5జీతో ముంచుకొస్తున్న సాంకేతిక ముప్పు!

24 Jan, 2020 00:21 IST|Sakshi

సందర్భం

ప్రతి సాంకేతిక విప్లవం మానవజాతి ఉత్పాదక సామర్థ్యాన్నీ, సౌకర్యాలను మెరుగుపరిచినట్లే,  అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ విధ్వం సక సమస్యలకు కూడా కారణమౌతోంది. అదే కోవలో శరవేగంగా ముందుకు దూసుకొస్తున్న 5జీ (ఎన్‌ఆర్‌) సాంకేతిక పరిజ్ఞానం సృష్టించబోయే విధ్వంసాన్ని పలువురు పర్యావరణ వేత్తలు అంచనాలు వేస్తున్నారు. వాతావరణ మార్పు వల్ల మానవజాతి మనుగడకు సంభవించే ప్రమాదం కంటే, దానికి ముందుగానే ఈ 5జీ వల్ల ఎన్నో రెట్లు విధ్వంసం జరుగుతుం దని వారు ఆందోళన చెందుతున్నారు. ధ్వని, వాయు, కాంతి, ఘన, ద్రవ వ్యర్థాల కాలుష్యం కంటే 5జీ అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ జనాభా శారీరక, మానసిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతోందనీ, జీవజాలం శరవేగంగా అంతరించిపోవడాన్ని ఈ సాంకేతికత మరింత వేగవంతం చేస్తుందని పర్యావరణవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

5జీ అంటే ఒక మొబైల్‌ నెట్‌వర్క్‌. ఇప్పటిదాకా మొబైల్‌ నెట్‌వర్క్‌ మనుషుల మధ్య అనుసంధాన కర్తగా మాత్రమే వ్యవహరించింది. అయితే ఈ నెట్‌వర్క్‌ మనుషులతోపాటు యంత్రాలనూ అనుసంధానించి, వాటిని నియంత్రించడం కూడా సాధ్యం చేస్తుంది. ఈ సాంకేతికత సరికొత్త ఉన్నత సామర్థ్యాన్ని, మరింత సమర్థ నిర్వహణను అందుబాటులోకి తీసుకొస్తుంది. దాంతో వినియోగదారులు మరింత గొప్ప అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా సరికొత్త పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. మనుషుల ప్రైవసీ మరింత కుదించుకుపోతున్నప్పటికీ, 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా సరుకులు, సేవల వాణిజ్యంలో రూ. 12 లక్షల కోట్లతో 5 జీ మార్కెట్‌ విస్తృతమవగలదని కార్పొరేట్‌ వర్గాలు కలలుకంటున్నాయి. దీంతో, గ్లోబల్‌ స్థాయిలో 2 కోట్ల 20 లక్షల ఉద్యోగాలు పుట్టుకురావడమే కాక, రూ. 3 లక్షల 50 వేల కోట్లు.. వేతనాల రూపంలో అందుతాయని ఆర్థికవేత్తలు లెక్కిస్తున్నారు. కానీ అభివృద్ధి పేరుతో ముందుకొస్తున్న విధానాలపై ప్రభుత్వాలు, పారి శ్రామిక శక్తులు చేస్తున్న బాకాల కోవలోకే ఇది వస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 5జీ సాంకేతికత కోసం శాటిలైట్‌ల వ్యవస్థను రూపొందించేందుకు సన్నాహాలు సిద్ధమైనాయి. ముఖ్యంగా అమెరికన్‌ ప్రైవేట్‌ రాకెట్‌ సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థ ‘స్టార్‌ లింక్‌’ కార్యక్రమం పేరుతో భూ కక్ష్యలోకి 42వేల చిన్న చిన్న టెలికమ్యూనికేషన్‌ ఉపగ్రహాలతో కూడిన ఒక పెద్ద కూటమి/ సముదాయం/ ఉపగ్రహాల మండలిని ఏర్పాటు చేయతలపెట్టింది. అందుకోసం ఇప్పటికే 180 టెలి కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించింది. స్పేస్‌ ఎక్స్‌కు పోటీగా అనేక ఇతర సంస్థలు కూడా టెలికమ్యూనికేషన్‌ శాటిలైట్లను ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

5జీ నెట్‌వర్క్‌ కోసం వినియోగిస్తున్న అత్యంత శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలు మన స్వేద నాళాల్ని యాంటెన్నాగా వినియోగించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలోనే అతి పెద్ద అవయవమైన చర్మాన్ని 5జీ నెట్‌ వర్క్‌ పూర్తిగా వినియోగించుకోబోతుండడం ఆందోళనకరం. వైర్‌లెస్‌ రేడియేషన్‌ అండ్‌ ఈఎమ్‌ఎఫ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మార్టిన్‌ పాల్‌ ప్రకారం మనుషుల్లో  ముందస్తుగానే వృద్ధాప్య లక్షణాలు రావడం, వివిధ శారీరక రుగ్మతలు, సంతాన సామర్థ్యం కోల్పోవడం, మెదడు, గుండె వంటి వాటిపై తీవ్ర ప్రభావం వేయడంతో పాటు జన్యుపరంగా ప్రతికూల ప్రభావాలుంటాయని ఆయన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే డ్రోన్‌లతో యుద్ధ రంగం స్వభావం మారిపోవడం మన అనుభవంలోకి రావడం చూసాం. భూగోళంపై జీవ వ్యవస్థలకు మొత్తంగా పర్యావరణానికి 5జీ సాంకేతికతతో ప్రమాదం ఏర్పడడమే కాకుండా, ఆధునిక యుద్ధ రూపురేఖలు గణనీయంగా మారిపోతుండడంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వైవిధ్యపూరిత మానవ నాగరికతలు, సంస్కృతులు ఈ కార్పొరేట్‌ సాంస్కృతిక దాడిలో వేగంగా ఆవిరైపోయి అమానవీయత, విశృంఖలత విశ్వరూపం ధరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన 5 జీ వ్యతిరేక గ్లోబల్‌ నిరసనలు వెల్లువెత్తనున్నాయి. 
(రేపు 5జీ సాంకేతికతకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన సందర్భంగా)

వెన్నెలకంటి రామారావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మొబైల్‌: 95503 67536

మరిన్ని వార్తలు