‘కాల్’ కంత్రీలు

11 Jan, 2015 00:42 IST|Sakshi
‘కాల్’ కంత్రీలు

అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను లోకల్‌గా మళ్లింపు
తక్కువ ధరలకు అందిస్తున్న ముఠా అరెస్ట్

 
 రాంగోపాల్‌పేట్ : అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మళ్లిస్తున్న ముఠాను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్ ఏపీ ఆనంద్ కేసు వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీ ప్రశాంత్ అపార్ట్‌మెంట్‌లో నివసించే కృష్ణ చైతన్య(29) బీటెక్ పూర్తి చేశాడు. ఆగాపూరకు చెందిన గడ్డం రాజ్‌సాయి రాహుల్ కుమార్(28), అదే ప్రాంతానికి చెంది పిట్లం రామకృష్ణ(27), సిద్ధార్థ(24), షేక్‌పేట్ మారుతీనగర్‌కు చెందిన పిట్ల అనురూప్ స్నేహితులు. వీరు ముఠాగా ఏర్పడి ఆసిఫ్‌నగర్, హాంక్‌కాంగ్‌లో కృష్ణ చైతన్య ఎండీగా, డీవీఎల్  గ్రూప్ (డిజిటల్ వాయిస్ ల్యాబ్ గ్రూప్) అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే హైదర్‌షాకోట్‌లో దేశి వాయిస్ మొబైల్ ల్యాబ్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. ఈ ముఠా అంతర్జాతీయ ఫోన్ కాల్స్ (ఐఎస్టీడీ)ను ఇంటర్నెట్ ద్వార లోకల్ కాల్స్‌గా మార్చి తక్కువ ధరలకు వివిధ సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్నారు.  ఐఎస్టీడీ కాల్స్‌ను లెసైన్సు కలిగిన కొన్ని టెలికాం సంస్థలు మాత్రమే గేట్ వే ద్వార పంపిస్తుంటారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి ఎవరికి వెళుతున్నాయి అనేది నమోదు అవుతుంది. కానీ ఈ సంస్థ ఢిల్లీ నుంచి వీఓఎస్ అనే సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి, ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను మళ్లిస్తున్నాయి. దీంతో లెసైన్సు కలిగిన టెలికాం సంస్థలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వీరి ద్వార వెళ్లే కాల్స్‌ను గుర్తించడం కష్టం.

వీటికి కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ లేకపోవడంతో తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలుంటాయి. ఇది జాతీయ భద్రతకు కూడా చాలా ముప్పు ఉంటుంది. నిందితులు కొన్ని సంస్థలతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని వారికి తక్కువ ధరలకే  అంతర్జాతీయ కాల్స్‌ను అందిస్తున్నాయి. అలాగే నెట్‌లో యాడ్స్ ఇచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ మేరకు  సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కార్యాలయాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సీపీయూలు, ఐదు మొబైల్ ఫోన్లు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ధర్యాప్తు కోసం ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరో నిందితుడు అనుదీప్ పరారీలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు