యూఎస్లో ఉన్న వివాహితకు ఆన్లైన్ వేధింపులు

29 Oct, 2016 11:16 IST|Sakshi
సైబర్‌ పోకిరీకి అరదండాలు

హైదరాబాద్: అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వివాహితను ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న సైబర్‌ పోకిరిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలు కేవలం ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణం స్పందించిన అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని కటకటాల్లోకి పంపడం విశేషం.

మహారాష్ట్రలోని సాంఘ్లీ ప్రాంతానికి చెందిన వివాహిత 2007లో హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్ లాంగ్వేజెస్‌ యూనివర్శిటీలో (ఇఫ్లూ) ఫ్రెంచ్‌ భాషలో పీజీ చేశారు. ఆ సమయంలో రిఫరెన్స్ కోసం తరచూ ఇఫ్లూ లైబ్రరీకి వెళ్ళేవారు. అప్పట్లో ఉస్మానియాలో ఇంగ్లీష్‌లో ఎంఫిల్‌ చేస్తున్న వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన దేవతల మనోహర్‌ డేవిడ్‌ మాథ్యూస్‌ ఇఫ్లూ లైబ్రరీలో ఆమెను చూసి ఇతరుల ద్వారా పేరు తెలుసుకున్నాడు. కాగా సదరు మహిళకు అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ (ఫ్రెంచ్‌ సాహిత్యం) చేసే అవకాశం రావడంతో అక్కడకు వెళ్ళారు.

డేవిడ్‌ మాథ్యూస్‌ విద్యాభ్యాసం తర్వాత ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ బోధకుడిగా చేరాడు. ఇఫ్లూ లైబ్రరీలో కనిపించిన ఆమె ఆపై కనిపించకపోవడంతో ఆమె కోసం ‘వెతకడం’ ప్రారంభించాడు. సోషల్‌ మీడియాతో పాటు ఆన్లైన్ లో ఆ వివాహిత పేరుతో భారీ సెర్చ్‌ చేసిన డేవిడ్‌ మాథ్యూస్‌ చివరకు ఆర్కూట్‌ ద్వారా ఆమె మెయిల్‌ ఐడీ తెలుసుకున్నాడు. దీనికి తన మెయిల్‌ ఐడీ నుంచి దాదాపు 200 అసభ్యకర, అభ్యంతరకర సందేశాలు పంపాడు. తనతో స్నేహం చేయాలని, హైదరాబాద్‌ వచ్చి సన్నిహితంగా ఉండాలని బెదిరించాడు.

తాను వివాహితనని, తనకు స్నేహం చేసే ఆసక్తి  లేదని ఆమె నుంచి బదులు రావడంతో డేవిడ్‌ మాథ్యూస్‌ మరింత రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈ నెల ఏడున ఈ–మెయిల్‌ ద్వారా సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, సంయుక్త కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఎస్‌.జయరామ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి వెస్ట్‌ మారేడ్‌పల్లిలో ఉంటున్న డేవిడ్‌ మాథ్యూస్‌ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ పోకిరి బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే 9490617347 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.

మరిన్ని వార్తలు