రాజ్యాంగమే కరదీపిక!

26 Jan, 2020 00:18 IST|Sakshi

సందర్భం

గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి డెబ్భైయ్యేళ్లు పూర్తయిన వేళ దేశం మొత్తం ఒక రకమైన సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నది. వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సిన మతం ప్రభుత్వ విశ్వా సంగా మారినప్పుడు, ఆ క్రమంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కూడా సిద్ధపడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. ఈ ధోరణులను వ్యతిరేకించేవారు రాజ్యాంగంలోని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతుంటే అది పాలకులకు మింగుడు పడటం లేదు. కేంద్ర పాలకులకు మన దేశం పౌరాణికంగా అర్థమవుతోంది తప్ప భౌగోళికంగా, సామాజికంగా అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులు నెత్తుటి తిలకాలు దిద్దుకోవటానికి వెనకాడటం లేదు. ఈ దేశంలో మొదటినుంచీ వున్న పరమత సహనాన్ని తుంచేం దుకు వారు ప్రయత్నిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)లను అమలు చేయొద్దంటూ దేశ వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి హిందువులు, సిక్కులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులకు అవ కాశం ఇస్తూ, కేవలం ముస్లింలకు మాత్రం అనుమతి నిరా కరించడం వివక్ష కాదా? వారిపై వివక్ష ప్రదర్శించడం మన దేశ సంస్కృతి కాదు, మన రాజ్యాంగానికి అనుగుణమైనది కాదు. ముస్లింలు ఈ దేశ సంస్కృతిని, సాంకేతిక రంగాన్ని ఉన్నతీ కరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. వారు తీసుకొచ్చిన వాస్తు శాస్త్రం ఆధారంగా రూపొందిన అనేక చారిత్రక కట్టడాలు మన దేశానికి వన్నె తెస్తున్నాయి. ఆటోమొబైల్‌ రంగాన్ని కూడా వారు ఎంతో ప్రభావితం చేశారు. ముస్లింలు పరాయివారు కాదు. వారు ఈ దేశ చరిత్రలో భాగం. దేశ స్వాతంత్య్రో ద్యమంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ దేశ విముక్తికి తమ ప్రాణాలు అర్పించారు. 130 కోట్ల దేశ జనాభాలో ముస్లింల జనాభా 20 కోట్లు. ఈ దేశ జనాభా మొత్తం తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడుగుతోంది.

అందుకవసరమైన పత్రాలు చూపని వారిని ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధిస్తామంటున్నారు. ఈ దేశంలో నిరక్షరాస్యులు 60 శాతం ఉన్నారు. ముస్లింలతోపాటు దళి తులు, ఆదివాసీలు, బహుజనులు ఈ నిరక్షరాస్యుల్లో అధికం. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వివరాలివ్వలేకపోతే నేరంగా పరిగణించే టట్టయితే ఈ వర్గాలవారంతా ఇబ్బందుల్లో పడతారు. అసలు అక్షరాలు, అంకెలు రాని ప్రజలను తల్లిదండ్రుల బర్త్‌ సర్టిఫికెట్లు కావాలని, మీకు సంబంధించిన సర్టిఫికెట్లు కావాలని ఒత్తిడి తెస్తే వారేం చెప్పగలుగుతారు? చూపగలుగు తారు? ఈ దుర్మార్గమైన చర్యను అడ్డుకోవాల్సిన అవసరం లేదా? ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ఉండే బోర్డులపై ఉర్దూ బదులు సంస్కృత భాషలో రాస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పాటించడం మొదలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. రైల్వే స్టేషన్లలో సైన్‌ బోర్డులను ఆయా రాష్ట్రాల ద్వితీయ భాషలో రాయాలనే నిబంధన ప్రకారం ఉత్తరాఖండ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

దీన్నిబట్టి చూస్తుంటే సంస్కృతీకరణ ద్వారా వారు దేశాన్ని విభజించాలని చూస్తున్నట్టు అర్థమవు తుంది. దేశంలోని అన్ని సామాజిక శ్రేణులు, ముస్లింలు రాజ్యాంగ పీఠికే శిరోధార్యమని నమ్ముతున్నారు. ఇది గొప్ప పరిణామం. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశ దేశాల రాజ్యాంగాలనూ అధ్యయనం చేసి మన దేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించి దానిద్వారా పటిష్టమైన లౌకికవాద సౌధాన్ని నిర్మించారు. ఈ రాజ్యాంగం అసమగ్రమైనది, పెటీ బూర్జు వాలది అని ఒకప్పుడు ప్రచారం చేసిన వామపక్షాలు ఈరోజు దాన్ని సమున్నతమైనదని గుర్తించడం శుభ పరిణామం. ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ దేశం మా సొంతమని కుల, మతా లకు అతీతంగా అన్ని వర్గాలవారూ గొంతెత్తుతున్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబూనుతున్నారు. దాన్ని కరదీపికగా భావిస్తున్నారు. ఇది మరో స్వాతంత్య్ర పోరాటం. ఇందులో అంతిమ విజేతలు ప్రజలే. 

డాక్టర్‌ కత్తిపద్మారావు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు
మొబైల్‌ : 98497 41695

మరిన్ని వార్తలు