సైనిక చరిత్రతో నేతల సరాగాలు

5 May, 2018 01:46 IST|Sakshi
నరేంద్ర మోదీ

జాతిహితం

సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. దీనిని ఆరెస్సెస్‌ మరింత అలంకరించి చెబుతుంది. మోదీ కూడా అందులోని వారే కదా! భారత సైనిక చరిత్ర గురించి ప్రధానమంత్రి సృష్టించిన గందరగోళం ఆయనకూ, ఆయన అనుచరులకూ సంబంధించినదే. వారు కనీసం వికీపీడియాలోకి వెళ్లి చూసినా భారత సైనిక దళాల ప్రధాన అధికారి పదవిని (అప్పుడు) కేఎం కరియప్ప (తిమ్మయ్య కాదు) జనవరి 15, 1949న చేపట్టారని తెలిసేది. అందుకే ఆ రోజును సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ పదవిని చేపట్టేనాటికి కరియప్ప వయసు యాభయ్‌ ఏళ్లు (1899లో పుట్టారు). అప్పుడు త్వరితంగా జరిగిన పరిణామాల కారణంగా, ఒక ఘటన మరొక ఘటన మిళితమైపోయి కనిపించడం వల్ల ఆనాటి చరిత్ర కొంచెం తికమక పెడుతుంది.

మరింత స్పష్టత కోసం– 1947–48 ఇండోపాక్‌ యుద్ధ సమయంలో కూడా రెండు దేశాల సైనిక దళాలు బ్రిటిష్‌ కమాం డర్ల నాయకత్వంలోనే పనిచేశాయి. తరువాత రెండు దేశాల సైనిక నాయకత్వాలను స్థానిక సైనిక అధికారులకు అప్పగించి, రాజకీయ నాయకులతో నేరుగా సంప్రతించే పద్ధతి తెచ్చారు. కశ్మీర్‌లో జరుగుతున్న పోరు కోసం భారత్‌ కరియప్పను ఎంచుకుంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో ఉన్న కరియప్పకు ఢిల్లీ, పంజాబ్‌ కమాండ్‌ నాయకత్వం అప్పగించారు. ఆ కమాండ్‌కే ఆయన వెస్ట్రన్‌ కమాండ్‌ అని పేరు మార్చారు. కరియప్ప, ఆయనే ఎంపిక చేసిన మేజర్‌ జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య ఇద్దరూ కూర్గ్‌ ప్రాంతం వారే. పైగా ఇద్దరి ఇంటి పేర్లు కే అనే అక్షరంతోనే మొదలవుతాయి. కే అంటే కోదండేరా. ఇద్దరూ అదే వర్గానికి చెందినవారు. తిమ్మయ్యను కశ్మీర్‌ (తరువాత 19) డివిజన్‌కు కరియప్ప పంపిం చారు. కూర్గీలు లేదా కొడవాలది ఒక చిన్న సామాజిక వర్గం. విజయవంతమైన వర్గం కూడా.

అయితే 1950 నాటికి ఈ రెండు పేర్లు దేశానికి కొత్త. ఒకేలా ధ్వనిస్తాయి. ఆ ఇద్దరు కలసి పనిచేశారు. కశ్మీర్‌ పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించి ప్రముఖలయ్యారు. తరువాత సైనిక దళాల ప్రధాన అధికారులు అయ్యారు కూడా. కరియప్ప వలె కాకుండా (ఈయన రక్షణమంత్రి సర్దార్‌ బల్దేవ్‌సింగ్‌ కలివిడిగా ఉంటూ, హాస్యోక్తులకు ప్రసిద్ధిగాంచినవారు) తిమ్మయ్య తన కాలపు రక్షణమంత్రి వీకే మేనన్‌తో విభేదిస్తూ ఉండేవారు. మేనన్‌ ఎరుపు మరీ ఎక్కువగా ఉన్న కమ్యూనిస్టు. అయితే ఆంగ్ల విధానంలో సైనిక శిక్షణ తీసుకున్న అధికారులకు కమ్యూనిస్టులంటే అసహ్యం. రక్షణమంత్రి నిరంతరం జోక్యం చేసుకోవడం పట్ల తిమ్మయ్య అసహనంగా ఉండేవారు.

ఆ కాలం విశేషాలను అద్భుతంగా చిత్రించిన ఇందర్‌ మల్హోత్రా ఇచ్చిన ఉదంతం ఒకటి ఉంది. రక్షణమంత్రితో మరోసారి గొడవపడే సందర్భాన్ని తప్పించుకునేందుకు తిమ్మయ్య ఎత్తుగడ అది. రక్షణమంత్రితో సమావేశం తప్పించుకోవడానికి ఆయనకు ఏ కారణం చెప్పమంటారు అని తిమ్మయ్య సహాయకుడు అడిగాడట. దీనికి తిమ్మయ్య, ‘మేనన్‌జైటిస్‌ వ్యాధి సోకింద’ని చెప్పమన్నారట. చివరికి 1959లోనే తిమ్మయ్య పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ నచ్చ చెప్పడంతో రాజీనామాను ఉపసంహరించుకుని, పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగి 1961లో వైదొలిగారు. ఇదంతా, మరీ ముఖ్యంగా ఈ కూర్గ్‌ చమత్కారం సామాన్య ప్రజలను నిజంగానే తికమకపెడుతుంది. కానీ ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం కూడా ఇలాంటి గందరగోళంలో ఎలా పడిపోయారు? దీనికి ఆమోదయోగ్యమైన ఒక వాదనను ప్రతిపాదించవచ్చు. 
స్వాతంత్య్రం వచ్చిన తరువాత, పాతికేళ్లు అన్నీ యుద్ధాలే.

అందులో పాకిస్తాన్‌ (1947–48, 1965,1971), చైనా (1962) యుద్ధాలు పెద్దవి. హైదరాబాద్‌ (1947), గోవా (1960), చైనాతో మరోసారి 1967 నాథులా దగ్గర జరిగినవి చిన్నవి. 1971 నాటి యుద్ధం మినహా, మిగిలిన వాటిలో భారత్‌కు స్పష్టమైన విజయం దక్కలేదు. 1962లో మనది స్పష్టమైన ఓటమి. 1965 నాటి యుద్ధం ప్రతిష్టంభనతో ముగిసింది. 1947–48 నాటి యుద్ధం అసంపూర్ణం. ఆనాటి రాజకీయ నాయకత్వం సైన్యాన్ని నిరుత్సాహపరచకుండా ఉంటే వారు మరింత బాగా పోరాడి ఉండేవారని చెప్పడం రివాజుగా మారింది. ఇవన్నీ వలసపాలనానంతర దశాబ్దాలు. ప్రజాస్వామిక వ్యవస్థలు ఆకృతి దాలుస్తున్నాయి. తరువాత స్థానంలో మాత్రమే సైన్యం ఉంది. పౌర, రాజకీయ ఆధిక్యానికి ఒక సవాలుగా ఉండేది. ఒక చిన్న వాస్తవం: 1958లో పాకిస్తాన్‌ ఆధిపత్యం స్వీకరించిన జనరల్‌ (తరువాత ఫీల్డ్‌మార్షల్‌) ఆయుబ్‌ ఖాన్‌ సరిహద్దులలో కరియప్ప దగ్గరే కల్నల్‌గా పనిచేశారు. 

ఈ కారణాలతోనే ఈ మొత్తం కాలంలో రాజకీయ, సైనిక వ్యవస్థలకు సంబంధించి వ్యూహాత్మక సిద్ధాంతంతో కూడిన కథనం రూపుదిద్దుకుంది. అదే– సాయుధ దళాలు, వారి కమాండర్లు ఎలాంటి తప్పిదాలు చేయలేదు, అపజయాలకీ, ఎదురుదెబ్బలకీ రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించినట్టు, విజయం వస్తే అందులో అంతా భాగస్వాములే. అప్పటి నుంచి అదే ధోరణి. కార్గిల్, 1999 వైఫల్యం ప్రధానంగా సైనిక నాయకత్వానిదే గానీ, వాజ పేయి ప్రభుత్వానిది కాదు. అంత పెద్ద సరిహద్దు ప్రాంతంలో పాకిస్తానీలు అంత లోపలికి, ఎవరూ గుర్తించకుండా ఎలా చొచ్చుకు రాగలిగారు? మరోసారి చాలా అనుకూలమైన పురాణం పుట్టింది. ఈసారి ఆ లోపం పౌర నిఘా సంస్థల మీదకు పోయింది. కొద్దిమంది సైనికాధికారుల మీదకు మాత్రం కొంత బాధ్యతను మోపారు. మనమంతా ఆ యుద్ధంలో జరిగిన వీరకృత్యాలను మననం చేసుకున్నాం. అపజయాల విమర్శల నుంచి సైనికులను కాపాడాలనుకోవడమే ఇందుకు కారణం.  

సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. ఆ కథలు ఎలా ఉంటాయంటే– కరి యప్ప, తిమ్మప్ప, చౌధరి, మానెక్‌షాలకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆక్రమిత కశ్మీర్‌ ఉండేది కాదు, చైనా గుణపాఠం నేర్చుకునేది, టిబెట్‌ విముక్తమయ్యేది, 1971లో పాక్‌ భూతం చచ్చేది, మరో రెండువారాల యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్‌ను మన సైన్యం ఆక్రమించేది– ఇలా. ఇందుకు సరైన ఆధారాలేమీ ఉండవు. కానీ అధికార వ్యవస్థకు సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజాస్వామ్యంలో మా ఆర్మీ బలోపేతమైనదన్న సెంటిమెంట్‌ అవసరమవుతుంది. దీనిని ఆరెస్సెస్‌ మరింత అలంకరించి చెబుతుంది. ఆనాడు కరియప్ప, తిమ్మయ్య, చౌధరి మరింత సమయం ఇవ్వాలని నాటి ప్రధానిని కోరారని, కానీ గాంధీ–నెహ్రూ వంశీకులు అంగీకరించలేదని ఆరెస్సెస్‌ నేతలు చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎవరిని అడిగినా ఇదే వాదం వినిపిస్తారు. మోదీ కూడా అందులోని వారే కదా!

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

మరిన్ని వార్తలు