నిజమైన శ్రీమంతుడు!

31 Oct, 2015 23:55 IST|Sakshi
గ్రామస్తులతో సెంథిల్ (తెల్ల పంచె కట్టుకున్న వ్యక్తి)

ఆదర్శం
ఈ మధ్యనే ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలైంది. అందులో మహేశ్‌బాబు కోటీశ్వరుడు. కానీ తన సొంత ఊరిని బాగు చేయడం కోసం అన్ని సుఖాలూ వదులు కుంటాడు. ఆ ఊరి రూపురేఖల్ని మారుస్తాడు. ఊరి జనం జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు. ఇదంతా చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మళ్లీ మళ్లీ చూసి సినిమాని సూపర్‌హిట్ చేశారు. అయితే  సినిమాలోనే కాదు, నిజంగా కూడా అలా జరిగిందని, ఓ వ్యక్తి అచ్చం అలాగే తన సర్వస్వాన్నీ వదిలి, తన ఊరికే జీవితాన్ని అంకితమిచ్చాడని మీకు తెలుసా? ఇదిగో... ఇతనే ఆ రియల్ శ్రీమంతుడు!
 
అమెరికాలో ఉద్యోగం. నెలకు రెండు లక్షల జీతం. సుఖాల్లో మునిగి తేలగల జీవితం. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని బతికే అవకాశం... ఇదీ సెంథిల్ జీవితం. అతడవన్నీ వదులుకున్నాడు. తాను ఒక్కడూ సుఖంగా, సంతోషంగా ఉంటే చాలదని... త నలాగే తాను పుట్టి పెరిగిన గ్రామ ప్రజలు కూడా ఉండాలని తపించాడు. వారి జీవితాలను మార్చేందుకు మహా యజ్ఞమే చేశాడు.
 
తమిళనాడులోని తిరుచ్చికి దగ్గరలో ఉన్న తెన్నూర్ గ్రామంలో పుట్టి పెరిగాడు సెంథిల్. ఆ పేద ఊరిలో, కడు పేద కుటుంబంలో పుట్టాడతను. కష్టపడి చదివాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్లు పని చేశాక అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది.
 అమెరికాలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి సెంథిల్‌కి. కానీ ఏ రోజూ మన శ్శాంతిగా లేడు. ఎప్పుడూ ఊరే గుర్తొచ్చేది. పట్టు పరుపు మీద పడుకున్నప్పు డల్లా, తన ఊళ్లో చాపల మీద పడుకునే వాళ్లు గుర్తొచ్చేవారు.

ఖరీదైన శాండ్‌విచ్‌లు తిన్నప్పుడల్లా, గంజి అన్నం దొరికినా చాలని పడిగాపులు పడే పసిపిల్లలు కళ్లముందు కదిలేవారు. చిన్నప్పట్నుంచీ అతని నైజం అంతే. తను ఎన్ని కష్టాలు పడినా, ఎదుటివాళ్ల కష్టాలు చూసి తట్టు కోలేకపోయేవాడు. తాను ఎదిగి అందరికీ సాయపడాలి అనుకునేవాడు. ఆ పట్టుదలే అతణ్ని ఇంతవాణ్ని చేసింది. అందుకే ఎప్పుడెప్పుడు తన ఊరికి వెళ్లిపోదామా, ఎప్పుడెప్పుడు తనవాళ్ల జీవితాలు మారు ద్దామా అని తపించేవాడు. కానీ అందుకు తగినంత డబ్బు కావాలి కాబట్టి, అది సంపాదించేవరకూ ఓపిక పట్టాడు. ఆ సొమ్ము సమకూరగానే ఫ్లయిట్ ఎక్కేశాడు. తన ఊళ్లో వాలిపోయాడు.
 
మొత్తం మార్చేశాడు...
ఊరిలో అడుగుపెట్టగానే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది సెంథిల్‌కి. చిన్నప్పుడు అది ఎలా ఉందో, ఇన్ని సంవత్సరాల తర్వాతా అలానే ఉంది. అదే పేదరికం, అవే కష్టాలు, అవే కన్నీళ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు సెంథిల్. పక్కా ప్రణా ళికలు వేసుకున్నాడు. అనుకున్నదే తడ వుగా అమలు చేయడం మొదలు పెట్టాడు.
 
మొదట అందుబాటులో ఉన్న హెల్త్ వర్కర్స్‌ని, గ్రామస్తులనీ ఒక్కటి చేశాడు. ఊరంతా శుభ్రం చేయించాడు. బహిరంగ మల విసర్జనను నిషేధించాడు. మరుగు దొడ్లు కట్టించాడు. తర్వాత విద్యపై దృష్టి పెట్టాడు. చదువు అవసరాన్ని చాటి చెప్పి, పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లేలా చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంతంత మాత్రంగా ఉండటం గమనించి, అధికారు లతో మాట్లాడాడు. మంచి టీచర్లు, పుస్తకాలు వగైరా ఏర్పాటు చేయించాడు.  సరైన ఆహారం లేక పిల్లలు సరిగ్గా ఎదగక పోవడం గమనించి... సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే భోజనంతో పాటు అదనంగా లడ్డూలు, పాలు తన సొంత ఖర్చుతో అందించ సాగాడు. తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను స్టడీ చేసి, గ్రామ రైతులకు నేర్పాడు. యువకులకు పలు రకాల వ్యాపారాలు నేర్పించాడు. మహిళలతో స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసి, చేతి వృత్తుల ద్వారా సంపాదించడం నేర్పాడు.
 
ఇలా తన సొంత ఊరికోసం ఎన్నో చేశాడు, చేస్తున్నాడు సెంథిల్. ఆ ఊరే అతని ప్రపంచం, ఆ మనుషులే అతని జీవితం. ఆ ఊరివాళ్లకు అతను దేవుడు. విదేశాల్లో చదువుకుని, స్వదేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన గాంధీని అతనిలో చూసుకుంటున్నారు వాళ్లు. అందుకే అతణ్ని ‘యంగ్ గాంధీ’ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. అతను లేకపోతే తమ పరిస్థితి ఇలా ఉండేది కాదని, తమ పిల్లల జీవితాలు నిరర్థకమై పోయేవని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతు న్నారు. ఆ చెమ్మలో కృతజ్ఞత కదలాడు తుంది. వారి మాటల్లో సెంథిల్ గొప్ప దనం ప్రస్ఫుటమవుతుంది!

మరిన్ని వార్తలు