అతడు గొర్రెతో బయలుదేరాడు!

27 Jan, 2019 00:10 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ఎన్టీఆర్‌ సొంతగా నిర్మించి నటించి నవ్వులు పూయించి సినిమా ఇది. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

భోజనాలు చేస్తున్నారు.చేస్తూనే కొడుకు వైపు తిరిగి మెల్లిగా గొంతు విప్పాడు తండ్రి...‘‘ఒరే అయ్యా! మన పరిస్తితులు నీకు తెలుసుగదరా. గొర్రె ఎంత ఎదిగినా తోక బెత్తెడే అన్నట్లు ఎన్నాళ్లు సేద్యం చేసినా  అప్పులేగానీ నాలుగు రాళ్లు  ఎనుకేసుకోవడం లేదు. అక్కడ మనం నమ్మకంగా ఉంటే జమిందారుగారే ఏదో ఒక సహాయం చేయకపోరు’’అవును అన్నట్లుగానీ, కాదు అన్నట్లుగానీ ఏ భావం ప్రదర్శించకుండా తినడంలో నిమగ్నమయ్యాడు కొడుకు. అతడి ముఖంలో పసితనం, అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఆ అమాయకుడి అమ్మ మాత్రం కొడుకును బస్తీకి పంపించడానికి, జమిందారుగారి ఇంట్లో నౌకరీ చేయించడానికిగానీ  ససేమిరా అంటుంది.భార్యాభర్తల వాదులాట తరువాత చివరికి ఆ స్వాతిముత్యం ‘‘అలాగే అయ్యా! నేను బస్తీకి వెళతాను’’ అన్నాడు.‘‘భీముడూ మనం బస్తీకి వెళ్లాలి’’ అంటూ  తన ప్రియమైన గొర్రెను కూడా తోడుగా తీసుకువెళుతుంటే...‘‘అది ఎందుకురా?’’ ఆశ్చర్యంగా అడిగాడు అయ్య.‘‘నన్ను చూడనిదే అది  ఉండదు’’ అన్నాడు తన గొర్రె వైపు ఆప్యాయంగా చూస్తూ.‘‘దాన్ని చూడకుండా వీడు ఉండలేడు’’ అని నవ్వింది అమ్మ.అందరూ నవ్వుకున్నారు. ఆ పల్లెటూరి పిల్లగాడు తన భీముడితో బస్తీ బయలుదేరాడు.

వాళ్లను వీళ్లనూ ఆనవాళ్లు  అడుగుతూ  ఏమైతేనేం జమిందారు ఇంటిముందుకు వచ్చాడు కుర్రాడు.గేటు ముందు గూర్ఖ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.అతడిని లేపి...‘‘ఏమయ్యోయ్‌... ఏమయ్యోయ్‌... జమిందారుగారి  ఇల్లు ఇదేనా?’’ అడిగాడు.బంగారంలాంటి నిద్రను పాడు చేశాడనే కోపంతో...‘‘ఆ..ఆ...జావో జావో’’ అని విసుక్కున్నాడు గూర్ఖ.‘‘జావా? జావా ఏంది?’’ హిందీ ముక్కలు అర్థం కాని పల్లె యువకుడు నోరెళ్లబెట్టాడు.గుర్ఖా వాలకం చూస్తే తనను ఆ ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేలా లేడు. అందుకే...ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఆ ఇంట్లోకి దొంగతనంగా దూరాడు బుల్లోడు.‘‘వామ్మో!  ఏంది ఈ  అమ్మాయి అరకొర బట్టలేసుకొని బయట నిలబడింది.  ఎవరన్న చూస్తే! ఏం బస్తో ఏందో’’ అనుకొని ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు.కొద్దినిమిషాల్లోనే ఆమె మనిషి కాదని పాలరాతి విగ్రహమని తెలిసి బోలెడు ఆశ్చర్యపోయాడు బుల్లోడు. నాలుగు అడుగులు ముందుకు  వేశాడు.మరో బొమ్మ కనిపించింది.కూర్చున్నట్లుగా ఉంది.‘‘ఏంటబ్బా ఇది! ఈ ఇంటినిండా బొమ్మలేగాని మనుషులే లేరు’’ అనుకున్నాడు.ఆమె లేచి నిల్చుందిబుల్లోడికి ఒకటే ఆశ్చర్యం.‘‘ఓర్నీ...నువ్వు మనిషివన్నమాట...హాహాహా’’ అని నవ్వడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఒక కాగితం ఆమె చేతికి ఇచ్చి...‘‘ఇదిగో అంతా ఇందులో ఉంది. తెలిసిందా?’’ అన్నాడు.‘తెలియదు’ అన్నట్లుగా తల ఊపింది ఆమె.‘‘తెల్వదా? చదువురాదా?’’ అడిగాడు.‘‘రాదు’’ అన్నట్లుగా తల ఊపింది.

బుల్లోడు వెరీ వెరీ డిజప్పాయింటెడ్‌.‘‘ఆ భగవంతుడు నిన్ను  బొమ్మగా చేసినా బాగుండు. ఏంటో మరి... ఈ బస్తీలో మనుషులెవరో, బొమ్మలెవరో తెలవడం లేదు’’ అన్నాడు అయోమయంగా.ఈలోపు..‘‘ఆవో...ఆవో’’ అంటూ గూర్ఖా పరుగెత్తుకు వచ్చి కుర్రాడిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.‘‘ఆగెహె...ఆవు లేదు దూడ లేదు. నీకంటే ఆవు నయం’’ అని కోపగించుకున్నాడు బుల్లోడు.ఈ గడబిడ విని పరుగెత్తుకు వచ్చిన రాణిగారు...‘‘ఏమిటిదంతా... ఎవరివయ్యా నువ్వు?’’ అని బుల్లోడి వైపు చూస్తు అరిచింది.‘‘దండాలమ్మగోరూ...మా రంగయ్య మామ పంపితే వచ్చాను’’ విషయం చెప్పాడు బుల్లోడు.ఈలోపు అక్కడికి భూపాల్‌రావుగారు వచ్చారు. రంగయ్య పంపించాడని ఉత్తరం ద్వారా తెలుసుకొని ‘‘అరే నువ్వా!’’ అన్నాడు శాంతంగా.ఆ పెద్దావిడ వైపు తిరిగి...‘‘మనకు పనిమనిషి కావాలని  కబురు చేశాను. రంగయ్య ఇతడిని పంపించాడు’’ అని వివరించాడు.‘‘అరే! అసలు అయ్యగారివి నువ్వేనాండీ...భలేవాడిని పట్టానే’’ అనే సంబరపడిపోయాడు బుల్లోడు.సంబరం తరువాత ‘‘నేను నానా యాతన  పడి ఇక్కడికి వస్తే...బయటికి పొమ్మంటున్నారు చూడండి’’ అని భూపాల్‌రావుగారికి ఫిర్యాదు చేశాడు.‘‘ఇతని వేషం అది చూస్తే పనిచేసే రకంలా లేడే’’ అని పరాచికంగా అంది రాణిగారు.బుల్లోడికి రోషం వచ్చేసింది.‘‘ఏవండోయ్‌ అమ్మగారూ...నాతో సమానంగా పని చేసేవాడు మా ఊళ్లోనే లేడు. ఏమనుకున్నారో ఏమో’’ అన్నాడు.ఇంట్లో వాళ్లందరినీ బుల్లోడికి పరిచయం చేశారు  భూపాలరావుగారు.‘‘పొద్దున్నే లేవాలి... మొక్కలకు  నీళ్లు పోయాలి.... మేడంతా శుభ్రం చేయాలి. చిన్నయ్యగారికి కాఫీ, పేపర్‌  ఇవ్వాలి’’ లీస్టు చదువుకుంటూ పోతుంది పనమ్మాయి కాంతం.‘లేదురా సిరిసంపదలలో లేశమైన సంతసం’ దూరంగా తత్వం వినబడుతుంది.
 

మరిన్ని వార్తలు