బెట్టింగ్స్ వయా బ్యాంక్ అకౌంట్స్!

27 Apr, 2016 00:52 IST|Sakshi
బెట్టింగ్స్ వయా బ్యాంక్ అకౌంట్స్!

* ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా
* దాడి చేసి ముగ్గురిని పట్టుకున్న ఎస్‌ఓటీ కాప్స్
* రూ.9 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్స్ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు తెలివిమీరుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎక్కడా పంటర్లు ‘ప్రత్యక్ష సంబంధాలు’ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠాను మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఈ ముఠా నుంచి రూ.9 లక్షల నగదు, ల్యాప్‌టాప్స్, టీవీ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఈ.రామ్‌చంద్రారెడ్డి తెలిపారు. బెట్టింగ్స్ సాంకేతిక పరిభాషలో పందాలు నిర్వహించే వాళ్లను బుకీలని, పందాలు కాసే వ్యక్తుల్ని పంటర్లనీ అంటారు. సికింద్రాబాద్‌లోని సింధి కాలనీకి చెందిన పి.మహేష్‌బాబు నేతృత్వంలో హస్మత్‌పేట్‌కు చెందిన మహేష్‌కుమార్, రసూల్‌పురవాసి బి.కిరణ్‌కుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ త్రయం దాదాపు ఐదేళ్లుగా బెట్టింగ్ దందా నిర్వహిస్తోంది.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జిత్తు ద్వారా ఎప్పటికప్పుడు బెట్టింగ్ రేట్లు తెలుసుకోవడంతో పాటు ఫోన్స్ కనెక్టింగ్ బాక్స్‌ల్నీ సమీకరించుకున్నారు. ఈ ముగ్గురూ బెట్టింగ్స్ నిర్వహణలో ఏ కోణంలోనూ పోలీసుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్‌బాబు మల్కాజ్‌గిరిలోని వాణి నగర్‌లో నివసించే తన రెండో భార్య ఫ్లాట్‌నే డెన్‌గా మార్చుకున్నాడు. అక్కడే టీవీ, ల్యాప్‌టాప్స్, ఫోన్లు తదితరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు బుకీలు ఇతడికి సహకరిస్తున్నారు.

పరిచయస్తులైన పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా బెట్టింగ్స్ అంగీకరిస్తున్న ఈ ముఠా... అందుకు సంబంధించిన డబ్బును నేరుగా తీసుకునేదికాదు. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడం, వాటి ద్వారానే బదిలీ చేయడం చేసేది. ఈ గ్యాంగ్ ఉప్పల్‌లో జరుగుతున్న మంగళవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ కోసం బెట్టింగ్స్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్‌ఓటీకి సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ ఎన్‌సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం వాణినగర్‌లోని ఫ్లాట్‌పై దాడి చేసి మహేష్‌బాబు, మహేష్ కుమార్, కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న జిత్తు కోసం గాలిస్తోంది.

మరిన్ని వార్తలు