అజిత్‌తో నాకెలాంటి విభేదాల్లేవు | Sakshi
Sakshi News home page

అజిత్‌తో నాకెలాంటి విభేదాల్లేవు

Published Thu, Apr 28 2016 2:21 AM

అజిత్‌తో నాకెలాంటి విభేదాల్లేవు

నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చడంలో భాగంగా సంఘ నిర్వాహకులు ఇటీవల స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఆ కార్యక్రమంపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు రావడం గమనార్హం.ప్రముఖ నటుడు అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను బహిష్కరించారని, సంఘం భవన నిర్మాణ నిధికి ఇలాంటి కార్యక్రమాలు అనవసరం అన్న భావనను వ్యక్తం చేశారనే ప్రచారం కలకలం సృష్టిస్తోంది.
 
 అంతే కాదు ఈ విషయంలో సంఘం కార్యదర్శి విశాల్‌కు, అజిత్‌కు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరందుకుంది.కాగా స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలు విజయవంతంగా జరిగిన నేపధ్యంలో నడిగర్ సంఘం కార్యవర్గం బుధవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం కోశాధికారి నటుడు కార్తీ మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరికి చెందిన కార్యక్రమం కాదనీ సంఘం భవన నిర్మాణం,అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అనీ అన్నారు. దీని కోసం సంఘం లోని ప్రతి సభ్యుడు శ్రమించాడని వారందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, ఆర్కెటిక్‌ను నియమించామని,ప్లాన్ కూడా సిద్ధమైందని, ఇక అప్రూవల్ అవడమే ఆలస్యం అని తెలిపారు.
 
 శంకుస్థాపన ఎప్పుడన్న ప్రశ్నకు భవన నిర్మాణానికి మొత్తం రూ.28 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికి సేకరించిన నిధితో ఆరు నెలలు మాత్రమే నిర్మాణ పనులు సాగుతాయని అందువల్ల మధ్యలో పని ఆగిపోకుండా పూర్తిగా నిధి సేకరించిన తరువాతనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు,కాగా నటుడు అజిత్ వ్యాఖ్యలపై స్పందిచాల్సిందిగా సంఘం కార్యదర్శి విశాల్‌ను అడగ్గా అజిత్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు.నిజానికి అజిత్ విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
 
 అయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ,కొందరు కావాలనే వదంతులు సృష్టించి సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీల్లో పాల్గొనక పోవడం అన్నది ఆయన వ్యక్తిగత విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  దాన్ని తాను స్వాగతిస్తున్నానని విశాల్ అన్నారు. నటుడు శింబు వ్యవహారం గురించి స్పందిస్తూ ఆయన తమ సభ్యుల్లో ఒకరని,శింబు సంఘం నుంచి వైదొలగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు.తమ ఏకైక లక్ష్యం సంఘం అభివృద్ధేనన్నారు. మీడియాలో కొన్ని అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పాత్రికేయ మిత్రులు అలాంటి వాటిని అడ్డుకోవాలని విశాల్ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పోన్‌వన్నన్  పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement