రాయని డైరీ.. సోనియా గాంధీ

15 Sep, 2019 01:24 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

మీటింగ్‌కి ఢిల్లీ రమ్మని పిలవగానే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మిస్‌ కాకుండా వచ్చారు. ‘‘ముఖ్యమైన పనులేమైనా వదిలేసి వచ్చారా?’’ అని అడిగాను వాళ్లొచ్చీ రాగానే. ‘‘మీటింగ్‌ కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది సోనియాజీ?’’ అన్నారు కమల్‌నాథ్, అమరీందర్‌ సింగ్, అశోక్‌ గెహ్లాట్, భూపేష్‌ బాఘేల్, నారాయణస్వామి.. అంతా ఒకేసారి! నేనేదైనా చెబితే, చెప్పింది మిస్‌ అవకూడదన్నట్లుగా మన్మోహన్‌ సింగ్, అహ్మద్‌ పటేల్, ఏకే ఆంటోని నిటారుగా కూర్చొని ఉన్నారు. వాళ్లతోపాటు చిదంబరం కూడా ఉండుంటే బాగుండనిపించింది. పార్టీలోని  సీనియర్‌ లీడర్‌లలో ఒక్కరు మిస్‌ అయినా ఎందుకనో వెలితిగా అనిపిస్తుంది. ‘‘మీకూ అలానే అనిపిస్తోందా?’’ అని అడిగాను. ‘‘అలానే అనిపిస్తోంది మేడమ్‌జీ’’ అన్నారు సీనియర్‌లు, చీఫ్‌ మినిస్టర్‌లు.  మీటింగ్‌లో పార్టీ స్టేట్‌ యూనిట్‌ చీఫ్‌లు, ఏఐసీసీ ఇన్‌చార్జిలు మరోవైపు ఉన్నారు. వాళ్ల వైపు చూసి అడిగాను..  ‘‘మీకూ అలానే అనిపిస్తోందా?’’ అని. ‘‘ఏంటి సోనియాజీ మాకూ అలానే అనిపించడం?’’ అన్నారు! వాళ్లు నిటారుగా లేరని అర్థమైంది. నిటారుగా లేనివాళ్లను నిటారుగా కూర్చోమని చెప్పడానికి కూడా సమయం లేదు. ‘‘మహారాష్ట్ర ఎన్నికలు దగ్గర పడ్డాయి’’ అన్నాను.

‘పడితే మనకేంటి?’ అన్నట్లు చూశారు యూనిట్‌ చీఫ్‌లు, ఏఐసీసీ ఇన్‌చార్జిలు! ‘‘దేశంలో ఉన్నది ఐదు స్టేట్‌లే కాదని, ఐదు స్టేట్‌లలో మాత్రమే మనం ఉన్నామని వీళ్లకు చెప్పండి మన్మోహన్‌జీ’’ అన్నాను ఆయన వైపు తిరిగి ఆయన అందరి వైపూ తిరిగారు. ‘‘మేడమ్‌ సోనియాజీ చెప్పింది చక్కగా అర్థం చేసుకోండి. గాంధీజీ నూట యాభయ్యవ జయంతి పాదయాత్రను ఎలా సెలబ్రేట్‌ చెయ్యాలో చర్చించడానికి మనల్నందర్నీ పిలిపించినప్పటికీ, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహారాష్ట్ర  గురించి కూడా మేడమ్‌ మాట్లాడుతున్నారు’’ అన్నారు. నా ఉద్దేశాల సారాంశాన్ని  ఆయన ఎంత అద్భుతంగా సంగ్రహించారు! దేశానికి మోదీ వంటి వ్యక్తి ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌కు మన్మోహన్‌ వంటి వ్యక్తి మాజీ ప్రధానిగా ఉండడం ఎంత సౌలభ్యమో తెలుస్తోంది. వెంటనే నేనేదో చెప్పబోతుంటే మన్మోహన్‌జీ మళ్లీ నాకు సౌలభ్యాన్ని ఇచ్చారు! ‘‘మేడమ్‌ సోనియాజీ చెప్పబోతున్న దానిని మరింత చక్కగా అర్థం చేసుకోండి.

మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి నిన్న ఒకరు, ఇవాళ ఒకరు బీజేపీలోకి వెళ్లారు. రేపు ఒకరు వెళ్లబోతున్నారు. ఎన్సీపీ వాళ్లు బీజేపీలోకి వెళ్తున్నారంటే వాళ్లు ఎన్సీపీ నుంచి వెళ్తున్నట్లు కాదు, కాంగ్రెస్‌ నుంచి వెళుతున్నట్లు. ఎన్సీపీ వచ్చింది కాంగ్రెస్‌ నుంచే కాబట్టి’’ అన్నారు మన్మోహన్‌! యూనిట్‌ చీఫ్‌లు, ఏఐసీసీ ఇన్‌చార్జిలు వెంటనే నా వైపు చూశారు! ‘‘మేడమ్‌జీ.. ఇందాకటి మీ ప్రశ్న ఇప్పుడు మాకు అర్థమైంది. ‘మీటింగ్‌కి సీనియర్‌ లీడర్‌లలో ఒక్కరు మిస్‌ అయినా మీకూ వెలితిగా అనిపిస్తుందా..’ అని కదా మీరు అడిగారు?’’ అన్నారు! అంతసేపటికి గానీ వాళ్లు నిటారు కాలేదు. ‘‘అవును’’ అన్నాను. ‘‘ఎవరు మిస్‌ అయినా వెలితిగా అనిపించదు కానీ, రాహుల్‌ బాబు మిస్‌ అయితే మాత్రం అనిపిస్తుంది’’ అన్నారు. మళ్లీ మన్మోహన్‌ వైపు చూశాను. ‘‘రాహుల్‌ బాబుని మేడమే పిలవలేదు. బాబు గాంధీజీని మిస్‌ అవుతున్నారని తెలిసి పాదయాత్ర ఏర్పాట్లకు పంపారు’’ అని చెప్పారు! ఆయన వైపు కృతజ్ఞతగా చూశాను.

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు