విహారం: వైగన్... మధ్యయుగపు అనుభూతి!

10 Nov, 2013 02:06 IST|Sakshi
విహారం: వైగన్... మధ్యయుగపు అనుభూతి!

ఆదిత్య 369 సినిమా చూసినపుడల్లా... అలాంటి టైమ్ మెషీన్ ఒకటి అందుబాటులో ఉండి మనకు కూడా అలా ముందుకూ వెనక్కు వెళ్లే అవకాశం కనుక వస్తే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. ముందుకు తీసుకెళ్లలేం గాని... టైం మెషీన్ లేకుండానే వెనక్కు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే, షరతులు వర్తిస్తాయి. ఆ అద్భుతం... వైగన్!
 
 చక్కటి వీధులు.. గుంతలు లేని, వంకరలు లేని, మరమ్మతులు అవసరం లేని ఫుట్‌పాత్‌లతో కూడిన వీధులు... వాటికి ఇరువైపులా బొమ్మలు గీసినంత అందంగా ఉండే ఇళ్లు. వీధిలో ఇవతలి ఇంటి బాల్కనీ నుంచి అవతలి ఇంటి బాల్కనీలో వ్యక్తులతో ముచ్చట్లు చెప్పుకునేలా ఓ క్రమపద్ధతిలో ఆ నిర్మాణాలు. ఇంటింటికీ అమర్చిన వీధిదీపాలు. భూగర్భ మంచినీటి, మురుగు నీటి పారుదల... కాలికి మట్టి అంటని రోడ్లు. పగలు అద్భుతంగా రాత్రి సుందరంగా ఉంటుంది ఆ చిన్న నగరం. వైగన్ నగరం... వైశాల్యంలో జనాభాలో చిన్నదే. పేరులో, ఖ్యాతిలో పెద్దది. జనాభా యాభై వేలు, విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు. (మన హైదరాబాదు 700 చదరపు కిలోమీటర్లు కాబట్టి అది ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి). వైగన్ ఫిలిప్పీన్స్ దేశంలో పశ్చిమోత్తరాన ఉంటుంది. దక్షిణ చైనా సముద్రానికి ఎదురుగా ఉండే ఇలాకోస్ సర్ దీవిలో తీరానికి దగ్గరగా ఉంటుంది.
 
 ఏ నగరానికి లేని అవకాశం
 నగరం చిన్నదే గాని విశిష్టతలు బోలెడు. పెద్ద దీవిలో ఒక చిన్న దీవి ఈ నగరం. బహుశా చాలా పెద్ద నగరాలకు కూడా లేని ఒక అద్భుతమైన అవకాశం ఈ బుల్లి నగరానికి దక్కింది. కేవలం ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ఈ నగరానికి నలువైపులా మూడు నదులున్నాయి. అవి కూడా జీవనదులు. ఏడాదిలో 365 రోజులూ ప్రవహిస్తుంటాయి. అంతేనా... ఇంకో అద్భుతం కూడా ఉంది. నగరం నుంచి సైకిల్‌పై వెళ్లగలిగినంత దూరంలో సముద్ర తీరం ఉంది. అది దక్షిణ చైనా సముద్ర తీరం.
 
 కళ్ల ముందు మధ్యయుగపు జాడలు
 ఫిలిప్పీన్స్‌లోని ఈ ప్రాంతాన్ని పదహారో శతాబ్దంలో స్పానిష్‌లు పరిపాలించారు. దీంతో ఇక్కడ భవనాలు యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో ఉంటాయి. అంతేకాదు... ఇది అత్యుత్తమ ప్రణాళికతో నిర్మించిన నగరం. అందుకే వీధులు అయినా, ఇళ్లయినా చాలా చక్కగా అందంగా రూపుదిద్దబడ్డాయి. ఈ ఊళ్లో ప్రతి కట్టడానికి వందేళ్ల నుంచి ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే... ఆధునిక ఆర్‌సీసీ బిల్డింగులు, వోల్వో బస్సులు ఇలాంటివేవీ ఇక్కడ కనపడవు. టక్ టక్ మని తిరిగే గుర్రపు బగ్గీలు... మన వద్ద కూడా కనిపించకుండా పోయిన మరమగ్గాలు సైతం ఉన్నాయి. అవి సజీవంగా, చక్కటి ఆదాయంతో నడుస్తున్నాయి. వీధుల్లో రోడ్లన్నీ సిమెంటు, బ్లాక్ టాప్ రోడ్లు కాదు. మధ్యయుగాల నాటి రాతి రోడ్లు. విద్యుద్దీపాలు కూడా అప్పటి మోడల్‌లోనే ఉంటాయి. పాత భవనాలు కదా అని పాడైపోయిన స్థితిలో ఉంటాయనుకునేరు. ఇప్పటికీ ఫ్రెష్‌గా చక్కటి నిర్వహణతో హాయిగా జీవించడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ విశిష్టమైన నగరాన్ని యునెస్కో ‘ప్రపంచ వారసత్వపు ప్రదేశం’గా గుర్తించింది.
 
 చిన్న నగరం బోలెడు విశిష్టతలు !
 శివారులను కూడా కలిపి ఈ నగరాన్ని ఓ జిల్లా కేంద్రం చేశారు. ఈ జిల్లాకు రెండే రెండు ప్రధాన ఆదాయ వనరులు. ఒకటి పర్యాటకం. రెండు వ్యవసాయం. పుష్కలమైన  నదీజలాలతో 1400 హెక్టార్ల భూమిలో ఇక్కడ వ్యవసాయం కొనసాగుతోంది. దీనివల్ల ఇక్కడి ప్రజలకు అందుబాటులోనే వ్యవసాయ ఉత్పత్తులు దొరుకుతాయి. అంటే ప్రాంతం చిన్నదైనా స్వావలంబన కలిగినది.
 
 చూడదగ్గ ప్రదేశాలు..
 నగరం పక్కనే అడవి. సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లే బెంచీలు. ఏపుగా పెరిగిన వెదురు చెట్లు, మనం మరెక్కడా చూడని చిన్నచిన్న కొత్త రకం మొక్కలు వంటివన్నీ కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ చిట్టడవిలో నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా నగరంలో ప్రవేశ రుసుము లేని ఓ జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. ఇందులో అంతరించిన రాకాసి బల్లులు ఇంకా బతికున్నాయా అన్న అనుమానం వచ్చేంతటి సహజంగా చెక్కిన రాకాసి బల్లుల బొమ్మలు ఆహ్వానం పలుకుతాయి. అక్కడ స్థానికంగా పేరు గాంచిన కొన్ని జంతువులను చూడొచ్చు.
 

వైగన్‌లోని కొన్ని వీధుల్లో ఖలీసా రైడ్ (గర్రపు బగ్గీ) బాగుంటుంది. గంటన్నర ప్రయాణానికి 150 పెసోలు (ఆ దేశపు కరెన్సీ అడుగుతారు. అంటే మన కరెన్సీలో 210 రూపాయిలు. వీరికి ఇంగ్లిష్ రాదు. ఇంకా వైగన్ కాథడ్రల్, బాంటే చర్చి, సిఖియా ప్రదర్శన శాల, క్రిసోలోగో మ్యూజియం, మధ్యయుగం నాటి మట్టి కుండలు తయారుచేసే కుటీర పరిశ్రమలు, మరమగ్గాల నేతపని, బర్గోస్ నేషనల్ మ్యూజియం వంటివి చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. బీచ్ కూడా చాలా దగ్గర. ఒక్కే ఒక్క డిస్కో క్లబ్ మినహా నైట్ లైఫ్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకమైన మనుషులు. మోసాలు తక్కువ. దాదాపు అన్ని దేశాల వారు తినదగిన రుచికరమైన తిండి దొరుకుతుంది.
 
 ఎలా చేరుకోవాలి
 ఈ చిన్నసిటీకి దగ్గర్లో ఒక ఎయిర్‌పోర్ట్ కూడా ఉందండోయ్. గతంలో ప్రైవేటుగా వాడేవారు కానీ.. ఇపుడు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అయ్యింది. అయితే ఇంకా వైగన్ ఎయిర్‌పోర్టుకు మాత్రం ఇపుడు ఫ్లైట్లు కావల్సినన్ని నడవడం లేదు.  ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి ట్యాక్సీలో తొమ్మిది గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా మనీలా నుంచి లావోగ్‌కు విమానంలో వెళితే అక్కడి నుంచి గంటన్నర ట్యాక్సీ ప్రయాణం. అక్కడ మీరు దిగే హోటల్స్ కూడా పురాతన భవనాలే. కానీ ఇబ్బందేమీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉంటాయి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు