మార్చి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

14 Feb, 2016 02:18 IST|Sakshi
మార్చి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. 14వ తేదీన ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మార్చి 28వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ తేదీలనే ఖరారు చేసినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు ముందు తన కార్యాలయ అధికారులతో బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, సమావేశాల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. మార్చి తొలివారంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల ఎన్నికలను జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
 
 ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి 10 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ లోగా బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి జీరో బేస్డ్ బడ్జెట్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 16వ తేదీలోగా కొత్త ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని అన్ని శాఖలను సీఎం ఆదేశించడం తెలిసిందే. ప్రణాళిక విభాగం సైతం ప్రతిపాదనల కసరత్తులో నిమగ్నమైంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వరుసగా నాలుగు రోజుల పాటు అన్ని శాఖలతో బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వచ్చే వారం నుంచి శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత మంత్రులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతిపాదనలను పరిశీలించి తుది కేటాయింపులను ఖరారు చేయనున్నారు. నెలాఖరులోగా ఈ కసరత్తు పూర్తి కానుంది. కాగా, ఈ నెలాఖరున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
 
 దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై కూడా స్పష్టత రానుంది. దీంతో వాస్తవికతను ప్రతిబింబించేలా రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేయడం సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా బడ్జెట్ సమావేశాలను 16 రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు సెలవు దినాలు మినహాయించి పని దినాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే మార్చి 10వ తేదీన సమావేశాలు ప్రారంభించి.. వరుసగా 3 ఆదివారాలు మినహా మిగతా రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మరిన్ని వార్తలు