స్వల్ప ఆదాయాలతో రైతుకు చేటు

7 Dec, 2019 00:23 IST|Sakshi

భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలనేది ప్రపంచ మార్కెట్‌ డిజైన్‌గా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అవసరాల కోసం కాకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం హైటెక్‌ టెక్నాలజీని వాడుతున్న విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. రైతుకు సబ్సిడీలు కాదు.. తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం ద్వారా రైతులే దేశానికి సబ్సిడీలు అందిస్తున్నారు. వ్యవసాయంలోకి కార్పొరేషన్లు ప్రవేశించే కొద్ది చిన్న కమతాలు తప్పుకుంటున్నాయి. వాటిలో వచ్చే స్వల్ప ఆదాయాలు రైతుకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

న్యాయవాదిగా కూడా పనిచేస్తున్న ఒక న్యూయార్క్‌ రైతు కొన్ని రోజుల క్రితం ట్వీట్‌ చేశారు : నేను ఈరోజు న్యాయవాద కార్యాలయంలో పనిచేయడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నేను చూస్తున్న పాడిపరిశ్రమ రైతుల జీవితాల్లో విధ్వంసం చుట్టూ తిరిగింది. చాలా కాలం నుండి మా ప్రాంతంలో రైతులు తమ వద్ద ఉన్న కొన్ని భూములను అమ్మివేసి మిగిలిన భూములను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? నాకు తెలీదు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన వ్యవసాయ ఉత్పాదక వ్యవస్థ ఉన్న అమెరికాలోనే వ్యవసాయ సంక్షోభం ఈ స్థితిలో అలుముకుంటున్నప్పుడు మనం కూడా ఒకసారి ఆగి మళ్లీ ఆలోచించాల్సి ఉంది.

ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఒక్కటే. అమెరికా వ్యవసాయ విధానం ఉద్దేశపూర్వకంగా వ్యవసాయరంగాన్ని క్షీణింపచేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉందా? ఈ అర్థంలో భారతీయ వ్యవసాయం కూడా ఆ దశలోనే ప్రయాణిస్తోందా? భారతదేశంలో భూకమతాలు చిన్నవి కాబట్టి ఆర్థికంగా లాభసాటి కావు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ సగటు వ్యవసాయ పొలం పరిమాణం 444 ఎకరాలుగా ఉంటున్న అమెరికాలో కూడా  చిన్న కుటుంబ పొలాలు వైదొలగాల్సిందేనా?

సగటు వ్యవసాయ భూమి పరిమాణం కనీసం 4,331 హెక్టార్లుగా ఉంటున్న ఆస్ట్రేలియాలోనూ వ్యవసాయం నష్టదాయకంగానే ఉండాల్సిందేనా? ఈ దేశాల్లో సాగుతున్న వ్యవసాయ పరిమాణాన్ని చూస్తే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వ్యవసాయం నుంచి వైదొలగడానికి సమర్థమైన కారణం లేదు. చిన్న కమతాలు లాభదాయకం కాదు అనుకున్నట్లయితే, భారీ కమతాలు కూడా ఆర్థికంగా లాభదాయకం ఎలా కాకుండా పోతాయి? భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు నిజ ఆదాయాలను తోసిపుచ్చి వ్యవసాయ ఆదాయానికి వారిని దూరం చేస్తున్నారన్న వాస్తవాన్ని అంగీకరించడానికి మన విధాన నిర్ణేతలు తిరస్కరించకపోతే పరిస్థితులు ఇలా ఉండేవి కావు.

మొట్టమొదటగా, మనం ఒక విషయం పట్ల స్పష్టంగా ఉందాం. అమెరికాలో ఎప్పట్నుంచో సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దూరం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా వ్యవసాయం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అమెరికన్‌ వ్యవసాయ మంత్రి సోన్నీ పెరూడ్య ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా ఒక ప్రకటన చేశారు. ‘అమెరికాలో, పెద్దది మరింత పెద్దది అవుతుంది అలాగే చిన్నది అడ్రస్‌ లేకుండా పోతుంది’. అమెరికాలో నాటి అధ్యక్షులు రిచర్డ్‌ నిక్సన్, గెరాల్డ్‌ ఫోర్డ్‌ హయాంలో పనిచేసిన మాజీ అమెరికా వ్యవసాయ మంత్రి ఎర్ల్‌ బట్జ్‌ సుప్రసిద్ధ వ్యాఖ్య చేశారు.

‘మరింత ఎదగండి లేదా వెళ్లిపోండి.’ దీనితర్వాత అత్యంత జాగ్రత్తతో ‘ప్రపంచానికి తిండి పెట్టడం’ అనే పేరిట సిద్ధం చేసిన ముసాయిదాలో ‘భారీ స్థాయిలో మిగులు ఉత్పత్తి చేయండి’ అని రైతులకు పిలుపునిచ్చారు. అదనపు ఉత్పత్తి అంటే వాస్తవానికి ధరలు పడిపోవడమనే అర్థం. ఇలాంటి దూకుడు చర్య అమెరికా సన్నకారు రైతులను ఇక్కట్లలోకి నెట్టింది. ప్రభుత్వ విధానాల కారణంగానే చాలామంది వ్యవసాయ వాణిజ్యం నుంచి పక్కకు తప్పుకోవడమే కాకుండా వ్యవసాయరంగం నుంచి తీవ్ర నిరాశతో వైదొలిగారు.

మరింత భారీగా పెరగండి అనే విధానం వ్యవసాయంపై కార్పొరేట్‌ నియంత్రణ పెరిగేందుకు ఆహ్వానం మాత్రమే. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని కూడా అనుసరించాలంటూ రాసిన అలిఖిత విధానంగా కూడా మారింది. అది ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కావచ్చు లేక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) కావచ్చు ప్రపంచ వాణిజ్య విధానాలన్నీ బడా వ్యవసాయ దిగ్గజ సంస్థలు వ్యవసాయరంగంలోకి ప్రవేశించే వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. పోటీ అనేది మార్కెట్‌ మంత్రంగా మారినందున, అభివృద్ధి చెందుతున్న, వెనుకబడి ఉన్న దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలని నిర్బంధిస్తున్నారు. దీనివల్ల లక్షలాది సన్నకారు రైతులు వ్యవసాయం నుంచి నిష్క్రమిస్తున్నారు. 

దీన్ని ఇంకాస్త విపులంగా చూద్దాం. చైనాలో అతి పెద్ద పాడిపరిశ్రమ విస్తీర్ణం 2 కోట్ల 25 లక్షల ఎకరాలు. ఇది పోర్చుగల్‌ విస్తీర్ణంతో సమానం. వరల్డ్‌అట్లాస్‌.కామ్‌ ప్రకారం ఈ వ్యవసాయ క్షేత్రంలో లక్ష ఆవులు ఉన్నాయి. ఇక రెండో అతిపెద్ద పాడి పరిశ్రమ కోటీ 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది కూడా చైనాలోనే ఉంది. ప్రపంచంలోని పది అతిపెద్ద పాడి పరిశ్రమ సంస్థల్లో ఎనిమిది సంస్థలు ఆస్ట్రేలియాలో ఉంటున్నాయి. రీజనల్‌ దిగ్గజ సంస్థ అయిన ఆర్‌సీఈపీ ద్వారా చైనా తదితర దేశాలు భారత్‌లోకి దూరాలని తీవ్రంగా ప్రయత్నించాయంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. సరైన సమయంలో భారతదేశం ఆర్‌సీఈపీలో చేరకూడదని నిర్ణయించుకోవడం ముదావహం. మన దేశంలో పాడిపరిశ్రమలో కోటి మంది ప్రజలు భాగం పంచుకుంటున్నారన్నది తెలిస్తే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనాల నుంచి తక్కువ ధరకు లభించే పాల ఉత్పత్తులు భారత్‌లోని కోటిమంది జీవితాలను ధ్వంసం చేసిపడేసేదని అర్థమవుతుంది.

వ్యవసాయం కేసి చూస్తే గ్రామీణ భారత్‌లాగే గ్రామీణ అమెరికా కూడా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్‌కు లాగే అమెరికాలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలోని రైతు కుటుంబాల సగటు ఆదాయం సంవత్సరానికి 20 వేల రూపాయంగా మాత్రమే ఉంటోంది. అంటే అమెరికా వ్యవసాయం కూడా ఏమంత మంచిగా సాగటం లేదు. అమెరికాలో సగం పైగా రాష్ట్రాల రైతుల ఆదాయం ప్రతికూల గమనంతో ఉంది. అమెరికన్‌ ఫామ్‌ బ్యూరో ఫెడరేషన్‌ ప్రకారం 91 శాతం రైతులు, వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు.

ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతోపాటు అక్కడి వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా రైతులు వ్యవసాయాన్నే వదిలేయాల్సి వస్తుందని భయపడుతున్నారు. 2019లో అమెరికా వ్యవసాయ రుణం 416 బిలి యన్‌ డాలర్లకు పెరగనుందని అంచనా. ఇది 1980ల నుంచి చూస్తే అత్యధిక మొత్తంగా చెప్పాలి. అనేక దశాబ్దాలుగా మన దేశంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు స్తంభించిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ ధరలు కిలో వంద రూపాయలకు పెరిగితేనే అల్లాడిపోతున్నాం. కానీ గత 30 సంవత్సరాలుగా అమెరికాలో రైతులు పండిం చిన పంటల ధరలు ఏమాత్రం పెరగలేదు. ఇక 5 దశాబ్దాలుగా మొక్క జొన్న ధరలు అలాగే ఉంటున్నాయి.

వ్యవసాయరంగంలో అత్యున్నత సాంకేతిక జ్ఞానాన్ని వినియోగిస్తూ, తక్కిన ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడుతున్న దేశంలోనే వ్యవసాయ సంక్షోభం ఇంత తీవ్రస్థాయిలో ఉందంటే, భారతీయ వ్యవసాయరంగంలో అత్యధునాతన (తరచుగా అవాంఛిత) టెక్నాలజీని మరింతగా వాడాలని చేస్తున్న సూచనలు, సలహాలు అసందర్భపూరితమనే చెప్పాలి. టెక్నాలజీకి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ దాన్ని మరొకరి వాణిజ్య ప్రయోజనాల కోసం కాకుండా అవసరాలపై ఆధారపడి టెక్నాలజీని వినియోగించాలి.

వ్యవసాయంలో పూర్తిగా హైటెక్‌ పద్ధతులను అవలంబిస్తున్న దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యల కంటే 45 శాతం ఎక్కువగా ఉంటున్నాయంటే, భారతీయ వ్యవసాయాన్ని మనం పూర్తిగా పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. చిన్న కమతాలను వృద్ధి చేయడం ద్వారానే గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్లడాన్ని తగ్గించగలమా? దేశీయ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సరికొత్త వ్యూహాన్ని వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అవలంబించడం ద్వారానే మన వ్యవసాయాన్ని పర్యావరణ స్వావలంబన, ఆర్థిక లాభదాయకత వైపు తీసుకుపోవచ్చు.

భారతీయ రైతులు గత రెండు దశాబ్దాలుగా అంటే 2000–01 నుంచి 2016–17 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 14 శాతం నష్టాలను చవిచూస్తున్నారు. ఇది వినియోగదారులకు తాము చెల్లించాల్సిన దానికంటే 25 శాతం తక్కువ ధరలతో మేలు కలిగిస్తోంది. మరోమాటలో చెప్పాలంటే ఇన్నేళ్లుగా వ్యవసాయదారులు దేశానికే సబ్సిడీని అందిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్న ప్రపంచ ఆర్థిక డిజైన్‌ ప్రపంచ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలను పెంచుతోంది.

జర్మనీ, హాలండ్, కెనడా, అమెరికా, భారతదేశంలోని వీధుల్లో రైతుల నిరసనలకు దిగుతున్నారు. ఆస్ట్రేలియా జాతీయ రైతుల సమాఖ్య అధ్యక్షుడు మెక్‌లాక్లాన్‌ కొన్నాళ్ల క్రితం ఒక రైతుల ర్యాలీలో చెప్పిన మాట ప్రపంచ వ్యాప్తంగా రైతు ఆగ్రహానికి కారణాన్ని స్పష్టం చేస్తోంది. అదేమిటంటే...‘‘తక్కిన ఆస్ట్రేలియా మొత్తానికి సబ్సిడీని అందించే పనిలో మేం అలసిపోయాం, రోగగ్రస్తులమైపోయాం’’.

వ్యాసకర్త
దేవీందర్‌ శర్మ,
వ్యవసాయ నిపుణులు,
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com.

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా