విద్యుదాఘాతానికి దంపతులు మృతి

12 Sep, 2013 00:40 IST|Sakshi

మారేడుపల్లి/రసూల్‌పురా,న్యూస్‌లైన్: వెలుగు నింపాల్సిన విద్యుత్ తీగలు ఓ ఇంట్లో చీకట్లను నింపాయి. దంపతులను బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన  కంటోన్మెంట్ పికెట్ లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం జరిగింది. పికెట్ లక్ష్మీనగర్‌లో బలరామ్(60), లక్ష్మీనర్సమ్మ(50) తమ చిన్నకూతురు జయశ్రీ(22)తో కలిసి వుంటున్నారు. లక్ష్మీనర్సమ్మ గతంలో స్థానిక అభయాంజనేయస్వామి ఆలయానికి ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించింది. అనంతరం అదే గుడిలో దేవునికి సేవలు చేస్తూ, ఆలయ శుభ్రత పనులు చేస్తోంది. ఈమె భర్త బలరామ్ మేస్త్రి.  బుధవారం ఉదయం 7 గంటలకు లక్ష్మీనర్సమ్మ ఇంటి బయట పళ్లు తోముకుంటుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగ తెగి ఆమె మెడమీద పడింది.  

ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. ఆ తీగను చేత్తో పట్టుకుని కింద పడేసేందుకు ప్రయత్నించింది.  ఇం ట్లో ఉన్న భర్త బలరామ్ బయటికి వచ్చి ఆమెను కాపాడేందుకు యత్నించగా.. అతను కూడా విద్యుదాఘాతానికి గురై కేకలు పెట్టాడు. ఇంట్లో ఉన్న చిన్నకూతురు జయశ్రీ తండ్రి అరుపులు విని బయటకు వచ్చింది. తల్లిదండ్రులను రక్షించబోగా ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. అప్పుడే అటుగా వెళ్తున్న నాగేష్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కర్రతో కొట్టి జయశ్రీని విడిపించాడు.  బలరామ్, లక్ష్మీనర్సమ్మలు అక్కడిక్కడే మృతి చెందగా.. జయశ్రీ చేయి కాలిపోయింది. ఈమె గాంధీలో చికిత్సపొందుతోంది. లక్ష్మీనర్సమ్మ మృతికి సంతాపంగా ఆభయాంజనేయస్వామి ఆలయాన్ని మూసేశారు.

 సబ్‌స్టేషన్ ముట్టడి...

 కార్ఖానా ఏఈ శిరీషా, లైన్‌మెన్ శివప్రసాద్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. మృతుల బంధువులు, బస్తీవాసులు జింఖానాలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించి ఏఈ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. కార్ఖానా,మారేడుపల్లి సీఐల ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారికి నచ్చజెప్పారు, ట్రాన్స్‌కో డీఈ రాంకుమార్, ఏడీఈలు సబ్‌స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే శంకర్రావు, వైఎస్సార్‌సీపీ నాయకులు జంపన ప్రతాప్, వెంకట్రావు, బోర్డు ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సా యన్న, పీసీసీ కార్యదర్శి అయూబ్‌ఖాన్, దేవేందర్, గజ్జేల నాగేష్ తదితర నాయకులు ఘటన స్థలానికి వచ్చి బస్తీవాసులకు అండగా నిలిచారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ జేశారు

 కేంద్ర మంత్రి సర్వే, ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం...

 కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఘటనా స్థలాన్ని వచ్చి, విద్యుత్ ఎస్‌ఈతో ఫోన్‌లో సంప్రదించగా నిబంధనల మేరకు మృతుల కుటుంబానికి మొత్తం రూ. 2 లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. మంత్రి సర్వే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడంతో వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయవడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన ఎమ్మెల్యే శంకర్రావు అధికారులతో మా ట్లాడుతుండగా.. ‘ ఏం మాట్లాడుతున్నారని స్థానికులు ఆయనను నిలదీశారు. ఎమ్మెల్యే వారిని మీకేమీ తెలియదు అనడంతో బస్తీవాసులు ఆయనపై ఆగ్ర హంతో ఊగిపోయారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయం పరిశీలిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు.
 

>
మరిన్ని వార్తలు