హైటెక్ బెట్టింగ్ దందా గుట్టు రట్టు

28 Apr, 2016 02:26 IST|Sakshi
హైటెక్ బెట్టింగ్ దందా గుట్టు రట్టు

క్యాష్ డెలివరీ బాయ్ పట్టివేత పరారీలో బుకీలు


సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్న బెట్టింగ్ దందా గుట్టును రట్టు చేశారు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ముఠాకు చెందిన క్యాష్ డెలివరీ బాయ్‌ను అరెస్టు చేసి రూ.7.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... ఫీల్‌ఖానాకు  చెందిన విశాల్‌విశాల్ గతంలోనూ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ముఖేష్, గౌరవ్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులకు చిక్కకుండా పక్కాగా దందా నిర్వహిస్తున్నాడు. గోవాలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఈ ముగ్గురూ బల్క్ ఎస్సెమ్మెస్‌ల ద్వారా సందేశాలు పంపుతూ పంటర్లను ఆకర్షిస్తున్నారు. 

పందాలు కాసేవారి (పంటర్లు) నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి, వాటిని రికార్డు చేయడానికి ఉద్యోగుల్ని నియమించుకున్నారు. పందెం డబ్బు వసూళ్లు, గెలిచిన వారికి చెల్లింపులు చేయడానికి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు టర్నోవర్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం బుధవారం వలపన్నింది. క్యాష్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నిఖిల్ షాను పట్టుకున్న అధికారులు రూ.7.5 లక్షలు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల (బుకీలు) కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు