హద్దుమీరిన ప్రభుభక్తి

12 Sep, 2018 02:05 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

సంపాదకుడితో రాజీనామా చేయిస్తే తప్ప వ్యాపార ప్రకటనలు ఇవ్వకుండా ఓ పత్రికను చంపేసే పరిస్థితి, తమకు అనుకూలంగా మాట్లాడడం లేదని ఓ పాత్రికేయుడి టాక్‌ షో ఆపించేసి ఆయనను రోడ్డు మీదకు నెట్టడానికి చేసిన ప్రయత్నం మనం ఇవ్వాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. తెలంగాణాలో అధికార పక్షానికి ఉన్న సొంత మీడియా (తెలుగు, ఇంగ్లిష్‌లో రెండు దినపత్రికలూ, ఒక తెలుగు న్యూస్‌ ఛానల్‌)ను మించిపోయి ఈ బాపతు మీడియా సంస్థలు ప్రభుభక్తిని చాటుకోవడాన్ని మించిన విషాదం ప్రజాస్వామ్యానికి ఇంకోటి ఉండబోదు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పరిస్థితి ప్రభువును మించిన విధేయత అనే మాటలకు అద్దం పడుతోంది.

ఇంకా  తొమ్మిది మాసాలు అధికారంలో కొనసాగే  అవకాశం ఉన్నా సరే తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు శాసనసభను రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయించి ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రక టించి 24 గంటలు తిరక్కుండానే ఎన్నికల ప్రచార భేరి మోగించిన కేసీఆర్‌ను చూసి మీడియా మురిసి ముక్కలయింది. యువహీరో మహేష్‌బాబు సినిమా పేర్లన్నీ పెట్టి కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచేసింది. దూకుడు, ఒక్కడు, ఆగడు, ఖలేజా ఎన్నెన్ని పేర్ల తోనో ఆయన సాహసాన్ని పత్రికల పేజీల్లో పరిచేసి, చానళ్ల స్క్రీన్ల మీద పులిమేసి ప్రభుభక్తిని చాటుకోని పత్రికలను వేళ్ల మీద కూడా లెక్కపెట్టలేము .

ఈ నెల ఆరున కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అయిదు నిమిషాల్లో ఆ తంతు ముగించేసి హుటాహు టిన రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌ గారికి సమాచారం అందించి మీడియాతో మాట్లాడటానికి తెలంగాణా భవన్‌ చేరుకున్నారు. ఈ లోగానే రాజ్‌భవన్‌ నుంచి దాన్ని ఆమోదించినట్టు, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగమన్నట్టూ అధికార ప్రకటన వెలువడింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే ఇదేదో అందరూ ముందుగానే అనుకుని చేసినట్టుగా కని పించి రాజ్యాంగ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచేసింది. తెలంగాణా భవన్‌లో విలేఖరులు అడి గిన ఒక్క ప్రశ్నకు కూడా కేసీఆర్‌ సమాధానం చెప్ప కుండా కసురుకుని, హేళన చేసి, ఇవేం ప్రశ్నలయ్యా అని కోప్పడ్దారు. చివరికి ఆయన తన ప్రసంగంలో, ‘‘మీకు తెలియకుండా నేను ఈ విషయంలో చాలా కసరత్తు చేశాను. మీరు తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నిటినీ అడ్డు కొట్టాను’’ అని విజయ దరహాసం ఒకటి విసిరి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌తో, ఎన్నికల కమిషనర్లతో తాను ముందే మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానని తేల్చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో రాజ్‌భవన్‌, కేంద్ర ఎన్నికల సంఘం మీదా అనుమానాలు రావడంలో తప్పేముంది? అసలు ఇంతకీ కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందే ఎన్ని కలకు ఎందుకు పోతున్నట్టు?  ఆయన చెపుతున్నట్టు రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతూంటే ఇప్పుడే ఎందుకు ఎన్నికలకు వెళ్ళడం? అసెంబ్లీ రద్దుకు ఆయన చెపుతున్న కారణం ఏమంటే ప్రతి పక్షాల గోల ఎక్కువ అయిందని. భాష వేరుగా ఉన్నా భావం ఇదే. తాను చేయించిన 15, 16 సర్వేలు కూడా నూటికి తక్కువ కాకుండా స్థానాల్లో గెలుపు ఖాయమని చెప్పినట్టు ప్రకటించారు. అంత ధీమా ఉంటే అసెంబ్లీ రద్దయిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌ రెడ్డి ఇంటికి పరుగెత్తి ఆయనను పార్టీలోకి ఎందుకు తెచ్చుకున్నట్టు? నాలుగుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికయి, అయిదేళ్లు స్పీకర్‌ పదవి అనుభవించిన సురేష్‌రెడ్డికి గత నాలుగేళ్లుగా కనిపించని అభివృద్ధి హఠాత్తుగా ఇప్పుడు గుర్తుకొచ్చిందా?

పాలకపక్షాలకు మీడియా సానుకూలం!
ఒకే రోజు 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చడం, అదీ సిట్టింగ్‌లందరికీ (ఆరుగురికి మినహా ) టికెట్‌లు ఇవ్వడం వెనక ఉన్న మతలబు ఏంటి? వీరిలో కనీసం 30 నుంచి 40 మంది పని తీరు ఏమాత్రం బాగా లేదన్న విషయం ఆయనకు బాగా తెలిసినా ఎందుకు వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు? టికెట్‌ రాని వారు గోడ దూకకుండా ఈ పథకం రచించారా? ప్రతిపక్షాలు సర్దుబాట్లు చేసుకుని అభ్య ర్థులను ప్రకటించాక కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చేస్తారా? అప్పుడు వారు పక్క పార్టీలోకి దూకినా ఫలితం ఉండదు కాబట్టి పడి ఉంటారను కుంటున్నారా? ఏ పరిస్థితి ఎదురైనా అదుపు చెయ్యగలనన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా ఆయన ఓ రాజకీయ జూద క్రీడకు తెర లేపారని పిస్తోంది. అభ్యర్థులతో సంబంధం లేకుండా తనను చూసి తెలంగాణా ప్రజలు ఓట్లేస్తారన్న అతి నమ్మకం కూడా దీనికి కారణం కావచ్చేమో.

అయితే ప్రభువును ప్రసన్నం చేసుకోడంలో తరించిపోతున్న మీడియాకు మాత్రం ఇవన్నీ ప్రశ్నలుగా అనిపించలేదు. తెలంగాణాలో జరుగుతున్న ఈ తంతు అంతా చూస్తుంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా దూసుకుపోతున్న ఒక వీడియో ఇంటర్వ్యూ గుర్తొస్తుంది. ప్రసిద్ధ పాత్రికేయుడు పరంజయ్‌ గుహ ఠాకుర్తా, మరో ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్‌ను ఓ యూ ట్యూబ్‌ చానల్‌ కోసం న్యూస్‌ క్లిక్‌ అనే కార్య క్రమంలో చేసిన ఇంటర్వ్యూ అది. అధికారంలో ఉన్న వారు తనను ఏ మీడియా సంస్థలోకీ అడుగు పెట్టకుండా ఎలా అడ్డుకుంటున్నదీ, తాను స్వయంగా ప్రారంభించాలనుకుంటున్న మీడియా ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ఎట్లా ఆపుతున్నదీ చెపుతూ, ‘దేశంలో జర్నలిజంపై రాజకీయాల అదుపు  పెరిగిపోతోంది,’ అని బర్ఖా అన్నారు.

పరంజయ్, బర్ఖా ఇద్దరూ కూడా బడా వ్యాపారవర్గాలూ, అధికార పక్షాల బాధితులే. దేశమంతటా పరిస్థితి ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోడానికి అన్ని అస్త్రాలనూ ప్రయోగించాయి. ఒకటి రెండు మిన హాయింపులు తప్ప తెలుగు రాష్ట్రాల మీడియా మొత్తం సర్కారీ గజెట్‌గా మారిపోయిందనడంలో సందేహం లేదు. 2014లో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే మీడియాను పది కిలోమీటర్ల లోతున బొంద పెడతానన్న నాటి నుంచీ మొన్న ఆయన అసెంబ్లీని రద్దు చేసే వరకూ మీడియా వ్యవహరించిన తీరు చూస్తే  మీడియా ఆయన నియంత్రణలోకి వెళ్లిపోయిందని అర్థమౌతుంది. వాస్తవాలకు రంగుల పరదాలు కప్పి మీడియా ప్రజలను ఎలా మోసం చేస్తోందో మొన్నటికి మొన్న ఓ మీడియా సంస్థ అధిపతి రాసిన సంపాదకీయ వ్యాసం మచ్చు తునక. ఈయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభువులకు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు కేసీఆర్‌ పది కిలోమీటర్ల లోతున బొంద పెడతానన్న రెండు న్యూస్‌ చానళ్లలో ఈ పెద్ద మనిషి నడుపుతున్న చానల్‌ కూడా ఉంది.

కొన్ని మాసాల పాటు ఆ చానల్‌ ప్రసారాలను ఎంఎస్‌ఓలను బెదిరించి ఆపి వేయించడం కూడా అందరికీ తెలుసు. ఉమ్మడి ఏపీలో ముఖ్యంగా  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎవరయినా నాలుగు మంచి మాటలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడితే చాలు ఆయన తన రాతల్లో విరుచుకు పడేవాడు. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలన్నా నచ్చేది కాదు. ఆ మాట అనే వాళ్లను అప్రతిష్ట పాల్జేసే పిచ్చి రాతలు రాసి మీడియా కచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించ వలసిందేనని సుద్దులు చెప్పేవాడు. ఇప్పుడా యజమాని రెండు రాష్ట్రాల్లో పాలకుల పల్లకీ మోస్తున్న రాతలే రాస్తున్నాడు.

బొంద పెడతానన్న దగ్గరి నుంచి ట్విన్‌ టవర్లు కట్టుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని పుట్నాలు, పేలాల ధరకు కట్టబెట్టడం వరకూ మారిన పరిణామాలే ఈ రాతలకు కార ణమనే ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రతిపక్షాల పొత్తులూ, అభ్యర్థులూ ఒక కొలిక్కి రాక ముందే తెలంగాణాలో అధికారపక్షం 80 సీట్లు గెలవబోతున్నదని తన కాలమ్‌లో జోస్యం చెప్పేశాడా ఆ పత్రికా యజమాని. టీఆర్‌ఎస్‌ నాయకులే కచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప లేని సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యం జోతిష్యం మీద ఆధారపడి నడుస్తున్నట్టు కనిపిస్తోంది.

జ్యోతిష్యుల సలహాతోనే...
జ్యోతిష్యుల సలహా మేరకే కేసీఆర్‌ గడువు కన్నా ముందే ఎన్నికలకు వెళుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్య మంత్రి ఆగ్రహానికి గురయి పది కిలోమీటర్ల లోతు బొంద బెదిరింపును ఎదుర్కొన్న మరో 24 గంటల న్యూస్‌ చానల్‌ తరువాత కాలంలో తన అధీనంలోనే ఉన్న మరో చానల్‌ నిర్వహణను ప్రభుత్వ కోటరీకి అప్పజేప్పేయాల్సిన పరిస్థితి తప్పలేదు. ఇప్పుడా చానల్‌ నిర్వాహకుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరితో భర్తీ చెయ్యాలన్న ఆదేశాల కోసం ప్రగతి భవన్‌ వైపు కన్నార్పకుండా చూస్తున్నారట.

సంపాదకుడితో రాజీనామా చేయిస్తే తప్ప వ్యాపార ప్రకటనలు ఇవ్వకుండా ఓ పత్రికను చంపేసే పరిస్థితి, తమకు అనుకూలంగా మాట్లాడటం లేదని ఓ పాత్రికేయుడి టాక్‌ షో ఆపించేసి ఆయనను రోడ్డు మీదకు నెట్టడానికి చేసిన ప్రయత్నం మనం ఇవ్వాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. ఆ సంపాదకుడు, ఆ పాత్రికేయుడు బయటికి వెళ్లిపోయాక సదరు దినపత్రిక, ఆ న్యూస్‌ చానల్‌ ప్రభువుల ఆదే శాలను తూచా తప్పకుండా పాటించి సుఖంగా బతికేస్తున్నాయి. తెలంగాణాలో అధికార పక్షానికి ఉన్న సొంత మీడియా (తెలుగు, ఇంగ్లిష్‌లో రెండు దినపత్రికలూ, ఒక తెలుగు న్యూస్‌ చానల్‌)ను మించి పోయి ఈ బాపతు మీడియా సంస్థలు ప్రభు భక్తిని చాటుకోవడాన్ని మించిన విషాదం ప్రజాస్వామ్యానికి ఇంకోటి ఉండబోదు.

మరో తెలుగు రాష్ట్రం ఏపీలో మీడియా పరిస్థితి ప్రభువును మించిన విధేయత అనే మాటలకు అద్దంపడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల సమస్యలు, ప్రతిపక్షాల ఆందోళన అక్కడి మీడియాకు కనిపించదు. వినిపించదు. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మీడియా మీద పెరిగిపోతున్న అధికార రాజకీయాల అదుపు ప్రజాస్వామ్యానికి చేటు అనడంలో సందేహం అక్కర లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రాపకం కోసం వెంపర్లాడే మీడియా పెద్దలు తమ విశ్వసనీయత పది కిలోమీటర్ల లోతుకు దిగజారిపోతోందని గుర్తిస్తే మంచిది. ఒక్కటి మాత్రం నిజం. మీడియా ఏం రాసుకున్నా, ఏం చూపించినా ప్రజలు వాటితో ప్రభావితం అయి ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే. అందుకు 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు బ్రహ్మాండమైన ఉదాహరణ.


- దేవులపల్లి అమర్‌

datelinehyderabad@gmail.com

>
మరిన్ని వార్తలు