మమతా బెనర్జీ (ప.బెంగాల్‌ సీఎం) రాయని డైరీ

18 Nov, 2018 00:00 IST|Sakshi

మంత్రులింకా వస్తూనే ఉన్నారు. అత్యవసర సమావేశం అని చెబితేనే ఇంత తాపీగా వస్తున్నారు.. ‘అత్యవసర సమావేశం’ అని కాకుండా, ‘అవసర సమావేశం’ అని చెబితే ‘ఇంకో రోజెప్పుడైనా పెట్టండి మమతాజీ’ అని రిక్వెస్ట్‌ చేస్తారేమో!
ఇంద్రనీల్‌ హడావుడిగా వచ్చాడు. ‘‘సారీ మేడమ్, మీటింగ్‌కి వస్తూంటే మధ్యలో మీడియా వాళ్లు దారి కాచి, ‘వేడిగా ఒక కప్పు టీ తాగి వెళ్లండి’ అన్నారు. అందుకే ఆలస్యం అయింది’’ అన్నాడు. 
‘‘జనరల్‌గా వాళ్లకు మనం టీ తాగిస్తాం. వాళ్లు మనకు టీ తాగిస్తున్నారంటే.. టీ తాగించి మన చేత ఏదో చెప్పించాలని ట్రై చేస్తున్నారన్న మాట. మీరేమైనా వాళ్లతో అన్నారా ఇంద్రనీల్‌?’’ అని అడిగాను. 
‘స్‌..’ అని ఇంద్రనీల్‌ చెయ్యి విదిలిస్తూ చూపుడు వేలు కొట్టుకున్నాడు. ‘‘ఎందుకలా చూపుడు వేలు కొట్టుకున్నారు?’’ అని అడిగాను. ‘‘చెప్పకూడని విషయం మీడియావాళ్లకు చెప్పేశానేమోనని..’’ అన్నాడు. ఇంద్రనీల్‌ ఇన్ఫర్మేషన్‌ మినిస్టర్‌. 
‘‘అత్యవసర సమావేశం అన్నప్పుడు అది అత్యంత రహస్య సమావేశం అని మీకై మీరే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఉదయాన్నే లేవాలి’’ అన్నాను. 
‘‘నేను ఉదయాన్నే లేచాను మేడమ్‌. మీడియా వాళ్లు నాకంటే ముందు లేచినట్లున్నారు’’ అని మళ్లీ వేలు కొట్టుకున్నాడు ఇంద్రనీల్‌.. పైకి లేచి నిలబడి.
‘‘మీడియావాళ్లు అలారం పెట్టుకుని లేచేదేం ఉండదు. వాళ్లెప్పుడూ లేచే ఉంటారు. నువ్వు కూర్చో’’ అన్నాడు అమిత్‌ మిత్రా. ఆయన సీనియర్‌ మినిస్టర్‌. ఇంద్రనీల్‌ అంటే ఆయనకు పడదు. 
‘‘మేడమ్‌.. మీడియా వాళ్లకు నేనేం చెప్పలేదు. మీటింగ్‌ అని మాత్రమే చెప్పాను’’ అన్నాడు ఇంద్రనీల్‌.. అమిత్‌ వైపు ఉక్రోషంగా చూస్తూ. 
‘‘గుడ్‌ ఇంద్రనీల్‌’’ అన్నాను. అప్పటికి గానీ అతను మాట్లాడ్డం ఆపలేదు. 
అంతా మళ్లీ అటెన్షన్‌లోకి వచ్చారు. 
‘‘పందొమ్మిదిన మీటింగ్‌. బీజేపీకి యాంటీగా అందరం కలుస్తున్నాం’’ అన్నాను.
‘‘ఇరవై రెండున కదా మేడమ్‌ మీటింగ్‌’’ అన్నాడు ఇంద్రనీల్‌. 
అతడి వైపు కోపంగా చూశాడు అమిత్‌.
‘‘అది చంద్రబాబు నాయుడు పెడుతున్న యాంటీ బీజేపీ మీటింగ్‌. ఇది మనం పెడుతున్న యాంటీ బీజేపీ మీటింగ్‌. చంద్రబాబు యాంటీ బీజేపీ మీటింగ్‌ నవంబర్‌ ఇరవై రెండున ఢిల్లీలో. మన యాంటీ బీజేపీ మీటింగ్‌ జనవరి పందొమ్మిదిన కోల్‌కతాలో’’ అన్నాడు.
‘అంత ఇన్ఫర్మేషన్‌ అవసరమా..’ అన్నట్లు చూశాడు ఆయన వైపు ఇంద్రనీల్‌.
‘‘బీజేపీకి యాంటీగా ఎవరెన్ని మీటింగులు పెట్టినా, మన మీటింగ్‌ మనదే. చెడ్డవాళ్లకు వ్యతిరేకంగా మంచివాళ్లు పెట్టుకుంటున్న మీటింగ్‌ మనది. అందుకే బీజేపీలోని మంచివాళ్లను కూడా మన మీటింగ్‌కి పిలవాలనుకుంటున్నాను. ఏమంటారు?’’ అని అడిగాను. 
‘‘అప్పుడు బీజేపీ వాళ్లు మన పార్టీలోని చెడ్డవాళ్లను చేరదీసి బీజేపీకి వ్యతిరేకంగా మనం పెట్టుకునే మంచివాళ్ల మీటింగ్‌కి రాకుండా చేస్తే?’’ అని అడిగాడు ఇంద్రనీల్‌.. అమిత్‌ వైపు అదోలా చూస్తూ. 
‘‘గుడ్‌ పాయింట్‌’’ అన్నాను. అలాగంటేనైనా అతడు మాట్లాడకుండా ఉంటాడని. కానీ మాట్లాడాడు!
‘‘ఢిల్లీలో చంద్రబాబు మీటింగ్‌ అయ్యాక, మన అత్యవసర సమావేశం అప్పుడు పెట్టుకుని మాట్లాడదాం మేడమ్‌.. ఆ మీటింగ్‌కి రాని మంచివాళ్లెవరో, ఆ మీటింగ్‌కి వచ్చిన చెడ్డవాళ్లెవరో చూసుకుని’’ అన్నాడు ఇంద్రనీల్‌. 
నిజంగా గుడ్‌ పాయింట్‌ అనిపించింది!
మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు