీటితో పాటు పొట్ట ఉబ్బరంగా ఉండటం, తేన్పులు ఎక్కువగా రావడం, వాంతులు కావడం కూడా గుండెజబ్బు లక్షణాలుగా పరిగణించాలి. అప్పుడు మనకు మరో సందేహం వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఆరోగ్యవంతుల్లోనూ రోజూ కనిపించేవే. మరి అలాంటిప్పుడు రోగికి ఉన్నది గుండెజబ్బు కావచ్చేమో అని గుర్తించడం ఎలా? అప్పుడు రోగికి ఉన్న హైబీపీ, మధుమేహం, పొగతాగే అలవాటు, కుటుంబంలో ఎవరికైనా చిన్నప్పుడే గుండెజబ్బు రావడం, స్థ్థూలకాయం వంటి రిస్క్ ఫాక్టర్లను పరిగణనలోకి తీసుకోవాలి.
 
 ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉండి, గుండెపోటు తాలూకు పై లక్షణాలు  కూడా కనిపించినప్పుడు ఈసీజీ తీయించుకుంటే వచ్చింది గుండెజబ్బా, కాదా అన్న విషయం చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. అందుకే గుండెజబ్బుల విషయంలో నిర్ధారణకు ముందుగా ఆధారపడేది ఈసీజీ మీదనే. అయితే కేవలం ఈసీజీ వల్లనే గుండెకు సంబంధించిన అన్ని వివరాలూ తెలియవు. అందుకే ఈసీజీతో పాటు ఇతర గుండెపరీక్షలు కూడా ఎందుకు చేస్తారో తెలుసుకుంటే వాటి పట్ల మనకు కాస్త అవగాహన కలుగుతుంది.  
 
 ఈసీజీ ఎందుకు? : గుండెపోటు  వచ్చిన 80, 90 శాతం కేసుల్లో  ఈసీజీతో అది నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటునూ గుర్తించవచ్చు. అయితేగుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా ఒక్కోసారి గుండెపోటు వల్ల కలిగే మార్పులన్నీ ఈ పరీక్షలో వెంటనే నమోదు కాకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు.
 
 ఎకో పరీక్ష : ఎకో పరీక్ష అన్నది గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలుపుతుంది. గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో పరీక్షపైనా ఆధారపడవచ్చు. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పైగా ఎకో పరీక్ష నిర్వహించడంలో తర్ఫీదుపొందిన నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులు మాత్రమే నిర్వహించాలి.
 
 యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష వాటిని సమకూరుస్తుంది. దాంతోపాటు గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి కూడా ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తాయి.
 
 హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు :
గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌ల పాళ్లు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే... అది ఎంత చిన్నది అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండెపోటే అన్న విషయం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది.


 - నిర్వహణ: యాసీన్
 
 డాక్టర్ సి.రఘు
 కార్డియాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్,
 హైదరాబాద్.

 
 గుండెపోటును తొలిదశలోనే కనుగొనడం ఎలా..?

 మనం పైన పేర్కొన్న పరీక్షల్లో యాంజియోగ్రామ్, ఎకో పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాదు... అవి అందరికీ అంత సులువుగా అందుబాటులో లేనివి. అందుకే ఒక వ్యక్తి ఛాతీలో నొప్పి అనో లేదా గుండెనొప్పి వచ్చిందనో నిర్ధారణ చేయాలంటే మొదుగా ట్రోపోనిన్ పరీక్ష చాలా ముఖ్యం. రక్తంలో వాటి మోతాదు పెరగడంతో పాటు ఛాతీనొప్పి ఉండి, ఈసీజీలో మార్పులు ఉంటే అది కచ్చితంగా గుండెపోటే. కాబట్టే గుండెపోటును ప్రాథమికంగా తెలుసుకోవడం కోసం మనం ఎక్కువగా ఈసీజీపై ఆధారపడుతున్నాం. ఆ తర్వాత దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేయడం కోసం ట్రోపోనిన్ పరీక్షలను ఆశ్రయిస్తున్నాం.
 

Advertisement
Advertisement