మీరే పారిశ్రామిక రాయబారులు!

23 Jul, 2015 02:59 IST|Sakshi
బుధవారం సచివాలయంలో రెండో దశ టీఎస్ ఐపాస్ అనుమతి పత్రాలను ఫార్చ్యూన్ ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సుశం శర్మకు అందజేస్తున్న సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులు తెలంగాణకు పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్)లో భాగంగా రెండో విడతలో 16 పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు బుధవారం సచి వాలయంలో ఆయన అనుమతిపత్రాలు అందజేశారు. అనంతరం వారితో విడివిడిగా భేటీ కావడంతో పాటు గ్రూప్ ఫొటో దిగారు.

పరిశ్రమల ఏర్పాటుపై ఏవైనా సమస్యలుంటే సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్  అదనపు ము ఖ్యకార్యదర్శి శాంతికుమారి దృష్టికి తీసుకు రావాల్సిందిగా సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లోగా అనుమతులు ఇస్తామని ప్రకటించి న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హామీలో భాగంగానే గతనెల 23న రూ.1,521.42 కోట్ల పెట్టుబడులతో ముందు కు వచ్చిన 17 పరిశ్రమలకు తొలి విడతలో అనుమతులు ఇచ్చామని తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యు త్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. సీఎం చేతుల మీదు గా అనుమతి పత్రాలు అందుకున్న వారిలో స్పెయిన్‌కు చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ కెమోతోపాటు తోషిబా, మైక్రోమ్యాక్స్, పారగాన్ తదితర సంస్థలకు చెందిన సీఎండీలు, సీఈఓలు, చైర్మన్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, చేజింగ్ సెల్ అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
 
16 సంస్థలు.. 19 యూనిట్లు..
టీఎస్ ఐపాస్‌లో భాగంగా రెండో విడతలో బుధవారం అనుమతులు పొందిన 16 సంస్థలు (19 యూనిట్లు) రాష్ట్రంలో రూ.1,087.37 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్,   మెదక్, వరంగల్ జిల్లాలో ఈ పరిశ్రమల స్థాపన ద్వారా 5,321 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అనుమతులు పొందిన వాటిలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, హెలికాప్టర్ కేబిన్ కిట్ల తయారీ, ఉక్కు, ఇనుము మిశ్రమ లోహాల పోత, పాదరక్షలు, సెల్‌ఫోన్ల తయారీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు