నాణ్యమైన కాలం!

24 May, 2020 00:27 IST|Sakshi

జనతంత్రం

కాలం అంటే ఏమిటి? దానిని కొలిచేదెట్లా? గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల్లోనా?... ‘తారీఖులు, దస్తావే  జులు... ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. అసలు కాలం (టైమ్‌) అనే భావనే ఒక ఇల్యూజన్‌ అని ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొకండుగా కనిపిస్తాడట. కాలం కూడా అంతే. కాలం ఒక సాపేక్ష (రిలేటివ్‌) అనుభవం. కొందరికి భారంగా, కొందరికి దివ్యంగా, కొందరికి వేగంగా, కొందరికి నిలకడగా ఉన్నట్టు ఏకకాలంలో అది అనుభూతులను పంచుతుంది. ఒక ఆదియునూ, ఒక అంతమూ కలిగిన ఒకానొక పరిణామక్రమపు ప్రస్థానాన్ని కాలంగా గుర్తుపెట్టుకుంటాము. ఈ ప్రస్థానంలో కలిగిన సామూహిక అనుభూతుల ప్రాతిపదికపై ఆయా చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిదో గణించగలుగుతాము. అందువల్ల పరిమాణం కంటే నాణ్యతే కాలానికి సరైన కొలమానం. మన పూర్వీకులు ‘రాశి కంటే వాసి మిన్న’ (క్వాంటిటీ కన్న క్వాలిటీ మిన్న) అని అందుకే భావిం చారు. సరిగ్గా ఏడాది కిందటి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ రెండు భావాల మధ్య ఘర్షణను తలపించాయి. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు, ఎలా  బతికామన్నది ముఖ్యం’ అనే ‘మాగ్నాకార్టా’కు పట్టం కట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది?

జనం గుండె చప్పుడు
ఏదో ఒక పల్లెనడిగి తెలుసుకుందాం. లాటరీ పద్ధతిలో ఆ పల్లె పేరు కోపల్లె. కేరాఫ్‌ తెనాలి. ఏదైతేనేం, ఏదో ఒక ఇల్లు. తలుపు తట్టిన ఇల్లు దర్జీ పని చేసుకునే ధర్మయ్యది. వాళ్లమ్మగారి పేరు ఏసురత్నమ్మ. కాలం మారింది బాబూ అంటున్నదామె. వాళ్లా యన బతికి ఉన్నప్పుడు వృద్ధాప్య పింఛన్‌ మంజూరీ కోసం ఐదేళ్లు తిరిగాడట. పింఛన్‌ రాలేదు. ఈలోగా ఆయన కాలం చేశారు. వితంతు పింఛనైనా ఇస్తారేమోనని ఏసురత్నమ్మ ఏడాది న్నరపాటు పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగిందట. చివరకు ఆశ వదిలేసుకుని ఇంటి పట్టునే ఉంటున్నది. కొన్నాళ్ల కిందట గ్రామ వలంటీరునంటూ ఒకమ్మాయి ఇంటికొచ్చింది. ‘అవ్వా నీకు పింఛన్‌ వస్తోందా?’ అని అడిగి మరీ కాయితాల మీద వేలి ముద్రలు వేయించుకుని పోయింది! ‘ఏళ్లు తిరిగినా రాని పింఛన్‌ ఏలిముద్రలేస్తే వచ్చేత్తాదా అనుకుని పట్టించుకోలేదు. ఒకరోజు అదే వాలంటీరమ్మ వచ్చి ఇదిగో నీ పింఛనంటూ డబ్బులు చేతిలో పెడితే నమ్మలేకపోయా’నంటూ చెప్పుకొచ్చింది. దర్జీ లకు రూ.10 వేల ఆర్థికసాయం పథకంలో ఆమె కొడుకు ధర్మయ్య లబ్ధిదారుడు. కోడలి పేరు వజ్రమ్మ. తన పేరు పేద లకు ఇళ్ల స్థలాల పథకంలో చేరిందని సంతోషంగా చెప్పిందామె. ఇంకో నెలరోజుల్లో స్థలం కాగితాలు చేతికిస్తారు. అన్న చెప్పా డంటే చేస్తారంతే. చాలా నమ్మకంగా కనిపించింది. వజ్రమ్మ పెద్దకొడుకు జశ్వంత్‌. గుంటూరులో బీటెక్‌  ఫస్టియర్‌ పూర్త యింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రభుత్వం రూ.52 వేలు కట్టేసింది. రెండో కొడుకు యశ్వంత్‌ పాలిటెక్నిక్‌ చదువు తున్నాడు. జగనన్న వసతి దీవెన పథకంలో 15 వేలు మంజూర య్యాయి. తొలివిడత 7,500 అందుకున్నాడు. కూతురు సుష్మ తొమ్మిదో క్లాసు. అమ్మఒడి కింద వజ్రమ్మ ఖాతాలో 15 వేలు పడ్డాయి. ఇవి పాతరోజులు కావు సారూ... ఇప్పుడు సంతో షంగా ఉందంటున్నాడు ధర్మయ్య. బతకడం కోసం బతుకంతా పోరాడిన ఏసురత్నమ్మ ఇప్పుడు స్థిమితంగా కనబడింది. జీవిత కాలపు ఎదురుచూపుల తర్వాత ఇప్పుడామె కళ్లలో ఒక సంతృప్తి మెరుస్తున్నది.

ఆ ఇళ్లే కాదు, ఏ ఇంటికెళ్లి ఆరాతీసినా రోజులు మారాయనీ, ఇప్పుడు బాగుందనే చెప్పుకొచ్చారు. కోపల్లే కాదు, ఏ పల్లెను పలకరించినా అదే గుండె చప్పుడు. అక్కడికి దగ్గర్లోనే వున్న కొల్లిపర మండలం గుదిబండవారిపాలెం రైతు శ్రీను శేఖర్‌రెడ్డి మంచి జోష్‌ మీదున్నాడు. మూడెకరాల్లో జొన్న, మూడెకరాల్లో మొక్కజొన్న వేశాడు. దిగుబడి బాగా వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు ఇచ్చేశాడు. పోయినేడు కంటే రూ. 50 వేలు ఎక్కువొచ్చాయి. తేమ శాతం చూడాలి, తూర్పారపట్టాలనే షరతులేమీ లేవు. పదమూడు రోజుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి. కొడుకు బీఫా ర్మసీ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన పథకంలో రూ.80 వేల ఫీజును ప్రభుత్వం కట్టేసింది. వసతి దీవెన కింద తొలివిడత రూ.7,500 వచ్చాయి. ఇది రైతురాజ్యమంటాడు శ్రీను శేఖర్‌రెడ్డి.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కల గోడు అనే ఓ మారుమూల గ్రామం వుంది. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గుమ్మఘట్ట మండల కేంద్రానికి వెళ్లాలంటే బస్సు సౌకర్యంగానీ, ఆటో సౌకర్యం గానీ ఉండేది కాదు. కొంత మందికి మోటార్‌ బైక్‌లు ఉన్నాయి. మిగతా వాళ్లు నడిచి వెళ్లా ల్సిందే. కానీ రెండు బెల్టు షాపులు మాత్రం ఉండేవి. చీప్‌ లిక్కర్‌కు బానిసలై ఇద్దరు చనిపోయారు కూడా. కొత్త ప్రభుత్వం రాగానే ఆ రెండు షాపులు మాయమైపోయాయి. ఇప్పుడు మందు తాగాలంటే ఆరేడు కిలోమీటర్లు నడిచిపోవాలి. పైగా షాక్‌ కొట్టే ధరలు. గత్యంతరం లేక తాగుడు మానేశానంటు న్నాడు బోయ రాజశేఖర్‌. ‘జగనన్న చేసిన పనికి మొదట్లో బాధగా వుండేది సామీ. రానురాను అలవాటైంది. ఇప్పుడు ఆరోగ్యం బాగుంద’న్నాడు. ఆ మారుమూల గ్రామానికి ఇప్పుడు గ్రామ సచివాలయం ఒక పెద్ద సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. ఎప్పుడు చూసినా ఓ పది నుంచి పాతికమంది అక్కడ తచ్చాడు తుంటారు. ఉపాధి హామీ డబ్బు పడిందో లేదో చూసుకోవడాని కని కొందరు, రైతు భరోసా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి వచ్చామని కొందరు చెబుతారు. వాళ్ల దృష్టిలో ఈ భూప్రపంచం మీది ఏ సమస్యకైనా గ్రామ సచివాలయంలో పరిష్కారం దొరు కుతుంది. చాలా గ్రామాల్లో సచివాలయాలు అటువంటి విశ్వా సాన్ని నింపగలిగాయి. మంగలి సాకమ్మ కోడలు చనిపోయింది. కొడుకు దేశాలు పట్టిపోయాడు. ఏడేళ్ల మనవడిని కూలినాలి చేస్తూ సాకమ్మ పోషించుకుంటున్నది. మనవడికి చదువుకోవా లని కోరిక. సాకమ్మ ధైర్యం చేయలేకపోయింది. ఊళ్లో ఉన్న టీచర్లు వాడికి చదువు మీదున్న కాంక్షను గుర్తించి ఒకటో క్లాసులో వేశారు. అమ్మఒడి కింద సాకమ్మకు పదిహేను వేలు వచ్చాయి. పట్టలేని ఆనందంతో సాకమ్మ మనవడికి కొత్తబట్టలు కుట్టించింది. స్కూల్‌ బ్యాగు, పెన్ను కొనుగోలు చేసింది. ఈ సంగతంతా చెబుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘మారాజు సల్ల గుండాల’ని చేతులు జోడించి ప్రార్థించింది.

కీలక సంస్కరణలు
నిరుపేదలు నిస్సహాయులుగా మిగిలిపోకుండా సంతృప్తస్థాయి మేరకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ ఏడాది ముఖ చిత్రంగా కనిపిస్తున్నప్పటికీ, సారాంశాన్ని లోతుగా చదవగలి గితే భవిష్యత్‌ పెను విప్లవానికి బాటలువేస్తున్న రాజకీయ, సామాజిక, పరిపాలనా సంస్కరణలు కనిపిస్తాయి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరే కంగా నిబద్ధతతో నిలబడిన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరింత నిక్కచ్చిగా కట్టుబడి ఉండటం అరుదైన విషయం. ప్రతిపక్షాన్ని శాసనసభలో నిశ్శేషం చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఉన్నత రాజకీయ విలువలకోసం దానిని కాలదన్నిన రాజకీయ నాయకుడు వర్తమాన భారత రాజకీయాలలో మరొకరు లేరు.

గతంలో సంఘసేవకులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజాసేవకులకు టికెట్లిచ్చే సంప్రదాయాన్ని పక్కకు తోసి డబ్బున్నవాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి ప్రజాస్వామ్య ప్రక్రియను ధనక్షేత్రంగా మార్చిన చరిత్ర ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ సిద్ధాంత కర్తది. ఆ విపరీత ధోరణికి అడ్డుకట్టవేస్తూ అర్హతలున్నవారిని గుర్తించి వారికి టికెట్లిచ్చి గెలిపించిన వ్యక్తి వై.ఎస్‌. జగన్‌. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా ప్రకటించి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలుచేయడానికి సంకల్పించి తొలి యేడాదే 90 శాతానికి పైగా అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. మహాత్మాగాంధీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా చేపట్టిన చర్యలు పరిపాలనా సంస్కరణల్లో ప్రధానమైనవి. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పరిపాలన ప్రతి గుమ్మంలో అడుగేసింది. ప్రభుత్వ సేవలను వేగంగా సమర్థంగా ప్రజలకు అందించడానికి ఏర్పాటైన గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థలకు ఇప్పటికే సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించి వినూత్న పాలనకు శ్రీకారం చుట్టారు. భూములపై శాశ్వత భూయాజమాన్య  హక్కులు ఇవ్వడంకోసం ప్రతి సెంటు భూమినీ రీసర్వే చేసే బృహత్తరమైన యజ్ఞాన్ని ప్రభుత్వం తలపెట్టింది. తద్వారా భవిష్యత్తులో భూవివాదాలకు చరమగీతం పాడాలనేది ప్రభుత్వ లక్ష్యం. విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణలు ఈ ఏడాది పరి ణామాల్లో ముఖ్యంగా చెప్పదగినవి. రాష్ట్ర కేబినెట్‌లో 60 శాతం పదవులు ఎస్‌సీ, బీసీ, ఎస్‌టీ, మైనారిటీ వర్గాలకు దక్కాయి. ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో నలుగురు ఈ వర్గాల వారే. శాసనసభ స్పీకర్‌ పదవిని బీసీ వర్గ నాయకుడు అలంకరిం   చారు. నామినేటెడ్‌ పదవుల్లో సగం, నామినేటెడ్‌ పనుల్లో సగ  భాగం బలహీన వర్గాలకు కేటాయించిన దాఖలా దేశ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేదు. మహిళలపై జరుగుతున్న అకృ త్యాలకు చెక్‌ పెట్టడం కోసం తీసుకొని వచ్చిన ‘దిశ’ బిల్లుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. నిరుపేదలూ, బలహీన వర్గాల పాలిట మహమ్మారిగా తయారైన మద్యంపై ప్రభుత్వ నియంత్రణ కూడా సామాజిక ఉద్యమంలో ఒక ప్రధానమైన ఆయుధమే. డ్వాక్రా సంఘాలను పునరుత్తేజితం చేయడానికి ప్రారంభించిన సున్నా వడ్డీ పథకం ఒక సామాజిక పెట్టుబడి.

అవినీతిపై యుద్ధం
ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతిపైసా ప్రజాక్షేత్రంలో విత్తనమై మొల కెత్తాలంటే అవినీతి చీడను పూర్తిగా తొలగించాలన్న నిశ్చయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రణాళికాబద్ధమైన వైఖరిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల కోసం పాత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన టెండర్ల విధానాన్ని కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. రూ.100 కోట్లు, అంతకంటే పెద్దవైన పనులకు సంబంధించిన టెండర్లకు జ్యుడీ షియల్‌ ప్రివ్యూ  ఆమోదం తప్పనిసరిచేస్తూ నిర్ణయం తీసుకు న్నది. గతంలో అవినీతిమయంగా ముగించిన టెండర్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి దాదాపు 2,000 కోట్ల ప్రజాధనాన్ని కాపాడింది. అవినీతి నిరోధక శాఖకు పదునుపెట్టి క్రియాశీలం చేసింది. ఇసుక, లిక్కర్‌ దందాలపై ఉక్కుపాదం మోపడానికి చురుకైన అధికారులతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను తయారుచేసింది.
మానవీయ దృష్టికోణం
ఏడాది పరిపాలనా కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూప కల్పన చేసిన విధానాల్లో, అమలు చేసిన పథకాల్లో అంతర్వాహి నిగా ప్రవహించే ఒక విజన్‌ కనిపిస్తున్నది. సంప్రదాయ రాజ కీయవేత్తల ఆలోచనలకు ఇది భిన్నమైన విజన్‌. సంక్షేమం– అభివృద్ధి రెండూ వేర్వేరు స్రవంతులుగా సంప్రదాయ రాజకీయ నాయకత్వం పరిగణించింది. జగన్‌ ప్రభుత్వ పథకాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే రెండు పరస్పరాధారితాలుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తాయి. సమాజంలోని విశాల జన బాహుళ్యమైన బలహీన వర్గాల ప్రజలు, మహిళలను సాధికారిత మూర్తీభవించే శక్తు  లుగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను డిజైన్‌ చేసింది. జన బాహుళ్యమంతా సాధికారత సాధించిన నాడు ఆ జాతి ఆర్థికవృద్ధి సహజంగానే ఇబ్బడిముబ్బడిగా పెరి గిపోతుంది. సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఇంగ్లిష్‌ మీడియం వంటి విద్యా సంస్కరణల వెనుక ఉద్దేశం కూడా ఇదే కావచ్చు. రాష్ట్ర, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయరంగంలో సిరులు కురిపించడం కోసం ఇంతకు ముందెన్నడూ ఎరుగని కొత్త ఆలోచనలను ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభిం చింది. కోవిడ్‌–19 ప్రపంచాన్ని చుట్టుముట్టిన పూర్వరంగంలో వైఎస్‌ జగన్‌ తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని అందరి కంటే ముందే ఆయన చెప్పారు. అప్పుడు ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ తీవ్రంగా స్పందించింది. కరోనాతో కలిసి జీవించాలన్న వ్యక్తి గురించి ఏం మాట్లాడతామంటూ సెటైర్లు వేసింది. తరువాతి కాలంలో అన్నిదేశాల అధినేతలు, అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులూ జగన్‌ చెప్పిన మాటనే బలపరచడంతో ఇండస్ట్రీ మూగ బోయింది. ప్రజలందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయకల్పన కూడా ప్రధాన లక్ష్యాలుగా మన రాజ్యాంగం చెప్పుకున్నది. ఈ లక్ష్యాల సాధన కోసం కృషి చేయడం రాజ్యాంగ వ్యవస్థల ఉమ్మడి లక్ష్యం. ప్రగతిశీల విధానాలను చొరవగా అమలు చేయబూనే ప్రభుత్వాలకు సాంకేతిక కార ణాలు అడ్డంకులుగా పరిణమించడం శోచనీయం. సాంకేతిక కారణాలతో పాటు, ఫోర్త్‌ ఎస్టేట్‌ అపశకునాలు వినిపిస్తున్నా గడిచిన ఏడాది ఒక మంచి క్వాలిటీ టైమ్‌గా మిగిలిపోతుంది.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా