ఇతర మున్సిపాలిటీల్లోనూ భారీగా పెంపు!

23 Jul, 2015 02:00 IST|Sakshi
ఇతర మున్సిపాలిటీల్లోనూ భారీగా పెంపు!

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను 47.05 శాతం పెంచిన ప్రభుత్వం... రాష్ట్రంలోని మిగతా 67 పురపాలక సంస్థల్లోనూ వేతనాల పెంపు దిశగా కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500 నుంచి రూ.12,500కు, డ్రైవర్ల వేతనాన్ని రూ.10,200 నుంచి రూ.15,000కు పెంచడంతో.. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల కార్మికుల్లో ఆశలు చిగురించాయి. కానీ వాటిల్లో జీహెచ్‌ఎంసీ స్థాయిలో వేతనాల పెంపు సాధ్యంకాదని పురపాలక శాఖ ఇప్పటికే తేల్చేసింది.

అయినా కార్మికులకు సంతృప్తి కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాల పెంపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదనలను సమర్పించాలని సీఎం కేసీఆర్.. గత శుక్రవారం జరిగిన ఓ సమీక్షలో పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు కూడా. ఈ మేరకు పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. అయితే పురపాలికల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 20 నుంచి 30 శాతానికి మించి వేతనాలను పెంచితే భరించడం కష్టమని పురపాలక సంఘాల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.

అయినప్పటికీ మున్సిపాలిటీల ఆర్థిక సామర్థ్యం, ఆదాయం పెంచుకునే వనరులను దృష్టిలో పెట్టుకుని కార్మికుల వేతనాలను 30 నుంచి 40 శాతం వరకు పెంచవచ్చని పేర్కొంటూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. తాత్కాలిక కార్మికుల కనీస వేతనాన్ని నగర పంచాయతీల్లో రూ.7,300 నుంచి రూ.9,855కు, మున్సిపాలిటీల్లో రూ.8,300 నుంచి రూ.11,205కు, కార్పొరేషన్లలో రూ.8,500 నుంచి రూ.11,900కు పెంచాలని ప్రతిపాదించింది. జీహెచ్‌ఎంసీలో 47.05 శాతం వేతనాలను పెంచిన నేపథ్యంలో.. నగర పంచాయతీల్లో 30 శాతం, మున్సిపాలిటీల్లో 35 శాతం, మున్సిపల్ కార్పొరేషన్లలో 40 శాతం పెంచాలని కోరింది.

ప్రస్తుతం సీఎస్ రాజీవ్‌శర్మ పరిశీలనలో ఈ ఫైలు ఉంది. అనంతరం సీఎం కేసీఆర్‌కు పంపుతారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం వెలువడవచ్చని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల తరహాలోనే వీరికి సైతం జూలై నెల నుంచి వేతన సవరణను వర్తింపజేసే అవకాశముందని పేర్కొంటున్నారు. మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ పిలుపుతో ఈనెల 6 నుంచి తాత్కాలిక కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారానికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి వామపక్షాలు, కార్మిక సంఘాలు బస్సు యాత్రను నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు