ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది.. హరికృష్ణ ఫైర్

28 May, 2016 07:49 IST|Sakshi
ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది.. హరికృష్ణ ఫైర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. నందమూరి వంశ వీరాభిమానులు, తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆనాడు ఇస్తామని మోసం చేశారు, తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, అందరం కలిసి పోరాడి హోదా తెస్తేనే మనం సిసలైన తెలుగు బిడ్డలం అవుతామని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున బయటకు వచ్చి సమరం చేయాలన్నారు. తెలుగువాడన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి పూనుకోవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు నివాళులర్పించడమే గొప్ప కార్యక్రమమని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగు జాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని.. తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానుభావుడని కొనియడారు. తిరుపతిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి హరికృష్ణ గైర్హాజరైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు