సహకారంతోనే ‘మహా’ కల సాకారం

19 Feb, 2019 06:46 IST|Sakshi

సందర్భం

గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి అనుగుణంగా నగర సుందరీకరణకు, సకల వసతి సౌకర్యాల కల్పనకు బల్దియా పూనుకుంది. ఆ క్రమంలోనే అనేక ప్రణాళికలను రచించి కార్యరూపం ఇస్తూ ప్రజల భాగస్వామ్యంతో ప్రగతిని సాధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను, రివార్డులను, మన్ననలను సైతం పొందింది. అనుకూల పరిస్థితులను అభివృద్ధిపరచుకుంటూ ప్రతికూల పరిస్థితులపై విశ్లేషణ చేసుకుంటూ ప్రజల వద్ద నుంచి సమయానుకూలంగా సూచనలు, సలహాలు స్వీకరిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేసేందుకు మహానగర పాలక సంస్థ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం నగర అభివృద్ధి సూచికలను దాటుతూ మన్ననలు పొందుతుందనడంలో సందేహమే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, దార్శనికులు కేసీఆర్‌ మార్గదర్శకంలో నగర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను బల్దియా స్టాండింగ్‌ కమిటీలో చర్చించి జీహెచ్‌ఎంíసీ నిర్ణయం తీసుకుంటుంది. సమన్వయంతో, నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ... ఆ లక్ష్యాలను అధిగమిస్తూ నగరాన్ని ఉన్నతి వైపు నడిపించేందుకు జీహెచ్‌ఎంసీ పాలకమండలి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.

కోటి జనాభాకుపై గల మహానగర అభివృద్ధిలో ఒడిదుడుకులు ఉండటం సహజం. భవన నిర్మాణ వ్యర్థ పదార్థాలు రహదారులపై వేయడం, బహిరంగ మల మూత్ర విసర్జన, తడి పొడి చెత్తలౖకై ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినప్పటికీ సవ్యంగా వాటిని సద్వినియోగపరచుకోకుండా, నిర్లక్ష్యంగా, ఆలస్యంగా రోడ్లమీద పడ వేయడంపై నగరవాసుల్లో చైతన్యం తెచ్చేందుకు అనేక రకాల వినూత్న కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మరింత మార్పుకు దోహదం చేసే విధంగానే ఉల్లం ఘనలకు జరిమానాలు విధించడం జరుగుతుంది. అయితే ఇది జీహెచ్‌ఎంసీ ఆదాయాన్ని పెంచేందుకు ఎంతమాత్రం కాదు.

నగర ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా అందించాలనే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వందల కోట్లు వ్యయంతో వందలాది కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకొస్తూ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు అందిస్తున్న నీటిని సైతం వృథా చేస్తున్న తీరు మరింత బాధాకరం. హైదరాబాద్‌ నగరాన్ని గ్లోబల్‌ సిటీగా రూపొందించాలన్న యువ నాయకులు కె.టి.రామారావు ఆశయాలకు అనుగుణంగా నగర రహదారులపై ఎగుడుదిగుడులను, మ్యాన్‌హోల్‌లను, క్యాచ్‌పి ట్లను, స్లూయిట్స్‌ను అధిగమించేందుకు బల్దియా ప్రణాళిక రచించింది. ట్రాఫిక్‌ జాంలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లను అండర్పాస్‌ నిర్మాణాలను, ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్వహించడం. దుర్గం చెరువుపై ఆధునిక టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటి రోపింగ్‌ బ్రిడ్జిని ఏర్పాటుచేయడం తద్వారా ప్రజలకు మూడున్నర కిలోమీటర్ల దూరం తగ్గనుంది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థ పదార్థాల నిర్మూలనకు పని చేసే యంత్రాలను సైతం తెప్పించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, మేనేజ్‌మెంట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా అవినీతిపరుల ఆట కట్టించడంతోపాటు, నిబంధనలకు నీళ్లు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, హోటల్స్‌  భరతం పట్టించడంలో జీహెచ్‌ఎంసీ విజయాన్ని సాధించింది. రైట్‌ టు వాక్‌ అనే హక్కును అనుసరించి హైదరాబాద్‌ నగరంలో దేశంలోనే మరే నగరంలో లేని విధంగా 15 వేల ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాం. నగరంలో ప్రమాదాలు సంభవించినప్పుడు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ  నగరవాసుల మన్ననలను పొందుతోంది. మన నగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకోవాలంటే ప్రజలు, అధికారులు కలసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలి. ఇందుకు ప్రజల సహకారం కూడా తోడవ్వాలని కోరుతున్నా. 


-బొంతు రామ్మోహన్‌
వ్యాసకర్త నగర మేయర్, గ్రేటర్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు