గోవింద నామస్మరణే దివ్యౌషధం

23 Apr, 2020 00:02 IST|Sakshi

సందర్భం

కరోనా పంజాతో యావత్‌ ప్రపంచం విల విల్లాడుతున్న సంక్లిష్ట సమయమిది. మానవా ళికి పెనుసవాల్‌ విసిరిన కరోనా కరాళ నృత్యం ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఎటుచూసినా భయం ఆవరించిన వర్తమాన దృశ్యం విషాదం. మానవాళికి విపత్తులు, ప్రకృతి ప్రకోపాలు, అంటువ్యాధులు, తుపానులు, భూకంపాలు కొత్త కాదు. కానీ ప్రతి సందర్భం లోనూ ఈ ప్రకోపాలపై మనిషి విజయపతాక ఎగురవేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మనలాంటి అభివృద్ధి చెందు  తున్న దేశాల్లో లాక్‌డౌన్‌ అనేది ఆర్థిక వ్యవస్థను ఎంతగా కుదేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విపత్తు వేళ మన ప్రజలు చూపుతున్న నిబ్బరం ప్రశంసనీయం. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంక్షోభ సమ యంలో ఎన్నో పారమార్థిక కార్యక్రమాలతోపాటు మానవసేవే మాధ వసేవ అనే సూక్తిని అక్షరాలా పాటిస్తూ సర్వేజనాసుఖినోభవంతు అనే సనాతన ధార్మిక ఆచరణను తు.చ. తప్పక పాటిస్తోంది.

టీటీడీ ముందుచూపు
కరోనా విపత్తును ముందుగా ఊహించి సరైన చర్యలు తీసుకోవడం లోనూ, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడటం   లోనూ టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. మార్చి 17 నాటికే కరోనా సమస్యపై తగు చర్యలు తీసుకుంది. భక్తులు వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 17 నుంచి టైమ్‌ స్లాట్‌ టోకెన్లు జారీ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1, 2లలో భక్తులు వేచి ఉండే పని లేకుండా నేరుగా అనుమతించారు. కొండపైన ప్రతి రెండు గంట లకోసారి అన్ని ప్రదేశాలను శానిటైజేషన్‌ చేయించింది. కరోనా నియం త్రణలో భౌతిక దూరం పాటించడం కీలకం కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సంప్రదించి ఆయన సూచనల మేరకు టీటీడీ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తు న్నట్లు మార్చి 19న టీడీడీ అధికారులు ప్రకటించారు.

మార్చి 20 ఉదయం ఆర్జిత సేవా భక్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించి, కొండపై ఉన్న భక్తులందరికీ వీలైనంతవరకు దర్శనం కల్పించాక అందరినీ కొండనుంచి దింపివేశారు. ఆరోజు నుంచి తిరుమలేశుని సేవలన్నిం టినీ ఏకాంతంగా ఆగమోక్తంగా టీటీడీ నిర్వహిస్తోంది. అదే సంద ర్భంలో లాక్‌డౌన్‌ వేళ తిరుమలేశుని దర్శించుకోలేమనే చింత లేకుండా.. ప్రతిరోజూ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ద్వారా తిరుమలేశుని కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తిరుచా నూరు అమ్మవారి కల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు స్వామి అమ్మవార్ల దివ్యాశీస్సులు అందిస్తోంది. అలాగే లక్షలాది ప్రజలతో జరిగే ఒంటిమిట్ట శ్రీసీతారామస్వామి వారి కల్యా ణోత్సవాన్ని ఆలయప్రాంగణానికే పరిమితం చేసి, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో భక్తజనులకు చూపగలిగాం.

రోగాలను అరికట్టే యాగాలు!
కరోనా విజృంభణ వేళ మానవజాతి సమస్తం ఈ గండం నుంచి గట్టెక్కాలని భావించిన టీటీడీ ఇందుకు వేదసారస్వతాన్ని అందులో పేర్కొన్న పరిష్కాకారాలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మార్చి 26 నుంచి 28వ తేదీ  వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగాన్ని మూడురోజులపాటు తిరుమలలోని ధర్మ గిరి వేదవిజ్ఞాన పీఠంలో ఘనంగా నిర్వహించింది. కరోనా కట్టడికి శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జప యజ్ఞాన్ని తిరుమలలోని ఆస్థాన మండపంలో మార్చి 16 నుంచి 25వ తేదీవరకు వైభవంగా నిర్వహిం చింది. ఇందులో చతుర్వేదాలను, పంచశాఖలను, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేదపండితులు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞ మంత్రాలను పఠించారు.

ఇక లోక క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించా లని భగవంతుడిని ప్రార్థిస్తూ యోగవాశిష్టం, శ్రీ ధన్వంతరి మహా మంత్ర పారాయణం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఏప్రిల్‌ 10వ తేదీన ప్రారంభించారు. ఇందులో భక్తులు కూడా భాగస్వాములు కావడం విశేషం. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన పండి తులు చెప్పిన మంత్రాలను భక్తులు టీవీల ముందు కూర్చుని పఠి స్తున్నారు. ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రతిరోజూ ఉదయం 7 గంట లకు మొదలై 45 నిమిషాల పాటు ప్రసారమవుతోంది.

మానవసేవే మాధవసేవ
కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తిరుపతి, పరిసర ప్రాంతాలలోని వేలాదిమంది నిరాశ్రయులకు, వలస కూలీలకు ప్రతినిత్యం 1,20,000 ఆహార పొట్లాలను అన్నప్రసాద విభాగం ద్వారా తయారుచేసి అందిస్తోంది. దీంతోపాటు గోశాలల్లో వేలాది గోవులను సంరక్షిస్తున్న టీటీడీ.. తిరుపతిలో సుమారు 500 వీధి కుక్కలకు ఆహారం సరఫరా చేస్తోంది. రోడ్లమీద తిరిగే పశువుల కోసం తిరుపతిలోని అలిపిరి లింక్‌ బస్టాండ్‌ వద్ద తాత్కాలిక పశువులశాలను ఏర్పాటు చేసింది. రోజుకు సుమారు 3 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం, 300 కిలోల దాణాను టీటీడీ సరఫరా చేస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానములు తన ఆయుర్వేద పరిశోధన లలో భాగంగా కరోనా కట్టడికి ఐదు రకాల మందులు తయారు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా తిండిలేక అల్లాడుతున్న నిరా శ్రయుల కోసం అన్న ప్రసాదాలు తయారు చేస్తున్న టీటీడీ సిబ్బందికి ముందుగా వీటిని అందజేశారు. ఈమేరకు 200 మంది వంట సిబ్బందికి ఐదు రకాల మందుల పంపిణీ జరిగింది. వీటిలో ‘రక్షోజ్ఞ ధూపం’ (క్రిమిసంహారక ధూపం), ‘పవిత్ర’ (చేతులు శుభ్రపరచుకునే ద్రావకం), ‘గండూషకము’ (పుక్కిలించే మందు), ‘నింబనస్యము’ (ముక్కులో వేసుకునే చుక్కల మందు), ‘అమృత’ (వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలు) తయారు చేసింది.

కరోనాపై యుద్ధానికి 19 కోట్లు
ఇక రాయలసీమలోనే పేరుగాంచిన స్పెషాల్టీ ఆసుపత్రి స్విమ్స్‌ను పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్పు చేసింది. స్విమ్స్‌ ఆవరణలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి కరోనా ఆసు పత్రిని ఏర్పాటు చేశారు. ఇందులో వెంటిలేటర్లు, ఇతర వైద్య సామగ్రి కొను గోలుకు, వసతుల కల్పనకు 19 కోట్లు టీటీడీ మంజూరు చేసింది. కరోనా సహాయక చర్యల కోసం టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరులో గల పద్మావతి నిలయాన్ని, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీని వాసం, మాధవం విశ్రాంతి గృహాలు, రెండో సత్రం చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగానికి టీటీడీ అప్పగించింది.

ఎస్వీబీసీ ద్వారా చైతన్యం
తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ ద్వారా శ్రీవారి కల్యాణోత్సవాన్ని, కొండపై జరుగుతున్న హోమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే కోవిడ్‌–19 నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సూచనలతో కూడిన కార్యక్రమాలను రూపొం దించి ప్రసారం చేస్తోంది. ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించిన వేళ.. ప్రతిరోజూ తిరుమలేశుని దర్శించుకునే భాగ్యం ఈ చానల్‌ ద్వారా కల్పించగలుగుతున్నాము.

మహమ్మారులపై మహాత్ముల పోరు!
1899 మార్చి నెలలో ప్లేగు వ్యాధితో కకావికలమైన కలకత్తా నగరంలో వివేకానందుడు యుద్ధప్రాతిపదికన ప్రజలను జాగృతం చేశారు. ప్రతి రోజూ 75 మంది మరణాలను చవిచూసిన కలకత్తా నగరం అనతి కాలంలోనే తేరుకోవడానికి ప్రధాన కారణం స్వామి వివేకానందుడు, సిస్టర్‌ నివేదితల ప్రణాళికాబద్ధమైన సేవే. ఇక ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌  పరిశుభ్రతకు, పెద్ద పీట వేశారు. 1927 జూలై 23న అహ్మదాబాద్‌ భారీవర్షాలతో తల్లడిల్లిపోయింది. దానికి తోడు ప్లేగు మహమ్మారి కూడా ప్రబలడం మొదలైంది. ఆనాడు అహ్మదాబాద్‌ మునిసిపాలిటీ శానిటరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

వర్షాలు, ప్లేగు, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పన్ను కట్టాల్సిందేనంటూ ఆంగ్లేయుల ఒత్తిడి, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పటేల్‌ ఎంతో నిబ్బరంగా వ్యవహరించి మారుమూల ప్రాంతాలకు సైతం వాలంటీర్‌ వ్యవస్థను విస్తరించి ఎవరెవరికి ఎటువంటి సాయం అవసరమో గుర్తించి వారిని సకాలంలో ఆదుకోగలిగే ప్రణాళికను పటిష్టంగా అమలు చేసి అందరనీ ఆశ్చర్య చకితులను చేశారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సాధించిన ఈ ప్రయోజనం అప్పటి ప్రభుత్వాలను విస్మ యానికి గురిచేసింది. ఇదే సంప్రదాయాన్ని ఏపీ ప్రభుత్వం అద్భు తంగా అమలుచేస్తోంది. ఈరోజు మారుమూల పల్లెల్లో సైతం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే వాలంటీర్‌ వ్యవస్థే కారణం. కోవిడ్‌ 19 బాధితులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలోనూ, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అందిస్తున్న సమాచారం కీలకంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దార్శనిక తకు వాలంటీర్ల వ్యవస్థ కలికితురాయి.

నిత్యకల్యాణం పచ్చతోరణం
నిత్యకల్యాణం పచ్చతోరణమనే నానుడికి ఏ మాత్రం భంగం కలగ కుండా తిరుమలను పచ్చతోరణంలా ఉంచటంలో టీటీడీ అమోఘ మైన కృషి చేస్తూనే ఉంది. గోవిందా అని ఎలుగెత్తి స్మరిస్తే చాలు ‘పంతమున నాతనిపై భారము వేసిన నింత ఉద్యోగములు గోవిం దుడే ఎఱగు’ అని అన్నమయ్య శ్రీవారి గుణరహస్యాన్ని వ్యక్తీకరిం చాడు. ఈ క్లిష్ట సమయంలో భక్తులు తమ మొరను స్వామి వారికి విన్న వించుకోవాలి. ఎందుకంటే ఆయన ‘చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రము. రోగాల నుంచి రక్షించే దివ్యౌషధము’. శ్రీనివాసుని వేడు కుంటూ మహర్షులు అందించిన వైదిక మార్గంలో శుచి, శుభ్రతలను పాటిస్తూ, సామాజిక దూరాన్ని ఆచరిస్తూ ‘గోవిందేతి సదా స్నానం.. గోవిందేతి సదా జపం.. సదా గోవింద కీర్తనం’గా మన జీవన సరళిని మార్చుకుంటూ భగవంతుడు ప్రసాదించిన జీవితానికి పరమార్థం తెలుసుకుని ఈ కష్టకాలంలో ఒక్కటిగా నిలుద్దాం. ఏడుకొండలవాడి దయతో కరోనాపై విజయం సాధిద్దాం. ఓం నమో వేంకటేశాయ.


వై.వి. సుబ్బారెడ్డి 
వ్యాసకర్త అధ్యక్షులు, తిరుమల తిరుపతి దేవస్థానములు

మరిన్ని వార్తలు