సినిమా ఇలా చూపించారా?

16 Mar, 2018 01:03 IST|Sakshi

విశ్లేషణ
తిలక్‌పై సినిమా సాకుతో రెండున్నర కోట్లను మాయం చేయడమే కాదు. వందకోట్ల బడ్జెట్‌తో సంబరాలు చేసుకున్న కమిటీ.. సంబంధిత కాగితాలనూ నిర్వహించకపోవడం, కోట్లాది ప్రజాధనం మాయమైనా పట్టించుకోకపోవడమే అసలు సమస్య.

బాలగంగాధర్‌ తిలక్‌ పేరుమీద సినిమా తీస్తానని కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుని పాత సీరియల్‌ ముక్కలను సినిమాగా ఇచ్చి ప్రజాధనం కాజేసిన విషయం వి.ఆర్‌. కమలాపుర్కర్‌ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా  వెల్లడైంది. 2001లో భారత గణతంత్ర 50వ వార్షికోత్సవం, బాలగంగాధర్‌ తిలక్‌ శతాబ్ది సంబరాలు నిర్వహించడానికి ఒక ఉత్సవ విభాగాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. తిలక్‌ కథతో ఒక సినిమా తీయాలని ఈ ఉత్సవ విభాగం నిర్ణయించింది. ఈ విభాగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారు, ఏ కార్యక్రమాలు నిర్వహించారు, సినిమా సంగతేమయింది, అందుకు ఎంత ఖర్చు చేశారు? అని కమలాపుర్కర్‌ ఆర్టీఐ కింద అడిగారు. 

మంత్రిత్వ శాఖలో ఆ ఉత్సవ విభాగానికి సంబంధించిన దస్తావేజులు ఏవీ లేవని, వాటికోసం వెతుకుతున్నామని జవాబిచ్చారు. వినయ్‌ ధుమాలేకు తిలక్‌ సినిమా నిర్మాణం కోసం రెండు వాయిదాలలో 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆర్టీఐ దాఖలైన తరువాతనే ధనం మాయమైన విషయం తెలిసిందని సీపీఐఓ డిప్యూటీ సెక్రటరీ వివరించారు. కనీసం ఏమైందని అడగలేదని, సినిమా వచ్చిందా లేదా అని కూడా అధికారులు విచారించలేదని తేలింది. ఒక్క కాగితం కూడా తమ కార్యాలయంలో లేదని ఆమె చెప్పారు. 

ఈ ఉత్సవాల విభాగంలో అంతా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే ఉండడం, గణతంత్ర ఉత్సవాలు ముగిసిన వెంటనే విభాగం మూతపడడంతో వారు కూడా వెళ్లిపోయారనీ, వారెవరో ఎక్కడున్నారో ఎంత డబ్బు తీసుకున్నారో కూడా తమకు తెలియదని, ఆ వివరాలున్న ఫైళ్లు కూడా లేవని, అవి ఎక్కడికిపోయాయో తెలియదని అధికారులు తెలిపారు. దస్తావేజు లేవీ లేకపోవడం తీవ్రమైన లోపమని కమిషన్‌ భావించి రికార్డుల మాయంపైన దర్యాప్తు జరిపించాలని, రెండునెల్లలో నివేదికను సమర్పించాలని సూచించింది. 

తనకు సీబీఐ చార్జిషీటు కాపీ ఇవ్వలేదని కమలాపు ర్కర్, మంత్రిత్వ శాఖ కూడా చెప్పారు. సీబీఐ ప్రతినిధి, డీఎస్‌íపీ కేఎస్‌ పథానియా తిలక్‌ సినిమా పేరుతో 2.5 కోట్ల రూపాయల స్వాహా జరిగినట్లు పరిశోధనలో తేలిం దని, పాటియాలా హౌజ్‌ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేసామని వివరించారు. ఎంత వెతికినా తిలక్‌ సినిమాఫైల్‌ మాత్రం దొరకలేదని, ఫైల్‌ మాయం కావడానికి తాము కారణం కాదని, తమకు ఆ ఫైలును అప్పగించినవారెవరూ లేరని కనుక తాము దానికి బాధ్యులము కాబోమని వివరించారు. గణతంత్ర 50వ వార్షికోత్సవాలకోసమే ఏర్పడిన విభాగం ఆ ఉత్సవాలు పూర్తికాగానే అంతరించిందని. ఆ విభాగం సాక్ష్యాలేమీ లేవని చెప్పారు. 

దూరదర్శన్‌ కోసం ఇదివరకు రూపొందించిన తిలక్‌ సీరి యల్‌ లోని 7 భాగాలలో కొన్ని దృశ్యాలను ఇష్టం వచ్చినట్టు అతికించి దాన్నే కొత్త సినిమాగా  సమర్పించారని తేలింది. అయితే పన్నెండేళ్లుగా ఈ ఫైలు కోసం, మాయమైన డబ్బుకోసం పరిశోధన చేయకపోవడం అన్యాయం. కమలాపుర్కర్‌ తన దగ్గర ఉన్న పత్రాలన్నీ ఇచ్చి ఫైళ్లు వెతకడానికి, నేరస్తులను పట్టుకోవడానికి సహకరించాలని కమిషన్‌ ఆదేశించింది. ఫైల్‌ దొరకడం లేదనే నెపంతో పూర్తి సమాచారం ఇవ్వకపోవడం తప్పు అనీ అందుకు గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలను తెలియజేయాలని సీపీఐఓకు నోటీసు ఇచ్చింది.  
సీపీఐఓ అందుకు వివరంగా జవాబిచ్చారు. ఫైలు దొరకకపోయినా దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని సేకరించి ఇచ్చిందని వివరించారు. ప్రజల సొమ్ము కాజేసిన వారిని కాపాడే దురుద్దేశం ఇక్కడ ఎవరికీ లేదని, కమలాపుర్కర్‌తో సమన్వయం చేసి సమాచారం మొత్తం సేకరించామన్నారు. 

విజ్ఞాన్‌ భవన్‌ అనుబంధ భవనంలో, మంత్రిత్వ శాఖ రికార్డు గదుల్లో, జాతీయ పురావస్తు గ్రంథాలయంలో ప్రతి దస్తావేజును వెతికించామని, 15.1.2018నాడు సర్చ్‌ మెమొరాండంను విడుదల చేసి అన్ని విభాగాలకు పంపించామని, గత సంవత్సరమే ఫైళ్లుపోయాయని పోలీసు ఫిర్యాదు కూడా చేశామని, సీబీఐ పరిశోధనకు అవసరమైన ఫైళ్లు సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు. 2015లో కేంద్ర విజి లెన్స్‌ కమిషన్‌ ఆదేశానుసారం ఈ ఫైళ్లన్నీ చిట్టచివరిసారి ఎవరి అధీనంలో ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం కూడా ఆరంభించామని వివరించారు. తాను కేవలం 8 నెలల కిందటే సీపీఐఓగా బాధ్యతలు స్వీకరించానని, కనుక తనకు ఈ సినిమా మోసం రికార్డులతో సంబంధమే లేదని తనపైన జరిమానా విధించడం భావ్యం కాదని విన్నవించారు. 

కమలాçపుర్కర్‌ 13.12.2012 నుంచి అనేక మార్లు ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించారు. అనేకానేక అంశాల ద్వారా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం అడిగారు. ఫైళ్ల అదృశ్యం వల్ల ఆ సమాచారం ఇవ్వలేకపోయారు. కాని ఆయనే మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తిలక్‌ సినిమాకోసం 2.5 కోట్ల రూపాయల మంజూరీ (విడుదల) పత్రం ప్రతిని ఇచ్చారు. ప్రసారభారతి 7 తిలక్‌ ఎపిసోడ్ల నిర్మాణ పత్రాలను కూడా ఆయనే ఇచ్చారు. 

ధుమాలే పైన చార్జిషీటు దాఖలుచేసినా, అతనికి ఏ ఆధారమూ లేకుండా కోట్ల రూపాయలు సమర్పించిన అధికారులెవరు? ఫైళ్లుమాయం చేసిన వారెవరు? ధుమాలే సమర్పించిన సినిమా సీడీ దూరదర్శన్‌ వారి ఏడు ఎపిసోడ్ల కత్తిరింపులు అతికింపులా కాదా అని చూసిన వారే లేరా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు. పూర్తి సమాచారం ఇచ్చారనీ, కావలసిన చర్యలు తీసుకున్నారని ప్రశంసించి, అప్పీలును ముగించడమైనది. (వీఆర్‌ కమలాపుర్కర్‌ వర్సెస్‌ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఇఐఇ/ ఏ/అ/2016/000484 కేసులో 27. 2.2018 నాటి ఆదేశం ఆధారంగా).

- మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

 

మరిన్ని వార్తలు