ఏప్రిల్ చివరినాటికి ఫీజుల ఖరారు!

23 Feb, 2016 03:14 IST|Sakshi
ఏప్రిల్ చివరినాటికి ఫీజుల ఖరారు!

ఫీజులపై మొదలైన సంప్రదింపులు
మరో నెల రోజుల పాటు చర్చలు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర వృత్తి విద్యా కళాశాలల ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు, వాటిని బట్టి ప్రతిపాదిత ఫీజులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. వాటన్నింటిని క్రోడీకరించి, ఆడిటర్ల నేతృత్వంలో కాలేజీ వారీగా ఆదాయ వ్యయాల పరిశీలన, ప్రతిపాదిత ఫీజు ఎంత మేరకు శాస్త్రీయంగా ఉందన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది.

చాలా కాలేజీలకు సంబంధించి ఈ ప్రక్రియను ఇటీవల పూర్తి చేసింది. అయితే ఆదాయ, వ్యయాలతో సంబంధం లేకుండా, ఫీజులను ప్రతిపాదించిన కళాశాలలతో సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మూడు నాలుగు ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించింది. ఆయా కళాశాలలకు వచ్చిన ఆదాయం, వారు చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రతిపాదిత ఫీజుల శాస్త్రీయతపై ఓ అంచనాకు వచ్చింది. రెండు మూడు రోజుల్లో కాలేజీ వారీగా సంప్రదింపులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నాటికి సంప్రదింపులను పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని సదుపాయాలు కలిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీల్లో కనీసంగా 15 శాతానికి అటుఇటుగా ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు