ప్రయాణం

8 Sep, 2019 11:14 IST|Sakshi

 కొత్త కథలోళ్లు

రైలు వేగంగా పరుగెడుతోంది, జనరల్‌ బోగీలో ఓ మూల కిటికీకి తల ఆన్చుకొని కూర్చొన్న నాలో అంతకన్నా వేగంగా  సుడులు తిరుగుతున్నాయి జ్ఞాపకాలు. నాకు తెలీకుండానే కంటిలో నీరు ధారలు  కడుతోంది.
నా చేతిలో  చీటీ గాలికి  రెప రెప లాడుతోంది.
 ‘మదర్‌ ఎక్సపైర్‌డ్‌ . స్టార్ట్‌ ఇమ్మీడియేట్లీ’ 
ఇంటి దగ్గర నుండి చిన్ననాటి  స్నేహితుడు వేణు ఇచ్చిన   టెలిగ్రామ్‌ అది. ఆరోజు మధ్యాహ్నం అనాటమీ క్లాస్‌లో ఉండగా పోస్ట్‌మాన్‌ వెతుక్కొంటూ వచ్చి  ఇచ్చి వెళ్ళాడు. ఆ క్షణం  కాళ్ళకింద భూమి కదలి పోతున్న ఫీలింగ్‌.  కళ్ళు బైర్లు కమ్మి కూలబడ్దను. చుట్టూ చేరిన నా బ్యాచ్‌మేట్స్‌ నన్ను ఓదార్చడానికి విఫల ప్రయత్నం చేశారు.
ఎలా ఓదార్చగలరు?

నాకు తగిలిన ఈ షాక్‌ నుండి కోలుకోవడం నాకు సాధ్యమేనా? అసలు నా అంత దురదృష్టవంతుడు ఎవరైనా వుంటారా? 
 పుట్టిన ఐదేళ్లకే   ఊహ తెలీని రోజుల్లోనే తండ్రిని పోగుట్టుకొన్నాను. రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను, ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇప్పుడు దూరమైతే, అంతకన్నా దారుణం ఉంటుందా? 

ఏమిటి నా దారి? నా ఇద్దరు చిట్టి చెల్లెళ్ళ భవిష్యత్తు? 
ఊరిలో మాకు నా అన్న వాళ్ళు లేరు. అమ్మనాన్నలు ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమవివాహం చేసుకొని వాళ్ళ పెద్దలకు దూరం అయ్యారు. నాన్న అమ్మను తీసుకోని వేరే వూరు వచ్చి  చిన్న ఉద్యోగం సంపాదించుకొని  ఆనందంగా ఉన్న రోజులు నాకు లీలగా గుర్తు.

మేము పుట్టిన సంతోష క్షణాలు  కూడా అమ్మమ్మ,తాతయ్యల రాతి గుండెలను కరిగించలేకపొయాయి. ఆఖరికి రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయిన విషాద సమయంలో కూడా వచ్చి వాళ్ళ బాధ్యతలు యాంత్రికంగా  నిర్వహించి నిర్దయగా మమ్మల్ని అమ్మతో బాటు వదిలి వెళ్లిపోయారు. 
 అమ్మ కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీళ్లు నాకు ఇంకా బాగా గుర్తు.

ఆ క్షణంలోనే  నేను పెరిగి పెద్దవాడనై  అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ కసితోనే చదువుల్లో ముందుండేవాడిని. నన్ను డాక్టర్‌గా చూడాలని అమ్మ కోరిక. అదే నా  లక్ష్యంగా మారింది. రేయింబవళ్లు  కష్టపడి చదివా. 

అంగన్వాడి బడిలో పని చేస్తూ అమ్మ  నేను వద్దు అంటున్న వినకుండా,  తన వంటి మీద మిగిలిన నగలను అమ్మి మరీ కోచింగ్‌కి  నెల్లూరు  పంపించింది. క్రమం తప్పకుండ ప్రతి వారం వచ్చి చూసి వెళ్ళేది. 
ఎంత వద్దన్నా వినకుండా తినడానికి నాకు నా స్నేహితులకు    పిండివంటలు స్వయంగా చేసుకొని వచ్చేది.  చెల్లెళ్ళ చదువులకూ ఏమాత్రం లోపం జరగకుండా  రాత్రనక పగలనక కష్టపడేది.  
మెడిసిన్‌లో ఖచ్చితంగా సీట్‌ వస్తుంది అని అమ్మకు  నా మీద పూర్తి  భరోసా. కానీ, అక్కడ కూడా విధి చిన్న చూపు చూసింది. ఒక్క మార్కులో నాకు మెడిసిన్‌లో సీట్‌ మిస్‌ అయ్యింది. నిరాశలో మునిగిపోయిన నన్ను అమ్మ వెన్ను తట్టి సముదాయించింది.

నాకు వచ్చిన మార్కులకు వెటర్నరీ డాక్టర్‌ కోర్స్‌లో సీట్‌ వస్తుందని మా ఊరి మాస్టర్‌  ద్వారా తెలుసుకొని నన్ను ప్రోత్సహించింది.
 ‘‘మనుషుల  కన్నా జంతువులకు సేవ చేసే అవకాశం రావడం చాలా అదృష్టంరా. నీకు ఆ అవకాశం ఆ  భగవంతుడే ఇచ్చాడు.  మారు మాట్లాడకుండా  జాయినవ్వు’’  అని  తనే స్వయంగా నన్ను కాలేజీలో
దిగ బెట్టి వెళ్లి నెల రోజులు కూడా కాలేదు.
ఇంతలో ఈ పిడుగులాంటి వార్త!

ఇప్పుడు అమ్మ కోరిక తీర్చే అవకాశం కూడా నాకు లేనట్టే. చెల్లెళ్ళను చూసుకోవడానికి  నేను తప్ప ఎవరున్నారు? 
కోర్స్‌ మానేసి  ఊరిలో ఏదయినా చిన్న పని చూసుకోవాలి. ఎందుకు  భగవంతుడు ఇంత  త్వరగా అమ్మను నా నుండి లాగేసుకున్నాడు? అసలు అక్కడ ఏమి జరిగింది?
 నాకు తెలిసినంత వరకు అమ్మకు  ఏ రకమైన అనారోగ్యము లేదు. విజయనగరం మారుమూల ఒక చిన్న గ్రామం మాది.  ఊరిలో  ఉన్న ఒకే ఒక్క పోస్ట్‌ఆఫీస్‌ ఫోన్‌కి మాత్రమే  ట్రంక్‌ కాల్‌ సదుపాయం ఉంది. అది కూడా  ఎప్పుడో గాని పని చేయదు. ఉంటే వేణుగాడే  టెలిగ్రామ్‌కి బదులు ఫోన్‌ చేసేవాడు.

విషయం తెలిసిన వెంటనే ఆఘమేఘాల మీద బయలు దేరా. అప్పటికి ట్రైన్‌ బయలుదేరడానికి ఒక గంట సమయం మాత్రమే ఉంది. ల్యాబ్‌ నుండి ఎలా బయట పడ్డానో తెలీదు. అప్పటికే బాగా సన్నిహితులైన మిత్రులు సమయానికి  ఆపద్భాందవుల్లా   ఆదుకున్నారు.

నా రూమ్మెట్‌ చంద్రం  వాడి సైకిల్‌ మీద ఎక్కించుకొని వేగంగా  నన్ను స్టేషన్‌కి చేర్చాడు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఎప్పటిలానే తిరునాళ్ల సందడి ఉంది. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చిది. మరో ఫ్రెండ్‌ సాయి  ఎప్పుడు దూరాడో  జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లోకి  బాణంలా దూసుకెళ్లి కిటికీ పక్కన సీట్‌ సంపాదించాడు. 
జనరల్‌ టికెట్‌ ఎప్పుడు నా జేబులో వచ్చి చేరిందో తెలీలేదు, రాత్రి తినడానికి నాకు టిఫిన్‌ వాటర్‌ బాటిల్‌ సిద్ధం చేశారు. నన్ను ఒంటరిగా పంపడానికి వాళ్ళకు ఎంత మాత్రం ఇష్టం లేదు.  ఒకరిద్దరు నాతో బాటు రావడానికి  రెడీ అయ్యారు.

నేను బలవంతంగా వారించాను.
 గమ్యం చేరేసరికి తెల్లవారుతుంది. అప్పటి దాకా నరకయాతన తప్పదు. మధ్యలో  ట్రైన్‌ ఆగిన ప్రతిసారి ఉలిక్కిపడి లేచే వాడిని. మా ఊరి స్టేషన్‌ వచ్చేసిందేమో అని ఆత్రంగా కిటికీలో నుంచి చూసేవాడిని.
 నా జీవితంలో అంత సుదీర్ఘ, నరకయాతన ప్రయాణం మరొకటి లేదు!
మనసు స్థిమిత పడటానికి భగవంతుణ్ణి ఎన్నిసార్లు తలచుకున్నానో.

‘‘మనకు ఏ కష్టం వచ్చినా భగవంతుడి మీద భారం వేసి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి బాబు..’’ అని అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అలా చెప్పిన అమ్మే  దూరమైన ఈ కష్టం నుండి నన్ను ఏ  దేవుడు బయట పడేస్తాడు?

‘‘భగవంతుడు  కరుణామయుడు  బాబు. నమ్మిన వాళ్లకు ఎప్పడూ ద్రోహం చెయ్యడు. స్వామి ఆశీస్సులు నీకు  ఎప్పడూ  ఉంటాయి’’ అంటూ  ఒక  ముసలి యాచకుడు  నా నుదిటి మీద విభూది పెట్టి  జేబులో  నా ఇష్టదైవం అయిన చిన్న ఆంజనేయస్వామీ  ఫోటో పెట్టి ఆశీర్వదించాడు. చిన్నప్పడు గుడికి తీసుకెళ్లి కుంకుమ పెడుతూ అమ్మ  అచ్చం అలాగే చెప్పేది.
ఉలిక్కిపడి పూర్తిగా  కనులు తెరిచే లోపు ఆ  ముసలాయన ముందుకు సాగిపొయ్యాడు. తడుముకుని చూస్తే జేబులో అంజనేయస్వామి ఫోటో!

ఏడుస్తూ...ఎప్పుడు మగత నిద్ర లోకి జారుకున్నానో గుర్తు లేదు.
గట్టి కుదుపుతో ట్రైన్‌ ఆగిన శబ్దానికి మెలకువ వచ్చింది. తెలవారింది. మా ఊరి రైల్వే స్టేషన్‌. అప్పటి దాకా ఉగ్గబట్టిన దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకునేలా ఉంది. కాళ్లల్లో సన్నని వణుకు మొదలైయింది. యాంత్రికంగా జనాలు నెట్టుతుంటే ట్రైన్‌ దిగాను.

కళ్ళనిండా సుడులు తిరుగుతున్న కన్నీళ్లు,  ముందు లీలగా  అమ్మ రూపం...కదలి నా వైపే ఆత్రంగా వస్తూ ఉంది!
కళ్ళు తుడుచుకొని  చూశా...అమ్మ....కళ్ళు నులుముకుని మళ్లీ మళ్లీ చూశా.

సందేహం లేదు. కచ్చితంగా అమ్మే! భగవంతుడా!! నా  మొర ఆలకించావా.  పరుగున వెళ్లి  గట్టిగా హత్తుకున్నా కన్నీటి ప్రవాహం ఇంకా  ఆగటం లేదు. కానీ ఇప్పుడు అవి ఆనంద భాష్పాలు!
జరిగిన సంగతి అర్థం కావటానికి నాకు ఎంతో సేపు పట్టలేదు...చనిపోయింది నా స్నేహితుడు  వేణు వాళ్ళ అమ్మ! ఇద్దరికీ  ఉన్న  చనువు వల్ల ‘మదర్‌ ఎక్సపైర్‌డ్‌’ అని  టెలిగ్రామ్‌ ఇచ్చాడు.
 ఆరోజు ఆ  క్షణం అమ్మను హత్తుకొని నేను  అలా ఎంత సేపు ఏడ్చానో నాకే తెలీదు.

‘‘నెల రోజులకే ఇలా దిగులు పెట్టుకుంటే ఎలా రా  పిచ్చి వెధవా.. వేణుకి మనం ఉన్నాము లేరా, ఆరోగ్యం బాగా లేక వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఐపోతే  ఎలా రా?’’   అని విషయం పూర్తిగా తెలియని  అమ్మ  ఓదారుస్తూనే వుంది. 

ఈ సంఘటన జరిగి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయ్యింది!  
అమ్మ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఆమె కోరికలన్నీ నెరవేరాయి. అమ్మ దూరమైందని నేను  బాధ పడిన ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఎన్నో రాత్రులు నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడిని. అది నిజం కాదని తెలిసి మనస్సు తేలిక అయ్యిది.

అప్పటికప్పుడు వెళ్లి అమ్మ మొహం చూసి వస్తే కానీ మనస్సు  స్థిమిత పడేది కాదు.  
ఆ రోజు ట్రైన్‌లో ముసలి యాచకుడు...కాదు, కాదు నా పాలిట దేవుడు. ఆయన ఇచ్చిన ఆంజనేయస్వామి ఫోటో ఇప్పటికీ  నా జేబులో భద్రంగా  ఉంది. మా పిల్లలకి ఈ విషయాన్ని ఎన్నో   సార్లు చెప్పాను. కానీ ఇప్పటికీ అమ్మకు  మాత్రం  చెప్పలేదు!  తథాస్తు  దేవతలు ఉంటారేమో అని నా భయం. మరోసారి అమ్మను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మరి.   
(స్నేహితుని జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా)
- డా. నగరం వినోద్‌ కుమార్‌ 

మరిన్ని వార్తలు