కడపలో రైతు సదస్సు రసాభాస...

5 Apr, 2016 13:47 IST|Sakshi

- కలెక్టర్- ప్రజాప్రతినిధుల వాగ్వాదం

కడప(వైఎస్సార్ జిల్లా)

 వైఎస్సార్ జిల్లా కడప నగరంలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రధాని ఫసల్ భీమా యోజనపై రైతుల అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ప్రజాప్రతినిధులు- కలెక్టర్ మధ్య వాగ్యుద్ధం జరగడంతో రైతులందరూ సదస్సును మధ్యలోనే బహిష్కరించారు. తీవ్ర గందరగోళం మధ్య సదస్సు అర్ధంతరంగా ముగిసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను మంటకలుపుతోందని, రాజధాని కోసం కృష్ణా జిల్లాలో సేకరించిన 57వేల ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలోని 57 వేల ఎకరాల భూములను అటవీ శాఖకు బదలాయించడాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు.

 ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా రైతులు, ప్రజల అవసరాలకు ఉపయోగపడే 57 వేల ఎకరాల భూమిని అటవీశాఖకు బదలాయించడం దారుణమని, దీనిని తాము అంగీకరించేది లేదని, దీనిపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. రైతులను నట్టేట ముంచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ అడ్డుకోవాలని వారు కోరారు.

మధ్యలోనే జోక్యం చేసుకున్న కలెక్టర్ ఇది రాజకీయ సభ కాదని, ప్రజాప్రతినిధులకు తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని  చెప్పడంతో రభస మొదలైంది. జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడే విషయమై తాము మాట్లాడుతుంటే రాజకీయాలనడం సరికాదని సి.రామచంద్రయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి సదస్సునుంచి వెళ్లిపోయారు. వారి వెనుకే రైతులందరూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. విధిలేక అధికారులు సదస్సును అర్థంతరంగా ముగించారు.

మరిన్ని వార్తలు